తొమ్మిది వర్శిటీలకు వీసీలు లేరు...పాలనెలా ?
ఏపీలో మొత్తం 17 విశ్వ విద్యాలయాలు ఉంటే అందులో తొమ్మిది వర్శిటీలకు వైస్ చాన్సలర్లు లేరు.
By: Tupaki Desk | 6 July 2025 11:31 PM ISTఏపీలో మొత్తం 17 విశ్వ విద్యాలయాలు ఉంటే అందులో తొమ్మిది వర్శిటీలకు వైస్ చాన్సలర్లు లేరు. ఇంచార్జిల పాలనలోనే అంతా సాగుతోంది. దీంతో కొత్త వీసీలను నియమించాలని ఆయాన్ యూనివర్సిటీల నుంచి విన్నపాలు వస్తున్నాయి. ఏపీలో చూస్తే టీడీపీ కూటమి పాలనకు ఏడాది కాలం పూర్తి అయింది.
కూటమి అధికారంలోకి వస్తే కీలకమైన విశ్వ విద్యాలయాల పాలనను గాడిన పెడతామని నాయకులు హామీ ఇచ్చారు. అంతే కాదు వైసీపీ హయాంలో గాడి తప్పిన విశ్వ విద్యాలయాలను ప్రక్షాళన చేసి విద్యార్ధులకు న్యాయం చేస్తామని దేశంలోనే ప్రముఖ వర్శిటీలుగా తయారు చేస్తామని కూడా చెప్పారు.
అలా చూస్తే కనుక అధికారంలోకి వస్తూనే వర్శిటీల మీద పూర్తి ఫోకస్ పెట్టారు. దానికి తగినట్లుగానే చర్యలు కూడా మొదలయ్యాయి. ఇక వైసీపీ హయాంలో నియమితులైన వీసీలు చాలా మంది తమ పదవీ కాలం ఇంకా ఉండగానే రాజీనామాలు చేశారు. అలా ఖాళీ అయిన వర్శిటీలతో పాటు మొత్తం 17 విశ్వవిద్యాలయాలలో ఉప కులపతులను నియమించడానికి దేశవ్యాప్తంగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. అలా మొత్తం 2,500 దాకా దరఖాస్తులు వచ్చాయి.
ఇక చూస్తే ఈ ఏడాది ఫిబ్రవరి 18న ఒకేసారి తొమ్మిది విశ్వవిద్యాలయాలకు కొత్తగా వీసీలను నియమించారు. అలా ఆంధ్రా యూనివర్శిటీ, యోగి వేమన యూనివర్శిటీ, కాకినాడ జేఏన్ టీయూ, విక్రం సింహపురి, రాయలసీమలో అనంతపురం జేఎన్టీయూ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, క్రి యూనివర్శిటీ, ఆది కవి నన్నయ్య యూనివర్శిటీలకు నియమాకాలు పూర్తి చేశారు. అయితే ఇందులో యోగి వేమన యూనివర్శిటీ వీసీగా నియమితులైన ప్రకాష్ బాబు హైదరాబాద్ యూనివర్శిటీలో తనకు చాన్స్ రావడంతో రాజీనామ చేశారు.
అలా ఎనిమిది వర్శిటీలకే ఇప్పటిదాకా వీసీలు ఉన్నారు, మరో తొమ్మిది వర్శిటీలకు వీసీలు లేక ఇంచార్జి పాలనలోనే ఉన్నాయి. దాంతో పాలన పూర్తి స్థాయిలో సాగడం లేదని అంటున్నారు. కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అని అంటున్నారు.
అలా వీసీలు లేని వర్శిటీలు చూస్తే కనుక నాగార్జున ఎస్వీయూ, శ్రీక్రిష్ణ దేవరాయ ఉన్నాయని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా శ్రీ క్రిష్ణదేవరాయ, విజయనగరం జేఎన్ టీయూ, ఆచార్య నాగార్జున, ద్రవిడ యూనివర్శిటీలకు కొత్తగా వీసీల నియామకం కోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీలు తమ సిఫార్సులను ప్రభుత్వానికి నివేదించాయని చెబుతున్నారు. అయినా సరే ప్రభుత్వం నుంచి కొత్త వీసీల నియామకాల మీద ఏ నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు.
ప్రతీ విశ్వవిద్యాలయానికి ఒక పాలక మండలి ఉంటుంది. ఆ పాలక మండలికి వీసీ అధ్యక్షత వహిస్తారు. వీసీ నాయకత్వంలో తీసుకునే నిర్ణయాలే అమలు అవుతాయి. వీసీ లేకుండా పాలక మండలి ఏ విధానపరమైన నిర్ణయమూ తీసుకోలేదు. అందువల్ల తొందరగా కొత్త వీసీలను తొమ్మిది వర్శిటీలకు నియమిస్తే వర్శిటీల పాలన గాడిలో పడుతుందని అంటున్నారు.
