విశాఖ, విజయవాడ మెట్రోలపై కీలక అడుగు
విశాఖలో మొదటి దశలో మూడు కారిడార్లు నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఇందులో మొదటిది విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మాది వరకు 34.40 కి.మీ మేర నిర్మించనున్నారు.
By: Tupaki Desk | 24 July 2025 7:28 PM ISTఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చాలాకాలంగా ప్రతిపాదనల్లో ఉన్న విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు కదలిక తీసుకువచ్చింది. ఈ రెండు మెట్రోలకు ఆర్థిక సాయం చేసేందుకు విదేశీ బ్యాంకులు ముందుకు రావడంతో టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో శుక్రవారం వీటికి టెండర్లు ఆహ్వానించనున్నారు. మొత్తం రూ.21,616 కోట్లతో మెట్రో ప్రాజెక్టుకు టెండర్లు ఆహ్వానించనున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో పదేళ్ల తర్వాత విశాఖ, విజయవాడ మెట్రోల దిశగా తొలి అడుగు పడినట్లు అయింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ రెండు నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనేక సర్వేల తర్వాత ప్రాజెక్టు నిర్మాణానికి డీపీఆర్ సిద్ధమైంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును 6.22 కిలోమీటర్ల మేర నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సుమారు రూ. 11,498 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టుకు ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (AIIB) 60 శాతం నిధులు సమకూర్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మిగిలిన 40 శాతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి. అదేవిధంగా విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (VIMMRDA) నుంచి రూ.4,101 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు.
విశాఖలో మొదటి దశలో మూడు కారిడార్లు నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఇందులో మొదటిది విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మాది వరకు 34.40 కి.మీ మేర నిర్మించనున్నారు. ఇందులో 20.16 కిలోమీటర్లు డబుల్ డెక్కర్ తరహాలో ఉంటుంది. అదేవిధంగా గురుద్వార్ జంక్షన్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 5.08 కి.మీ మేర రెండోది, తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కి.మీ మేర మూడో కారిడార్ నిర్మించనున్నారు. ఈ మూడు కారిడార్లలో మొత్తం 42 మెట్రో స్టేషన్లు ఉంటాయి. ఐదు ఇంటిగ్రేటెడ్ మెట్రో స్టేషన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టు కోసం ఇప్పటికే భూసేకరణ ప్రారంభమవగా, 99.8 ఎకరాలు అవసరమని గుర్తించారు.
ఇక విజయవాడ మెట్రో ప్రాజెక్టు కోసం రూ. 10,118 కోట్లు అవసరమని అంచనా వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50% నిధులు సమకూర్చనున్నాయి. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (CRDA) నుంచి రూ. 3,497 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయవాడ మెట్రోలో రెండు కారిడార్లు ఉంటాయి. రెండు దశల్లో విజయవాడ మెట్రో పూర్తి చేయాలని నిర్ణయించారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం వరకు 25.90 కిలోమీటర్ల మేర ఒకటి, బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు 12.50 కి.మీ రెండో కారిడార్ నిర్మించనున్నారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద కోచ్ డిపో ఏర్పాటు చేయనున్నారు. ఇక రెండో దశలో బస్టాండ్ నుంచి అమరావతి వరకు 27.80 కి.మీ మరో కారిడార్ ఉంటుంది. మొదటి దశలో మొత్తం 34 స్టేషన్లను ప్లాన్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ద్వారా నిధుల సమీకరణకు ప్రభుత్వం నిర్ణయించగా, ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ రుణమిచ్చేందుకు అంగీకరించింది. దీంతో మెట్రో ప్రాజెక్టుల టెండర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీఎంఆర్డీఏ, సీఆర్డీఏ కేటాయించిన నిధులతో చేపట్టాల్సిన పనులకు ముందుగా టెండర్లు ఆహ్వానిస్తున్నారు.
మొత్తంగా, రెండు మెట్రో ప్రాజెక్టులు వేగవంతం అయ్యే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాల్లో మెట్రో కల సాకారం అవుతోందని చెబుతున్నారు.
