Begin typing your search above and press return to search.

రాజ‌కీయ చిత్రం.. ఈ నేత‌ల‌ ప‌రిస్థితి విచిత్రం.. !

ఇలా మూడుసార్లు.. మూడు చోట్ల నుంచి పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. వచ్చే ఎన్నికల నాటికి అసలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది సందేహంగా ఉంది.

By:  Garuda Media   |   28 April 2026 1:00 AM IST
రాజ‌కీయ చిత్రం.. ఈ నేత‌ల‌ ప‌రిస్థితి విచిత్రం.. !
X

రాష్ట్రంలో కొందరు యువ నేతలు దాదాపు పది పదిహేను సంవత్సరాలుగా రాజకీయ ఉన్నతి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారి ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదు. పైగా వచ్చే ఎన్నికల నాటికి కూడా వారు ఆశిస్తున్న పదవులు కానీ విజయం కానీ దక్కుతుందా అనేది సందేహంగా మారుతోంది. ఇలాంటి వారిలో పోతిన వెంకట మహేష్ ఒకరు. గతంలో జనసేన పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపించి వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఎదురు దాడి చేశారు.

గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చారు. సుమారు పది సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఆశలు ఫలించేలా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో కూడా జనసేన తరఫున పోటీ చేయాలనే భావించినప్పటికీ అవకాశం చిక్కలేదు. ఇక విజయవాడలోనే ఉన్న మరో యువ నాయకుడు దేవినేని అవినాష్.

రాజకీయ వారసత్వంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఈ లక్ష్యం ఇప్పటివరకు నెరవేరలేదు. టికెట్ అయితే ద‌క్కింది. కానీ, విజయం మాత్రం సాధించలేకపోయారు. 2019 ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2024 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో 2014 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేశారు.

ఇలా మూడుసార్లు.. మూడు చోట్ల నుంచి పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. వచ్చే ఎన్నికల నాటికి అసలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది సందేహంగా ఉంది. ఇక, మరో యువ నాయకుడు.. వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన పరిటాల శ్రీరామ్. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత వారసుడిగా ఆయన గత ఎన్నికల సమయంలో ధర్మవరం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ అది కూటమి మిత్రపక్షంగా ఉన్న బిజెపికి దక్కింది.

రాప్తాడు నుంచి పోటి చేయాలని అనుకున్నా పార్టీ అధిష్టానం గ‌త ఎన్నిక‌ల్లో గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో పరిటాల శ్రీరామ్ వచ్చే ఎన్నికల నాటికి ఏ మేరకు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది చూడాలి. ఈయ‌న కూడా గ‌త 15 సంవ‌త్స‌రాలుగా ఉనికి కోసం పోరాటం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన జెసి పవన్ కుమార్ రెడ్డి ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. గత ఎన్నికల్లో టిడిపి తరఫు న ఎంపీగా పోటీ చేయాలని భావించారు. టిక్కెట్టు దక్కలేదు. 2019లో అనంతపురం ఎంపీగా పోటీ చేసినప్పటికీ ఆయన పరాజయం పాలయ్యారు.

ప్రస్తుతం రాజకీయంగా ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు. అస‌లు రంగంలో ఉంటారా లేదా అనేది కూడా సందేహంగా మారింది. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. ఇక కర్నూలు జిల్లాకు చెందిన మరో యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. వైసీపీ హయాంలో ఆయన అప్రకటిత ఎమ్మెల్యేగా వ్యవహరించారని వాదన ఉంది. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకు చైర్మన్‌గా వ్యవహరించారు. అయినప్పటికీ అసెంబ్లీలో అధ్యక్ష అనాలనేది ఆయన కోరిక. కానీ, అది ఏ మేరకు ఫలిస్తుందనేది సందేహంగానే ఉంది.

ఇప్పటివరకు తనకంటూ నియోజకవర్గం ఎంచుకోకపోవడం, బలమైన వాయిస్ వినిపించకపోవడం వంటివి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి మైనస్ గా కనిపిస్తున్నాయి. ఇలా చాలామంది యువ నాయకులు రాజకీయ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.