Begin typing your search above and press return to search.

హైకమాండ్ పెద్ద ఆశలు...ఏపీ బీజేపీ పొత్తు ఊసులు..!

ఏపీ బీజేపీలో ఎక్కువ మంది నాయకులు టీడీపీ జనసేన కూటమితో పొత్తు పెట్టుకుని అలా ముందుకు సాగిపోదామనే అంటున్నారు.

By:  Tupaki Desk   |   4 March 2024 1:47 PM GMT
హైకమాండ్ పెద్ద ఆశలు...ఏపీ బీజేపీ పొత్తు ఊసులు..!
X

ఎక్కడైనా నాయకత్వానికి నాయకులకు మధ్య చిన్నపాటి భేదాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అధినాయకత్వం పై నుంచి చూస్తుంది. నాయకులు తమ పరిధిలో చూస్తారు. ఇపుడు ఏపీ బీజేపీకి జాతీయ నాయకత్వానికి మధ్య అలాంటిదే జరుగుతోంది అంటున్నారు. ఏపీ బీజేపీలో ఎక్కువ మంది నాయకులు టీడీపీ జనసేన కూటమితో పొత్తు పెట్టుకుని అలా ముందుకు సాగిపోదామనే అంటున్నారు.

ఎందుకంటే వారి ఆలోచనలు వారివి. 2014లో ఒకసారి అలా పొత్తు పెట్టుకుంటే నాలుగు ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. అందులో ఇద్దరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఒకరిద్దరు ఎమ్మెల్సీలు తీసుకున్నారు. నాలుగేళ్ల పాటు టీడీపీతో బీజేపీ పొత్తు కలిపి ముందుకు సాగింది. ఆ నేపధ్యంలో ప్రభుత్వంతో పనులు కూడా చేయించుకున్నారు.

ఒక విధంగా చెప్పలంటే అధికార దర్జా అనుభవించారు. కానీ ఆ తరువాత నుంచే సీన్ మారింది. పొత్తుల నుంచి టీడీపీ వేరు పడింది. దాంతో గత ఆరేళ్లుగా ఏపీలోని బీజేపీ ఎత్తిగిల్లలేదు. ఏమీ కాకుండానే ఉంది. 2019లో సొంతంగా పోటీ చేస్తే వచ్చినవి అర సున్నా శాతం ఓట్లు మాత్రమే. దాంతో బీజేపీకి చెందిన ఏపీ నేతలు చాలా మంది పొత్తు వైపు చూస్తున్నారు అని అంటున్నారు.

ఈ అయిదేళ్లలో పార్టీ పెర్ఫార్మెన్స్ పెద్దగా ఏమీ లేదని మరోసారి ఇలాగే ఒంటరి పోరుకు వెళ్తే దెబ్బ తింటామని కూడా భయపడుతున్నారు. ఇక టీడీపీ జనసేన కూటమి అయితే కోరి పిలుస్తోంది అని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. అయితే కేంద్ర నాయకత్వం ఆలోచనలు మరోలా ఉన్నాయి. ఏపీలో ఈసారి కూడా వైసీపీ అధికారంలోకి వస్తేనే బీజేపీ ఎదుగుదల అన్నది సాధ్యపడుతుందని ఆ పార్టీ కేంద్ర వ్యూహకర్తలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఈసారి కూడా జగన్ గెలిస్తే 2029 నాటికి ఏపీలో టీడీపీ అన్నదే ఉండదని, టీడీపీ ప్లేస్ లోకి బీజేపీ చాలా సులువుగా చొచ్చుకుని పోవచ్చు అని వీలైతే అప్పటికి జనసేనతో కూడా కలసి తామే అధికారంలోకి రావచ్చు అన్నది కేంద్ర నాయకుల ఆలోచన అని అంటున్నారు. ఎప్పటికపుడు పరగడుపు అన్నట్లుగా ఏవో కొన్ని సీట్లు తీసుకుని ఒకటి రెండు మంత్రి పదవులతో అలా పక్కన ఉంటే ఏపీలో ఎప్పటికీ తాము బలపడేది ఉండదని కూడా భావిస్తున్నారు.

