`పరిషత్` లెక్క తేలింది.. ఫైనల్ ఫలితం ఇదే!
ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 582 జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ 406 గెలుచుకోగా, వైసీపీ 76, జనసేన 73 స్థానాలు సాధించాయి. ఎంపీటీసీ ఫలితాల్లోనూ టీడీపీ 4,806 స్థానాలతో ముందంజలో నిలిచింది.
By: Tupaki Desk | 9 Nov 2026 4:03 PM ISTఏపీలో ఈ నెల 5న జరిగిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికల తుది ఫలితాలను ఆదివారం రాత్రి.. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సుమారు రెండు రోజుల పాటు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం జరిగింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ పూర్తయినా.. మురసు తుఫాను ప్రభావిత జిల్లాల్లో మాత్రం కొంత ఆలస్యంగా ఓటింగ్ జరగడం.. అలానే కౌంటింగ్ విషయంలోనూ అధికారులు ఆచితూచి వ్యవహరించారు.
దీంతో గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం వంటి మురసు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో ఆదివారం రాత్రి 7 గంటల సమయానికి ఈ ప్రక్రియను పూర్తి చేసినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక, ఇవే తుది ఫలితాలుగా పేర్కొంది. ఈ మేరకు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేయడం గమనార్హం.
జిల్లా పరిషత్‌లో ఎవరెవరికి ఎన్ని?
జిల్లా పరిషత్ స్థానాలు: 582
టీడీపీకి దక్కినవి: 406
వైసీపీ సొంతం చేసుకున్నవి: 76
జనసేన గెలుచుకున్నవి: 73
బీజేపీ గెలిచినవి: 6
సీపీఎం పార్టీ: 1
ఇండిపెండెంట్లు: 6
మండల పరిషత్‌లో ఏ పార్టీకి ఎలా..?
రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాలు: 7768
టీడీపీ సొంతం చేసుకున్నవి 4,806
వైసీపీ దక్కించుకున్నవి : 1711
జనసేన గెలిచినవి: 938
బీజేపీ హవా: 117
కాంగ్రెస్ : 9
సీపీఎం: 15
మారిన ఫలితం..
తుది లెక్కింపునకు.. గతంలో అంటే శనివారం లెక్కిస్తున్న సమయంలో వచ్చిన ఫలితానికి మధ్య వ్యత్యాసం కనిపించింది. బాపట్ల జిల్లా చీరాలలో కాంగ్రెస్ పార్టీ 10 ఎంపీటీసీ స్థానాలను సొంతం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, తుది ఫలితం వచ్చే సరికి 9 స్థానాలకే పరిమితం అయింది. అలానే.. బీజేపీ మండల పరిషత్‌లో 125 స్థానాలు గెలుచుకున్నట్టు ఫలితాలు వచ్చినా.. తుది ఫలితం 8 స్థానాలు వైసీపీకి సొంతమయ్యాయి. ఇక, జనసేన, వైసీపీలలోనూ ఈ మార్పులు స్వల్పంగా కనిపించాయి. మొత్తంగా తుది ఫలితం వచ్చే సరికి.. కూటమి ఐక్యంగా సాధించిన సీట్లతో పోల్చి తే వైసీపీ తెల్లబోయిందనే చెప్పాలి.
నగరాలు.. పట్టణాల్లో..
స్థానిక మునిసిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు ముగియడం, అలానే తాజాగా జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు కూడా ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కోడ్ ను ఎత్తి వేసింది. నగరాలు, పట్టణాల్లో యధావిధిగా ప్రభుత్వ అధికారు ల ఆదేశాల మేరకు కార్యకలాపాలు నిర్వహించనున్నారు. అయితే.. ఈ నెల 15 నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాలతో సరిహద్దులు ఉండే పట్టణ ప్రాంతాలు, నగర ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. కాగా.. డిసెంబరు 3వ తేదీ వరకు గ్రామ పంచాయతీ సమరం జరగనుంది.
