ఉగాదికి మంత్రి వర్గంలో మార్పు...అంతా లోకేష్ వర్గమే ?
ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 2024 జూన్ 12న కొలువు తీరింది. ఇప్పటికి 21 నెలలుగా పాలన సాగుతోంది.
By: Satya P | 10 March 2026 3:59 PM ISTఏపీ మంత్రివర్గంలో భారీ మార్పులు సంభవించబోతున్నాయా అంటే జరుగుతున్న ప్రచారం బట్టి అవును అని సమాధానం వస్తోంది. ఇక దానికి ముహూర్తం కూడా కుదిరింది అని అంటున్నారు. మరో వారం రోజులలో వచ్చే ఉగాది వేళ ఏపీ కేబినెట్ లో కీలక మార్పులు ఉంటాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ మంత్రివర్గ మార్పు చేర్పుల మీద కూటమిలో అయితే అంతా తెగ చర్చిస్తున్నారు. ఎవరు ఇన్ ఎవరు అవుట్ అన్నది కూడా అంతా తర్జన భర్జన పడుతున్నారు.
కదిలించడం అనివార్యం :
ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 2024 జూన్ 12న కొలువు తీరింది. ఇప్పటికి 21 నెలలుగా పాలన సాగుతోంది. అయితే మంత్రుల పనితీరు మీద ఎప్పటికపుడు చంద్రబాబు అంచనా వేస్తున్నారు. సర్వేలు కూడా రెడీగా ఉన్నాయి. ఎవరు పని మంతులు ఎవరు ఏమిటి అన్నది అంతా బాబు దగ్గర ఉంది. అంతే కాదు ప్రతీ కేబినెట్ మీటింగులో వెనకబడిన మంత్రులకు మెత్తగా హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఎంత చెప్పినా ఏమి చేసినా పని తీరుని ఏ విధంగా మార్చుకోని వారి విషయంలో కఠిన చర్యలకు సిద్ధపడటం మేలు అన్న భావన కూటమి పెద్దలలో ఉంది అని అంటున్నారు. దాంతో పాటు సామాజిక సమీకరణలు కేబినెట్ లో ఫైర్ బ్రాండ్ల కొరత వంటివి దృష్టిలో ఉంచుకోవడం మిత్రులకు మరింతగా అవకాశాలు కల్పించడం ఇలా చాలానే చేస్తారు అని అంటున్నారు. దాంతో ఉన్న మంత్రి వర్గాన్ని కదిలించడం అనివార్యం అన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది.
లోకేష్ ముద్రతోనే :
ఇక 2024లో ఏర్పడిన ఏపీ మంత్రివర్గంలో లోకేష్ ముద్ర బలంగా ఉంది. అందుకే కొత్త వారికి మొదటి సారి గెలిచిన వారికి అనేక మందికి చోటు దక్కింది. అయితే వారిలో ఎంత మంది తమ పనితీరుని నిరూపించుకున్నారు అన్నది పక్కన పెడితే మాత్రం చాలా మంది పనితీరు మీద అసంతృప్తి కూటమి ప్రభుత్వ పెద్దలలో ఉంది అని అంటున్నారు. ఆ విధంగా ఎవరిని అయినా తప్పించినా తిరిగి కొత్తవారిని తీసుకునేటపుడు కచ్చితంగా లోకేష్ బృందంగా ముద్ర పడిన వారికే చాన్స్ ఉండొచ్చు అన్న ప్రచారం కూడా సాగుతోంది. అంటే లోకేష్ టీం లోనే మళ్లీ చాలా మంది మంత్రులు కొత్తగా ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
సీనియర్ల సంగతేంటి :
ఇక కూటమి ప్రభుత్వంలో చాలా మంది సీనియర్లకు చోటు దక్కలేదు. దాంతో వారు జస్ట్ ఎమ్మెల్యేలుగా అలా ఉండిపోయారు. ఇక సీనియర్లు అంతా దాదాపుగా ఇవే తమకు చివరి ఎన్నికలు అని అంటున్నారు. దాంతో మంత్రి వర్గ విస్తరణ కనుక జరిగితే సీనియర్లకు చోటు ఇస్తారా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ సీనియర్లకు స్థానం కల్పించకపోతే సీనియర్ల వారసులకు ఏమైనా లక్కీ చాన్స్ ఉండొచ్చా అన్నది కూడా మరో వైపు చర్చగా ఉంది. ఎందుకంటే అనేక జిల్లాలలో సీనియర్ల వారసులు లోకేష్ బృందంలో చేరి కీలకంగా వ్యవహరిస్తున్నారు. దాంతో వారితో కేబినెట్ భర్తీ చేసి ఆ విధంగా సీనియర్లకు కూడా ఖుషీ అయ్యేలా చూస్తారు అని అంటున్నారు.
బీహార్ పరిణామాల నేపథ్యంలో :
ఇకే ఎన్డీయేలో కీలక మిత్రులుగా జేడీయూ టీడీపీ ఉన్నాయి. బీహార్ లో ఒక్కసారిగా నితీష్ కుమార్ ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి రాజ్యసభకు ఎంపిక చేశారు. దాంతో మరో మిత్ర పక్షం అయిన టీడీపీలో ఈ పరిణామాల మీద చర్చ వాడిగా వేడిగా సాగుతోంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ బృందానికే కేబినెట్ లో పెద్ద పీట వేస్తారు అని ఇదంతా వ్యూహాత్మకంగా తీసుకునే నిర్ణయంగా చెబుతున్నారు.
లోకేష్ కేంద్ర బిందువుగా :
తెలుగు దేశం పార్టీలో లోకేష్ ఇపుదు కేంద్ర బిందువుగా ఉన్నారు. ఆయన యువగళం పాదయాత్ర నుంచి తన ప్రాధాన్యతను పెంచుకుంటూ వస్తున్నారు ఆయన కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాగానే పనిచేస్తున్నారు. చంద్రబాబు తరువాత ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ ఎవరు అంటే లోకేష్ పేరే వస్తోంది. ఈ రోజున కూటమిలో టీడీపీకి 135 దాకా ఎమ్మెల్యేలు ఉన్నారు. పూర్తి మెజారిటీ ఉంది. దాంతో లోకేష్ మాట చెల్లుబాటు అయ్యే క్రమం ఉంది అని గుర్తు చేస్తున్నారు. అందువల్ల మంత్రి వర్గ విస్తరణ అంటూ జరిగినా మరోసారి లోకేష్ బృందం నుంచే కొత్త వారు వస్తారు అని అంటున్నారు. ఎటు నుంచి ఏ రాజకీయ పరిణామాలు జరిగినా లోకేష్ కూటమికి ప్రభుత్వానికి అత్యంత కీలకం అయ్యేలా ఈ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. ఉగాది వేళ మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్న నేపథ్యంలో ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.
