Begin typing your search above and press return to search.

సూపర్ రిచ్ మహిళా ఎమ్మెల్యేలు.. టాప్-3లో ఏపీ నేతలు!!

దేశంలో మహిళా ప్రజాప్రతినిధుల ఆస్తుల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్ (NEW) సంయుక్తంగా వెల్లడించాయి.

By:  Tupaki Political Desk   |   9 March 2026 3:35 PM IST
సూపర్ రిచ్ మహిళా ఎమ్మెల్యేలు.. టాప్-3లో ఏపీ నేతలు!!
X

దేశంలో మహిళా ప్రజాప్రతినిధుల ఆస్తుల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్ (NEW) సంయుక్తంగా వెల్లడించాయి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీల ఆస్తులపై ఆసక్తికర విశేషాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 476 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఎన్నికల అఫిడవిట్లలో సమర్పించిన వివరాలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు. మొత్తం ప్రజాప్రతినిధుల్లో సుమారు 3 శాతం మంది అంటే 14 మంది వంద కోట్లకు పైగా ఆస్తి ఉన్నవారు కావడం విశేషం. ఇక ఈ లిస్టులో టాప్-3లో ఏపీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలే నిలిచారు.

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఏటా ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఆస్తులు, అప్పులు, నేరచరత్ర వంటి విశేషాలతో నివేదికలు విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాదికి సంబంధించి తాజాగా మహిళా ప్రజాప్రతినిధుల ఆస్తుల జాబితాను విడుదల చేసింది. ఇందులో పలు ఆసక్తికర అంశాలపై పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధుల ఆస్తులు, ఆదాయం అందరి దృష్టిని ఆకర్షిస్తోందని అంటున్నారు.

దేశవ్యాప్తంగా మొత్తం 476 మంది మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీరంతా ఎంపీ, ఎమ్మెల్యే పదవుల్లో ఉన్నారు. ఏపీలో 24 మంది, తెలంగాణలో 11 మంది మహిళలు చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక దేశం వంద కోట్ల ఆస్తి ఉన్న 14 మంది బిలియనీర్ మహిళా నేతల మొత్తం ఆస్తి రూ.8,234 కోట్లుగా ఏడీఆర్ నివేదికలో వెల్లడించారు. సగటున ఒక్కొక్కరికి రూ.17.30 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపింది. అయితే ఏపీ నేతలు జాతీయ సగటును మించి రికార్డు ఆదాయం, ఆస్తులు కలిగి ఉన్నట్లు నివేదిక బయటపెట్టింది.

ఏపీకి చెందిన 24 మంది మహిళా నేతల ఆస్తుల సగటు రూ.74.22 కోట్లు, ఇది జాతీయ సగటు రూ.17.30 కోట్ల కంటే చాలా ఎక్కువ. అదేవిధంగా తెలంగాణకు చెందిన 11 మంది మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి రూ.14.45 కోట్లుగా వెల్లడించింది. ఇది జాతీయ సగటుకంటే స్వల్పంగా ఎక్కువని చెబుతున్నారు. ఇక ఈ నివేదికలో అత్యంత ఆకర్షణీయమైన విశేషం ఏంటంటే.. దేశంలో అత్యధిక ఆస్తి ఉన్న మహిళా నేతల్లో టాప్ 3లో ఏపీ నేతల పేర్లే ఉన్నాయి.

దేశంలోని 476 మంది మహిళా నేతల్లో నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తన ఆస్తులతో తొలి స్థానంలో నిలిచారు. ఆమెకు ఏకంగా రూ.716.33 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఇక రెండు, మూడు స్థానాలు సైతం ఏపీ ఎమ్మెల్యేల పేర్లే ఉన్నాయి. రూ.388.10 కోట్లతో కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి రెండో స్థానంలో నిలవగా, జనసేన పార్టీకి చెందిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి రూ.291.17 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఈ ముగ్గురు వ్యాపార రంగంలో బాగా రాణించి రాజకీయాల్లోకి వచ్చిన మహిళలే కావడం విశేషంగా చెబుతున్నారు.

ఇక ఏడీఆర్ నివేదికలో ఇతర అంశాలను పరిశీలిస్తే మొత్తం మహిళా నేతల్లో 28 శాతం మంది అంటే 143 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 15 శాతం మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. అదేవిధంగా 333 మంది మహిళా నేతలు డిగ్రీ లేదా అంతకంటే పై చదువులు చదువుకున్నారని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం కేవలం సంఖ్య పరంగానే కాకుండా, ఆర్థికంగా కూడా బలపడుతోందని ఈ గణాంకాలు చెబుతున్నాయని అంటున్నారు. మరోవైపు ధనిక నేతల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, సాధారణ నేపథ్యం ఉన్న మహిళలకు రాజకీయ అవకాశాలు దక్కుతున్నాయని ఈ నివేదిక ద్వారా అర్థమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.