Begin typing your search above and press return to search.

రాజకీయ అసహనం...ఏపీ ప్రత్యేకం

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీ రాజకీయంగా చైతన్యవంతమైన రాష్ట్రం. ఎంతటి చైతన్యం అంటే వీలు కుదరాలే కానీ ప్రతీ అయిదేళ్ళకు ఒక ప్రభుత్వాన్ని మార్చేసేటంత.

By:  Satya P   |   2 Dec 2025 5:00 PM IST
రాజకీయ అసహనం...ఏపీ ప్రత్యేకం
X

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీ రాజకీయంగా చైతన్య వంతమైన రాష్ట్రం. ఎంతటి చైతన్యం అంటే వీలు కుదరాలే కానీ ప్రతీ అయిదేళ్ళకు ఒక ప్రభుత్వాన్ని మార్చేసేటంత. ఇక ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ని దించడానికి జనాలకు మూడున్నర దశాబ్దాల కాలం పట్టింది. దానికి కారణం ఆ పార్టీని ఢీ కొట్టే సరైన ఆల్టర్నేషన్ లేకపోవడమే. అక్కడికీ కామ్రేడ్స్ కి ఎక్కువ సీట్లు ఇచ్చారు. అలాగే 1978లో జనతా పార్టీకి ఏకంగా 60కి పైగా సీట్లు ఇచ్చి ప్రధాన ప్రతి పక్షం చేశారు. కానీ ఈ పార్టీలు ఇంకా గట్టిగా పుంజుకోకపోవడంతో కాంగ్రెస్ పంట పండుతూ వచ్చింది. అలాంటి కాంగ్రెస్ కి 1983లో అతి పెద్ద బ్రేక్ పడింది. తెలుగుదేశం వచ్చి కాంగ్రెస్ కూశాలను కదిలించేసింది.

ఆప్షన్ కోసమే :

అక్కడ నుంచి ఏపీ జనాలకు ఒక భారీ ఆప్షన్ దొరికినట్లు అయింది. ఒక విడత టీడీపీ మరో విడత కాంగ్రెస్ ఈ విధంగా పార్టీలను మారుస్తూ అధికారం ఇచ్చిన ఘనత కూడా ఏపీ జనాలదే. అయితే 1999లో రెండోసారి బాబు సీఎం అయ్యారు అంటారు కానీ బాబు తాను సొంతంగా జనంలో గెలిచిన తొలిసారిగా దాన్ని చూడాలి. ఇక 2009లో వైఎస్సార్ రెండోసారి అధికారం దక్కించుకున్నా అత్తెసెరు మార్కులే జనాలు ఇచ్చారు. పైగా త్రిముఖ పోరు సాగింది, ప్రజారాజ్యం, లోక్ సత్తా వంటివి ఓట్లు చీల్చకపోతే టీడీపీయే గెలిచేది అన్న విశ్లేషణలు ఉన్నాయి. సో ఆప్షన్ గట్టిగా ఉండి ముఖాముఖీ ఉంటే జనాలు కచ్చితంగా తమ రాజకీయ అసహనాన్ని చూపిస్తారు. ఇది అనేక సార్లు నిజమై రుజువు అయింది.

కూటమి జాగ్రత్తలు :

రాజకీయంగా అర్ధ శతాబ్దం అనుభవం పండించుకున్న సీఎం చంద్రబాబుకు ఇవన్నీ తెలియనివి కావు, అందుకే ఆయన రాజకీయ వైకుంఠపాళి ఆడొద్దు అని జనాలను కోరుతున్నారు. అంతే కాదు ఏకంగా పదిహేనేళ్ళ పాటు కూటమికే అధికారం ఇవ్వమని కోరుతున్నారు. దాని వల్ల ఏపీ బాగుపడుతుందని కూడా జనాలకు వివరిస్తున్నారు. వారిలో ఆ విధమైన అవగాహన తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ విషయం తీసుకున్నా ఆయన సైతం పదిహేనేళ్ళు పవర్ మాకు ఇచ్చి చూడండి అభివృద్ధి జరగడం ఖాయమని చెప్పుకుని వస్తున్నారు.

ఇదీ ట్రెండ్ :

దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ ఒకే ప్రభుత్వాన్ని అనేక సార్లు కొనసాగించిన చరిత్ర ఉంది. అయితే ఏపీ మాత్రం ప్రత్యేకం అని చెబుతారు. దానికి కారణం జనాలలో ఉండే రాజకీయ చైతన్యంతో పాటు రాజకీయ అసహనం అని విశ్లేషిస్తారు. ప్రజలకు అన్నీ రెడీ మేడ్ గా జరగాలి, ఆటోమేటిక్ గా అన్నీ జరగాలి. ఏ మాత్రం తేడా వచ్చినా అసహనం ఏర్పడుతుంది, అంతే ఈ సర్కార్ మాకొద్దు అంటూ ఆల్టర్నేషన్ కోసం వెతికేస్తారు. ఇది ఏపీలో ఒక రకమైన ట్రెండ్ గా వస్తోంది. మరి దీనిని బ్రేక్ చేయడం అంటే కష్టమే కానీ అసాధ్యం అయితే కాదని అంటున్న వారూ ఉన్నారు.

వైసీపీ ఆశలు :

ఇక ఏపీ జనాల పల్స్ ని పట్టేసిన వైసీపీ ఆశలను పూర్తిగా అక్కడే పెట్టుకుంది. ఎవరెంత చేసినా ఎన్ని రకాలుగా హడావుడిగా చేసినా ఏపీ జనాలు మాత్రం అయిదేళ్ళకు కచ్చితంగా దింపేస్తారు అన్నది వైసీపీ మార్క్ ఆలోచనగా ఉంది. తాము ఎన్ని సంక్షేమ పధకాలు ఇచ్చి తమ శైలిలో అభివృద్ధి చేసినా జనాలు మెచ్చకపోవడానికి కారణం వారిలో ఈ రకమైన రాజకీయ అసహనం ఉండడమే కారణం అన్నది వైసీపీ వర్గాల మాట. అందువల్ల టీడీపీ ఏమి చేసినా ఎంత చేసినా అయిదేళ్ళు గిర్రున తిరిగే సరికి తప్పకుండా జనాలకు మొహం మొత్తుతుందని తమ వైపే వారు చూస్తారు అని నిబ్బరంగా ఉంది. మరి ట్రాక్ రికార్డు చూస్తే వైసీపీ ఆశలు తప్పుగా అనిపించాల్సింది లేదు. కానీ ఏపీ జనాలు ఆ విధంగానే చేస్తారా లేక మరోసారి జై కూటమి అంటారా అంటే మరో మూడేళ్ళు ఆగాల్సిందే. అయితే వరసగా రెండవసారి గెలిస్తే మాత్రం బాబు ఈ ట్రెండ్ ని బ్రేక్ చేయడమే కాదు సరికొత్త రికార్డుని క్రియేట్ చేసినట్లే అని అంటున్నారు.