Begin typing your search above and press return to search.

‘ఉచిత బస్సు.. అంత ఈజీ కాదు’ కూటమికి పెద్ద సవాలే..

ప్రస్తుతం ఉన్న బస్సులు, సిబ్బందితో ఉచిత ప్రయాణం పథకం అమలు చేయడం ఆచరణ సాధ్యం కాదని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   6 July 2025 6:00 PM IST
‘ఉచిత బస్సు.. అంత ఈజీ కాదు’ కూటమికి పెద్ద సవాలే..
X

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం ఒకటి. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ఈ పథకం ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా? అని అంతా ఎదురుచూస్తున్నారు. ఏడాదిగా అనేక అధ్యయనాలు చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు ఉచిత బస్సు పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చేనెల 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

అయితే ఉచిత బస్సు పథకం కోసం ప్రభుత్వం ఏమైనా కొత్త చర్యలు తీసుకుంటున్నదా? లేదా? అనే విషయమే ఆసక్తిరేపుతోంది. ఉచిత బస్సు పథకం అమలు కోసం ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీల్లో ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు అవుతోంది. ప్రధానంగా కర్ణాటక, తెలంగాణల్లో ఉచిత బస్సు పథకంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఉచితం అనగానే అవసరం లేని ప్రయాణాలు అధికమవడంతో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంటున్నారు. కర్ణాటకలో ఈ పథకం అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఉచిత బస్సు పథకంతో ఉపయోగం లేదని, రద్దు చేయడమే బెటరు అన్న ప్రకటన చేయడం ఆ మధ్య పెద్ద చర్చకు దారితీసింది.

అయితే చెన్నై నగరంలో ఉచిత బస్సు వల్ల మహిళ ఆర్థిక స్వావలంబన పెరిగిందని కొన్ని సర్వేలు వెల్లడించాయి. దీంతో అన్నివిధాలుగా అధ్యయనం చేసిన ప్రభుత్వం ఏపీలో ఈ పథకాన్ని అమలు చేసే విధానంపై మార్గదర్శకాలు తయారు చేస్తోంది. ఇప్పటివరకు అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ కార్మిక సంఘాలు మాత్రం ఉచిత పథకం అమలు చేయడం కత్తిమీద సామేనంటూ ప్రకటనలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న బస్సులు, సిబ్బందితో ఉచిత ప్రయాణం పథకం అమలు చేయడం ఆచరణ సాధ్యం కాదని చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో సగటున 40 నుంచి 45 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో మహిళా ప్రయాణికులు సగం మంది ఉంటారని ఓ అంచనా. అయితే ఉచిత పథకం అమలులోకి వస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య రెండు, మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణ, కర్ణాటకల్లో ఉచిత ప్రయాణ పథకం వల్ల ఆక్యుపెన్సీ బాగా పెరిగిందని అధ్యయనాలు ఉన్నాయంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీలో సమస్యల్లేకుండా ఉచిత బస్సు పథకం అమలు చేయాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు సూచిస్తున్నాయి.

అదనంగా మూడు వేల బస్సులు, 10 వేల మంది సిబ్బందిని నియమించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రద్దీ డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నందున సిబ్బందిపై భారం పెరగకూడదని, అదనపు ట్రిప్పులు వేయాల్సివుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఆర్టీసీ, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల వల్ల అదనపు బస్సులు, సిబ్బందిని నియమించే అవకాశాలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కాలుష్యాన్ని అదుపు చేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా విద్యుత్ బస్సులను ప్రవేశపెడుతోంది. కొద్దిరోజుల్లో రాష్ట్రానికి కొత్తగా 700 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయని అంటున్నారు. అయితే వీటిలో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారా? లేదా? అనేది కూడా తెలియడం లేదని అంటున్నారు. మొత్తానికి ఉచిత బస్సు పథకం అమలు చేయాలంటే ప్రభుత్వం కొత్త వనరులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందనే సూచనలు వస్తున్నాయి.