ఉచిత బస్సుకు వేళాయే.. ఏపీకి కేంద్రం వరం!
అయితే.. విద్యుత్ బస్సుల రాకతో మహిళలకు ఇచ్చిన ఫ్రీబస్సు హామీపై మరోసారి చర్చ సాగుతోంది. ప్రస్తుతం కేంద్రం నుంచి వస్తున్న బస్సులను ఉచిత బస్సుల కోసమే వినియోగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 6 April 2025 1:00 AM ISTఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు గత ఏడాది ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైంది.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. దీనిని ప్రారంభించేందుకు ఇప్పటికే రెండు ముహూర్తాలు పెట్టుకున్నా.. అవి సక్సెస్ కాలేదు. అయితే.. ఇప్పుడు తాజాగా.. దీనికి సంబంధించిన కీలక అప్డేట్ తెరమీదికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ తో నడిచే ఎలక్ట్రిక్ బస్సులు ఏపీకి రానున్నాయి. ఏకంగా.. 750 బస్సులను కేంద్రం ఏపీకి పంపుతోంది. త్వరలోనే ఇవి ఏపీకి చేరుకుంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వీటిని సీఎం చంద్రబాబు ప్రారంభించి.. ఆయా జిల్లాలకు పంపించనున్నారు.
ఉచితం కోసమే!
అయితే.. విద్యుత్ బస్సుల రాకతో మహిళలకు ఇచ్చిన ఫ్రీబస్సు హామీపై మరోసారి చర్చ సాగుతోంది. ప్రస్తుతం కేంద్రం నుంచి వస్తున్న బస్సులను ఉచిత బస్సుల కోసమే వినియోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సాధారణ బస్సులను ఉచితానికి వినియోగిస్తే.. డీజిల్ ఖర్చులు పెరిగిపోతున్నాయి. దీనివల్ల నెల నెల ప్రభుత్వంపై 350 కోట్ల రూపాయలకు పైగానే భారం పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు కొత్తగా వస్తున్న విద్యుత్ బస్సులను ఉచిత బస్సులకు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. దీనివల్ల ఖర్చు తగ్గుతుందన్న అంచనా కూడా ఉంది.
ఎలక్ట్రిక్ బస్సుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా.. విద్యుత్ చార్జింగ్ పాయింట్లను సోలార్‌తో ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ పథకాన్ని రాష్ట్రం అందిపుచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ద్వారా.. పాయింట్లను ఎంపిక చేసి.. భారీ ఎత్తున సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా ఉచిత బస్సులకు విద్యుత్ వినియోగిస్తే.. ప్రభుత్వంపై కేవలం 20 - 30 కోట్ల రూపాయల భారం మాత్రమే పడే అవకాశం ఉంటుంది. తద్వారా.. అటు.. సర్కారు ఇచ్చిన హామీతోపాటు ఇటు భారం కూడా తగ్గుతుందని అంటున్నారు అధికారులు, ఇక, కేంద్రం మొత్తం 10 వేల ఎలక్ట్రిక్ బస్సులను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు అందిస్తుండగా.. ఒక్క ఏపీకి మాత్రమే 750 బస్సులు రానున్నాయి.