మరో వైపు చూస్తే ఏపీలో బీజేపీకి రాజకీయంగా కూడా ఇపుడు నష్టం లేదు అని అంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ ఎంపీలు కేంద్ర బీజేపీకి మద్దతుగానే ఉంటారు అని కూడా లెక్క వేసుకుంటున్నారు. అదే టీడీపీతో వెళ్తే ఆ పార్టీకి కొత్తాగ ఊపిరి పోస్తే మాత్రం ఈ బలంతో మరో పదేళ్ల పాటు టీడీపీ పాతుకుపోతుందని, అపుడు బీజేపీకి ఏపీలో శాశ్వతంగా పార్టీ ఎదుగుదల అన్నది నిలిచిపోతుందని భయపడుతున్నారు.

ఇప్పటిదాకా అంటే 1999 నుంచి కూడా ఏపీ బీజేపీ నేతల మాటలకే విలువ ఇస్తూ పొత్తులకు సిద్ధపడితే పార్టీని బాగు చేసుకోలేదని, అధికారం అండతో ఎక్కడా బలపడలేదని, ఇలా 1999, 2004, 2014లో ఏపీ లీడర్స్ కి ప్రాధాన్యత ఇచ్చామని వారి మాట విని పొత్తులకు సిద్ధపడ్డామని, 2024లో మాత్రం అలా జరగరాదని కేంద్ర బీజేపీ నాయకత్వం పట్టుబట్టి కూర్చుంది అంటున్నారు.

ఒకవేళ టీడీపీతో పొత్తు అంటే మాత్రం ఈసారి భారీగా డిమాండ్ చేసి లబ్ది పొందాలన్న ఆలోచనలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే పాతిక అసెంబ్లీ సీట్లు పది దాకా ఎంపీ సీట్లు తీసుకోవాలని బీజేపీ చూస్తోంది. దీని వెనక ఉద్దేశ్యం ఏమిటి అంటే ఈసారి ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే తాము కూడా కీలక భాగస్వామిగా ఉండాలన్నది.

అంటే బీజేపీ జాతీయ స్థాయిలో పెద్దలు ఏపీలో రాజకీయ అవకాశాలను ఈసరి కచ్చితంగా వాడుకోవాలని చూస్తున్నారు. గతంలో మాదిరిగా లైట్ తీసుకోవడంలేదు అని అంటున్నారు. ఇక చూస్తే మోడీ అమిత్ షాకు ఏపీ ప్రతిష్టగా మారింది అని అంటున్నారు.

ఈ ఇద్దరూ 2014లో కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చాక ఈశాన్య రాష్ట్రాన నుంచి అనేక చోట్ల అధికారం బీజేపీ సొంతం అయింది కానీ 1983 కంటే ముందు ఉమ్మడి ఏపీలో బలంగా ఉన్న బీజేపీకి విభజన ఏపీలో ఆ వైభోగం నాలుగు దశాబ్దాలు దాటినా తీసుకుని రాలేకపోయారు అన్న బాధ ఉంది. దాంతో ఈ టెర్మ్ కూడా కేంద్రంలో మోడీ ప్రధాని అవుతారు అని వార్తలు వస్తున్న టైం లో ఆయన ఇమేజ్ ని అలా వాడుకుంటూ ఏపీలో బీజేపీ అధికారంలోకి తీసుకుని రావాలి అన్నదే ఆ పార్టీ పెద్దల ఆలోచంగా ఉంది.

మరి పొత్తులు పెట్టుకుని కొన్ని సీట్లలో పోటీ చేసి మిత్రుల మద్దతుతో ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలన్న బీజేపీ ఏపీ నేతల ఆశలకు బీజేపీ పెద్దల వ్యూహాలకు మధ్య తెలియని అగాధం అయితే ఏర్పడింది. మరి ఈ చిక్కు ముడి ఎలా వీడుతుందో చూడాల్సిందే.