Begin typing your search above and press return to search.

రిజర్వేషన్‌ బిల్‌.. ఏపీలో మహిళలకు కేటాయించే స్థానాలు ఇవేనా?

వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో మరోసారి గెలవడమే లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈసారి మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుందని టాక్‌ నడుస్తోంది

By:  Tupaki Desk   |   20 Sep 2023 6:33 AM GMT
రిజర్వేషన్‌ బిల్‌.. ఏపీలో మహిళలకు కేటాయించే స్థానాలు ఇవేనా?
X

వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో మరోసారి గెలవడమే లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈసారి మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుందని టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని అంటున్నారు. సెప్టెంబర్‌ 19 దాన్ని తొలుత లోక్‌ సభలో ప్రవేశపెట్టింది. గురువారం బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ లో మహిళలకు ఎన్ని సీట్లు లభిస్తాయి? ఏయే సీట్లు లభించవచ్చని ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఇప్పటికే ప్రధాన పార్టీలు.. వైసీపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులను ఖరారు చేసుకున్నాయి. ఇక ప్రకటించమే తరువాయి అన్నట్టు పరిస్థితి ఉంది. అయితే ఉన్నట్టుండి కే ంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ అంటూ తేనె తుట్టును కదపడంతో పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. దేశవ్యాప్తంగా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఆ మేర ఆంధ్రప్రదేశ్‌ లోనూ మహిళలకు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆంద్రప్రదేశ్‌ లో 175 స్థానాలకు గానూ 33 శాతం రిజర్వేషన్‌ మేరకు 58 సీట్లు శాసనసభలో మహిళలకు కేటాయించాల్సి ఉంటుందని చెబుతున్నారు. మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలను మహిళలకు కేటాయించాల్సి ఉంటుందని అంటున్నారు. అలాగే ఏపీలో 25 లోక్‌ సభ స్థానాల్లో 8 స్థానాలను మహిళలకు కేటాయించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అలాగే తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 40 చోట్ల మహిళలకు ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంట్‌ లో ఆమోదం పొందాక దీనికి 50 శాతం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉందని తెలుస్తోంది. అలాగే ఈ ఎన్నికల్లో ( 2024) ఈ మహిళా రిజర్వేషన్‌ అమలు జరగదని అంటున్నారు. 2026 తర్వాత డీలిమిటేషన్‌ (నియోజకవర్గాల పునర్విభజన) చేపట్టాల్సి ఉందని.. ఆ తర్వాత అంటే 2029 ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్‌ అమల్లోకి రావచ్చని పేర్కొంటున్నారు. ఈ బిల్లు ఒకసారి అమల్లోకి వస్తే దీని ద్వారా ప్రతీ రాష్ట్రంలో మొత్తం స్థానాల్లో లోక్‌ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది.

ఏపీలో మొత్తం 25 లోక్‌ సభ స్థానాల్లో అత్యధికంగా మహిళల సంఖ్య 8 చోట్ల ఎక్కువగా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు ఎక్కువగా ఉన్న విశాఖపట్నం (9.20 లక్షల మహిళలు), గుంటూరు(8.82 లక్షలు), నరసరావుపేట (8.58), నెల్లూరు(8.55), తిరుపతి ((8.50–ఎస్సీ రిజర్వుడ్‌), అనంతపురం(8.48), నంద్యాల(8.38), విజయవాడ (8.30 లక్షల మంది) లోక్‌ సభ నియోజకవర్గాలను మహిళలకు కేటాయిస్తారని పేర్కొంటున్నారు.

ఈ ఏడాది జనవరి 5వ తేదీ నాటికి ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం మహిళా ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉన్న 58 నియోజకవర్గాలు ఇలా ఉన్నాయి.. భీమిలి, పాణ్యం, గాజువాక, చంద్రగిరి, తిరుపతి, మంగళగిరి, పెనమలూరు, రంపచోడవరం (ఎస్టీ), పెందుర్తి, గురజాల, విశాఖ ఉత్తరం, కోవూరు, కర్నూలు, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, గుంటూరు పశ్చిమ, గన్నవరం, మైలవరం, నెల్లూరు రూరల్, తెనాలి, నంద్యాల, అనంతపురం అర్బన్, ఇచ్చాపురం, కడప, శ్రీకాకుళం, చింతలపూడి (ఎస్సీ), రాజమండ్రి సిటీ, ప్రత్తిపాడు (ఎస్సీ), రాజమండ్రి రూరల్, గుంతకల్లు, కాకినాడ సిటీ, పలమనేరు, విశాఖ తూర్పు, మాచర్ల, వినుకొండ, కాకినాడ రూరల్, భీమవరం, రాయదుర్గం, మదనపల్లె, పోలవరం (ఎస్టీ), కావలి, జమ్మలమడుగు, కొత్తపేట, పాయకరావుపేట (ఎస్సీ), శ్రీకాళహస్తి, ప్రొద్దుటూరు, ఆదోని, విజయనగరం, రాయచోటి, కదిరి, రాప్తాడు, ఆలూరు, గుంటూరు తూర్పు, విజయవాడ పశ్చిమ, ఒంగోలు, బనగానపల్లె, తాడిపత్రి ఉన్నాయి. ఈ 58 నియోజకవర్గాల్లో మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది.

ఈ నేపథ్యంలో రాజకీయవర్గాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2029 సార్వత్రిక ఎన్నికల నాటికే ఇది అమల్లోకి వస్తుందనే స్పష్టత వచ్చినా... నిర్ణయంలో ఏ మార్పు అయినా జరిగే అవకాశం ఉందనే యోచనలోనే ఆయా పార్టీల నేతలు ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఏయే నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉందనేదానిపై ప్రజాప్రతినిధులు ఆరాలు తీసే పనిలో పడ్డారని చెబుతున్నారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లుతో తమ నియోజకవర్గం మహిళలకు పోతోందా అని కొందరు నేతలు ఆరా తీస్తున్నారు. మరికొందరు నేతలు సీటు దక్కకపోయినా తమ భార్యలనో, కుమార్తెలనో పోటీ చేయించడానికి రంగంలోకి దిగుతున్నారు.

మొదట్లో 2024 సార్వత్రిక ఎన్నికల నాటికే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని మొదట్లో ప్రచారం జరిగింది. దీంతో నేతలంతా ఆందోళన చెందారు. మహిళా రిజర్వేషన్‌ తో తమకు సీటు దక్కకుండా పోతోందని భయపడ్డారు. అయితే 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే ఇది అమలవుతుందని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.