బీజేపీ తేల్చేస్తుందా... టీడీపీ జనసేన ఏం చేయబోతున్నాయి...!?
ఈ నేపధ్యంలో కీలకమైన సమావేశం ఈ నెల 21న ఢిల్లీలో జరగనుంది. ఏపీ బీజేపీ ముఖ్య నేతలు కేంద్ర బీజేపీ నేతలతో కలసి చర్చిస్తారు.
By: Tupaki Desk | 17 Dec 2023 7:00 AM ISTఏపీలో పొలిటికల్ పిక్చర్ కి క్లారిటీ రానుందా అంటే జవాబు అవును అనే వస్తోంది. ఏపీలో అధికార వైసీపీ స్పష్టంగా ఉంది. తమకు ఎవరితో పొత్తులు లేవని కూడా చెబుతోంది. ఒంటరిగానే వస్తామని అంటోంది. 2014 నుంచి చూసుకుంటే గడచిన రెండు ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేసి గెలిచింది. 2024లో కూడా అదే తీరున గెలుస్తామని చెబుతోంది.
దాంతో క్లారిటీ రావాలసింది విపక్ష కూటమిలోనే. ఏపీలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఇక బీజేపీతో జనసేన ఉంది. ఇపుడు కలవల్సింది ఈ మూడు పార్టీలే. బీజేపీతో పొత్తుకు టీడీపీ సుముఖంగా ఉందని వార్తలు వస్తున్నాయి. కేంద్రంలో మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తుంది అన్న అంచనాలు ఉన్న నేపధ్యంలో 2019 నాటి తప్పు చేయకూడదు అన్న ఆలోచనలతో టీడీపీ ఉంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే జనసేన కూడా బీజేపీని కూటమిలోకి తెస్తే 2014 నాటి రిజల్ట్స్ రిపీట్ అవుతాయని భావిస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటిదాకా ఏమీ మాట్లాడడంలేదు. బీజేపీకి చెందిన ఏపీ నాయకులు మాత్రం పొత్తు టీడీపీతో ఉండాలని కోరుకుంటున్నారు. మరో సెక్షన్ వద్దు అంటున్నారు. అలాగే టీడీపీలో కూడా కొందరు బీజేపీతో పొత్తు వద్దు అంటున్న నేపధ్యం ఉంది.
ఏది ఏమైనా బీజేపీ తోడుగా ఉంటేనే జగన్ సర్కార్ ని ఎన్నికల వేళ నియంత్రించగలమని టీడీపీ జనసేన భావిస్తున్నాయి. ఎన్నికల వ్యూహాలతో పాటు పోల్ మేనేజ్మెంట్ సవ్యంగా సాగాలీ అంటే కేంద్రంలోని బీజేపీ అండ ఉండాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే దగ్గుబాటి పురంధేశ్వరి అయితే జనసేనతో పొత్తు ఉందని ఇతర పార్టీలతో పొత్తు విషయం కేంద్ర నాయకత్వమే చూసుకుంటుందని చెప్పుకొస్తున్నారు.
ఈ నేపధ్యంలో కీలకమైన సమావేశం ఈ నెల 21న ఢిల్లీలో జరగనుంది. ఏపీ బీజేపీ ముఖ్య నేతలు కేంద్ర బీజేపీ నేతలతో కలసి చర్చిస్తారు. ఈ సందర్భంగా ఏపీలోని రాజకీయ పరిస్థితితో పాటు బీజేపీ ఏమి చేయాలనుకుంటుందో ఒక నిర్ణయం అయితే చూచాయగా అయినా వెలువడే అవకాశం ఉంది అని అంటున్నారు.
బీజేపీ టీడీపీతో పొత్తుకు సై అంటే ఏపీలోని సమీకరణలు మొత్తం మారిపోతాయని అంటున్నారు. మూడు పార్టీలు ముప్పేట దాడి చేస్తూ ఏపీలోని వైసీపీ మీద ఒక యాక్షన్ ప్లాన్ తో ముందుకు వస్తాయని అంటున్నారు. అలా కాకుండా బీజేపీ న్యూట్రల్ గా ఉండాలనుకుంటేనే మరో కొత్త చిత్రం ఆవిష్కరణ జరుగుతుంది అని అంటున్నారు.
అదెలా అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులతో సైతం పొత్తులకు కూటమి ట్రై చేస్తుందని అలా సక్సెస్ అవుతుందని అంటున్నారు. మొత్తానికి చూస్తే బీజేపీ చేతిలో ఇపుడు కీలక నిర్ణయం ఉంది అని అంటున్నారు. మరి బీజేపీ ఏపీ పాలిటిక్స్ లో అడుగులు ఏ వైపు వేయాలని అనుకుంటుంది అన్నది మాత్రం ఉత్కంఠను రేపుతోంది. ఇక బీజేపీ ఒంటరిగానే అంటే అపుడు జనసేన కూడా కొంత ఇబ్బందిలో పడుతుంది అని అంటున్నారు. ఆ పార్టీ కాంగ్రెస్ తో కలిసి పొత్తులకు వెళ్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.
