ఏపీ నుంచి కాబోయే కేంద్ర మంత్రి ఎవరు? మూడు పార్టీల నుంచి పేర్లు పరిశీలన!
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఖాయమన్న సంకేతాలు అందుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా ప్రస్తుత మంత్రివర్గాన్ని పార్టీని ప్రక్షాళన చేయాలని ప్రధాని మోదీ భావిస్తున్నారని అంటున్నారు.
By: Tupaki Political Desk | 29 Jun 2026 7:28 PM ISTకేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఖాయమన్న సంకేతాలు అందుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా ప్రస్తుత మంత్రివర్గాన్ని పార్టీని ప్రక్షాళన చేయాలని ప్రధాని మోదీ భావిస్తున్నారని అంటున్నారు. దీంతో ప్రస్తుత మంత్రివర్గం నుంచి పలువురికి ఉద్వాసన, కొత్తగా కొందరికి అవకాశం వస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి ఒకరిని కేంద్ర కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం జాతీయస్థాయి మీడియా సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఏపీ నుంచి ఒకరికి మంత్రి పదవి పక్కా అంటున్నారు. అయితే ఆ లక్కీ చాన్స్ ఎవరిది అన్నదే సస్పెన్స్ క్రియేట్ చేస్తోందని చెబుతున్నారు. ఏపీ నుంచి ఎన్డీఏ కూటమి తరపున మొత్తం 27 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఇందులో 21 మంది లోక్ సభ సభ్యులు కగా, మిగిలిన ఆరుగురు రాజ్యసభ సభ్యులు. అయితే వీరిలో ఎవరిని కేంద్ర మంత్రిని చేస్తారనేదే ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.
ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఏపీ నుంచి ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవులు ఉన్నాయి. కొత్తగా మరొకరికి అవకాశం ఇస్తే ఏ పార్టీ వారికి మంత్రి యోగం లభిస్తుందనేదే అంతుచిక్కడం లేదు. బీజేపీకి మొత్తం ముగ్గురు ఎంపీలు ఉండగా, ఇప్పటికే ఒకిరికి మంత్రి పదవి ఉండటంతో మరొకరికి అవకాశం వస్తుందా? అన్నది అనుమానమే అంటున్నారు. కానీ, మహిళా కోటా పెంచాలనే ఉద్దేశంతో ఉన్న బీజేపీ అగ్ర నాయకత్వం రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేరును సీరియస్ గా పరిశీలిస్తుందని చెబుతున్నారు. మరోవైపు బీజేపీకి ఇప్పటికే మంత్రి పదవి ఉన్నందున ఈ సారి జనసేనకు అవకాశం ఇస్తారనే మరో వాదన వినిపిస్తోంది.
దీంతో ఆ పార్టీలో కూడా కేంద్ర మంత్రి పదవిపై ఆశలు చిగురిస్తున్నాయని అంటున్నారు. నిజానికి జనసేన నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తోంది. కేంద్రంలో బలమైన పాత్ర పోషించాలని కోరుకుంటున్నట్లు జనసేనాని పవన్ ఇప్పటికే సంకేతాలివ్వడం ఇందుకు ఊతమిస్తోందని అంటున్నారు. తన పార్టీకి కేంద్ర ప్రభుత్వంలోనూ ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన పరోక్షంగా తన మనసులో మాటను బయట పెట్టారన్న చర్చ జరుగుతోంది. జనసేనకు ప్రస్తుతం ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఇద్దరు లోక్ సభ, ఒక రాజ్యసభ సభ్యుడికి గాను ఎవరికి మంత్రి పదవికి సిఫార్సు చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.
అయితే, మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఊహగానాలు వినిపిస్తున్నప్పటి నుంచి టీడీపీ ఎంపీల్లో ఎక్కడా లేని ఉత్సాహం కనిపిస్తోందని చెబుతున్నారు. సంఖ్యాపరంగా ఎన్డీఏలో తమ పార్టీ కీలకంగా ఉండటం వల్ల రాష్ట్రానికి కేటాయించే అదనపు మంత్రి పదవి తమ పార్టీకే దక్కుతుందని టీడీపీ ఎంపీలు ధీమాగా ఉన్నారని అంటున్నారు. దీంతో రకరకాల సామాజిక, రాజకీయ సమీకరణలతో ఈ సారి తమకు అదృష్టం వరిస్తుందని పలువురు ఎంపీలు ఆశ పడుతున్నారని చెబుతున్నారు. రాష్ట్రంలో కీలక సామాజికవర్గమైన రెడ్డి వర్గానికి కేంద్రంలో అవకాశం కల్పించడం ద్వారా ఆ ఓటు బ్యాంకును ఆకర్షించాలనే ప్లాన్ ఉందని అంటున్నారు. దీంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, బైరెడ్డి శబరి పేర్లు చర్చకు వస్తున్నాయి. ఇదే సమయంలో ఎస్సీ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలనే సూచనతో అమలాపురం ఎంపీ హరీశ్ మాధుర్, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ పేర్లు పరిశీలించాలనే డిమాండ్ తెరపైకి వస్తోందని చెబుతున్నారు.
మొత్తానికి కూటమిలో ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి హాట్ డిబేట్ కు తెరతీసింది. రాష్ట్రానికి బెర్తు ఇవ్వడం ఖాయమన్న సంకేతాలు అందడంతో మూడు పార్టీల నుంచి ప్రయత్నాలు మొదలైనట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నిర్ణయమేంటి? అన్నదే తెలియడం లేదని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరైన నేతను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. యువతకు అవకాశం ఇవ్వాలని భావిస్తే డాక్టర్ శబరి లేదా హరీశ్ మాధుర్ ల్లో ఒకరి పేరు పరిశీలించవచ్చని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాట్ ఫేవరెట్ గా కనిపిస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా రాష్ట్రానికి అదనంగా మరో కేంద్ర మంత్రి పదవి కేటాయిస్తారనే ప్రచారంతో రాజకీయం రసవత్తరంగా మారిందని అంటున్నారు.
