సెప్టెంబరులో భారీ అరెస్టులు.. రెండు కీలక కేసుల్లో వేగంగా మారుతున్న పరిణామాలు
ఏపీ రాజకీయాల్లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 30 Aug 2025 11:00 PM ISTఏపీ రాజకీయాల్లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ప్రతిపక్షం వైసీపీని ఓ కుదుపు కుదిపేసే భారీ నిర్ణయాలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అంటున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ టార్గెట్ గా అనేక వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో పలువురు వైసీపీ నేతలు, వైసీపీ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులపై కేసులు నమోదుచేసి అరెస్టు చేసింది. అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియాను కట్టడి చేసే వ్యూహంతో సోషల్ మీడియా కార్యకర్తలను జైలుకు పంపింది. అయితే ఇవేవీ వైసీపీని భయపెట్టకపోగా, ఆ పార్టీ అధినేత జగన్ ప్రజల ముందుకు వస్తూ ప్రభుత్వాన్ని పలు అంశాలపై నిలదీస్తున్నారు. ఇదే సమయంలో లిక్కర్ స్కాంలో జగన్ పేరునూ ప్రస్తావిస్తూ చార్జిషీటు దాఖలు చేయడంతో ప్రభుత్వం నెక్ట్స్ టార్గెట్ మాజీ సీఎం? అన్న చర్చ జరిగింది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబరులోనే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోందని అంటున్నారు.
ప్రస్తుతం ఏపీలో వైసీపీని ఇబ్బంది పెట్టేలా చాలా కేసులు ఉన్నప్పటికీ, ప్రధానంగా రెండు కేసులపై ప్రభుత్వం ఫోకస్ చేసిందని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఒకటి లిక్కర్ కేసు కాగా, మరొకటి ఆడుదాం ఆంధ్ర పేరిట గత ప్రభుత్వం చేసిన కార్యక్రమంలో అవినీతిపై నమోదైన కేసుగా చెబుతున్నారు. లిక్కర్ స్కాంలో ఇప్పటికే కీలక అరెస్టులు చేయగా, వైసీపీని రాజకీయంగా దెబ్బతీసే భారీ అరెస్టుకు సెప్టెంబరులో రంగం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు వైసీపీకి చెందిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఐటీశాఖ మాజీ సలహాదారు కేసిరెడ్డి రాజ్ రెడ్డి అరెస్టు అయ్యారు. అదేవిధంగా వైసీపీకి సన్నిహితంగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డి, జగన్ సతీమణి భారతి కంపెనీకి చెందిన బాలాజీ గోవిందప్ప ఉన్నారు.
దీంతో లిక్కర్ కేసులో ఇప్పటికే వైసీపీ పీకల్లోతులో మునిగిపోయిందనే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్ మొత్తం 12 మందిని అరెస్టు చేసింది. రెండు చార్జిషీటులు దాఖలు చేసింది. నిందితులను అరెస్టు చేసి 90 రోజులు కావస్తున్నా, బిగ్ బాస్ ఎవరో బహిరంగంగా చెప్పలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది సిట్. అదే సమయంలో నిందితులను అరెస్టు చేసి 90 రోజులు అవుతున్నందున, వారికి డిఫాల్ట్ బెయిలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇదే జరిగితే లిక్కర్ కేసులో దర్యాప్తు పూర్తయినట్లే భావించాల్సివస్తుందని అంటున్నారు. బిగ్ బాస్ ఎవరో తేల్చకుండా, బిగ్ బాస్ కు సంబంధించిన ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం కుదరదు కనుక.. డిపాల్ట్ బెయిలుపై నిందితులు విడుదల అయ్యేలోపే కీలక అరెస్టుకు సిట్ ఉపక్రమించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఇదే సమయంలో ఆడుదాం - ఆంధ్ర స్కాంపైనా ప్రభుత్వం సెప్టెంబరులోనే అరెస్టులకు వెళ్లవచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఈ స్కాంలో దాదాపు రూ.100 కోట్లు మేర ప్రజాధనం దుర్వినియోగమైందని ఇప్పటికే ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక అందింది. దీంతో ఏసీబీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఈ కేసులో తొలుత అధికారులను అరెస్టుచేస్తారా? లేక సంబంధిత స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను అరెస్టు చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ స్కాంలో కూడా వైసీపీకి చెందిన కీలక నేతను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. సెప్టెంబరు తొలివారంలో ఉప రాష్ట్రపతి ఎన్నికల హడావుడి ఉన్నందున రెండు వారంలో ఈ కీలక రాజకీయ నిర్ణయం అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
