ఎవరికి ఎన్ని సీట్లు? జిల్లాల వారీగా గెలుపు లెక్కలు
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి పార్టీలు భారీ ఆధిక్యం సాధించాయి. 659 జడ్పీటీసీ స్థానాలకు గాను 76 ఏకగ్రీవం కాగా, పోలింగ్ జరిగిన స్థానాల్లోనూ కూటమి హవా కొనసాగింది. పల్నాడు జిల్లాలో టీడీపీ అభ్యర్థి నాగోతు వెంకట లక్ష్మీ సరోజ 32,919 ఓట్ల మెజార్టీతో రికార్డు సృష్టించారు. వైసీపీ కడప జిల్లాలో కేవలం రెండు జడ్పీటీసీ స్థానాలకే పరిమితమైంది.
By: Tupaki Desk | 7 Nov 2026 7:38 PM ISTజడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో కూటమి దూసుకుపోతోంది. రాష్ట్రంలోని 28 జిల్లాల్లోనూ కూటమి పార్టీల హవాయే నడుస్తోంది. మొత్తం659 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 77 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కూటమి పార్టీలు 76 , వైసీపీ ఒక్కచోట పోటీలేకుండా గెలిచాయి. ఇక పోలింగ్ జరిగిన 582 స్థానాల్లో కూటమి పూర్తిస్థాయిలో ఆధిక్యం కనబరుస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం కూటమి పార్టీలు 184 స్థానాల్లో గెలిచాయి. మరో 122 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అదే సమయంలో ప్రతిపక్షం వైసీపీ కేవలం 5 చోట్ల మాత్రమే గెలుపొందింది. ఇంకో 16 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇందులో తుది ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంటుందోనని ఆయా పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు.
ఇక 7767 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కూటమి పార్టీలు దాదాపు 5 వేల స్థానాలలో విజయం సాధించాయి. ప్రతిపక్షం 830 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఇతరులు మరో 148 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎంపీటీసీ స్థానాల్లో ఒక్క నంద్యాల జిల్లాలో తప్ప మరెక్కడా వైసీపీ మూడు అంకెల స్కోరు దాటలేదు. ఈ జిల్లాలో కూటమి పార్టీలు 195 స్థానాల్లో గెలుపొందగా, వైసీపీ 112 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోందని చెబుతున్నారు. మరోవైపు మొత్తం 28 జిల్లాల్లో ఎక్కడా వైసీపీ జడ్పీ పీఠంను దక్కించుకునే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.
పల్నాడు జిల్లాలో రికార్డు మెజార్టీ
జడ్పీ ఎన్నికల్లో ఇప్పటికే మెజార్టీ స్థానాలు ఏకగ్రీవంగా గెలుచుకున్న టీడీపీ పోలింగ్ జరిగిన చోట సరికొత్త రికార్డులు నమోదు చేసింది. పల్నాడు జిల్లాలో మొత్తం 28 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, ఇందులో 18 ఏకగ్రీవమయ్యాయి. ఇక ఎన్నికలు జరిగిన చోట కూటమి పార్టీలే ఆధిక్యం కొనసాగిస్తున్నాయి. నకరికల్లు మండల జడ్పీటీసీగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి డాక్టర్ నాగోతు వెంకట లక్ష్మీ సరోజ ఏకంగా 32,919 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించిన నాయకురాలిగా రికార్డు నమోదు చేశారు. అదేవిధంగా ఇదే జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు జనసేన అభ్యర్థి పమిడిపాటి శ్రీనివాసరావు దాదాపు 30 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. క్రోసూరు మండలంలో మొత్తం 38 వేల ఓట్లు పోలవ్వగా, జనసేన అభ్యర్థికి 30 వేల ఓట్లు సాధించడం విశేషం. నకిరికల్లు, క్రోసూరు మండలాలే కాకుండా పల్నాడు జిల్లాలో చాలా చోట్ల కూటమి పార్టీల అభ్యర్థులు మంచి మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారని చెబుతున్నారు. నూజెండ్లలో జనసేన అభ్యర్థి బాలప్రసాద్ సుమారు 29 వేలు, మాచవరం టీడీపీ అభ్యర్థి కత్తి సరోజిని సుమారు 23 వేల ఓట్ల ఆధిక్యం సాధించారు.
కడప వైసీపీ ఖాతాలో రెండు
ఇక ఈ ఎన్నికల్లో ప్రతిపక్షం వైసీపీ చేదు ఫలితాలను ఎదుర్కొంది. మొత్తం 28 జిల్లాల్లో ఎక్కడా ఆధిక్యం కనబరచలేకపోయింది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గ కేంద్రమైన పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని కూడా వైసీపీ కోల్పోయింది. పులివెందుల నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలు ఉండగా, ఇందులో రెండు చోట్ల మాత్రమే వైసీపీ గెలిచింది. మిగిలిన ఐదు చోట్ల కూటమి హవాయే నడిచింది. నియోజకవర్గంలోని వేంపల్లి జడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి బత్తుల వెంకట శివలక్ష్ముమ్మ, వేముల జడ్పీటీసీగా అదే పార్టీ అభ్యర్థి సత్యప్రభావతమ్మ గెలుపొందారు. ఈ జిల్లాలో వేంపల్లి, వేముల తప్ప మరెక్కడా వైసీసీ ఖాతా తెరవలేదు. మొత్తం 36 జడ్పీటీసీ స్థానాలకు 23 చోట్ల ఇది వరకే ఏకగ్రీవంగా టీడీపీ కూటమి గెలుచుకుంది.
