హై అలర్ట్.. వంట మనిషి వేషంలో ఉగ్రవాది? ఎలా గుర్తించారంటే..
రాయలసీమలోని సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని కోట కాలనీలో నివాసం ఉంటున్న నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ పోలీసులు రెండురోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారని ఆలస్యంగా తెలిసింది.
By: Tupaki Desk | 16 Aug 2025 12:36 PM ISTఏపీలో ఉగ్రవాదుల కదలికలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ పోలీసుల అప్రమత్తత వల్ల ఉగ్రవాదుల జాడ ముందే గుర్తించడం పెను ముప్పు తప్పినట్లు చెబుతున్నారు. నాలుగు నెలల క్రితం మే నెలలో విజయనగరం పట్టణానికి చెందిన ఓ యువకుడికి ఉగ్ర లింకులు ఉన్నట్లు బయటపెట్టిన పోలీసులు.. తాజాగా సత్యసాయి జిల్లా ధర్మవరంలో మరో యువకుడికి ఉగ్ర లింకులు ఉన్నట్లు గుర్తించారు. ధర్మవరం పట్టణంలో ఓ చిన్న హోటల్ లో వంటమనిషిగా పనిచేస్తున్న యువకుడు కదలికలు గత కొన్ని నెలలుగా అనుమానాస్పదంగా ఉండటం, సోషల్ మీడియా ద్వారా ఉగ్ర లింకులు ఏర్పరచుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఆకస్మికంగా దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో గతంలో హైదరాబాదులో తలదాచుకున్న ఉగ్రవాదులు ఇప్పుడు తమ మకాం రాయలసీమకు మార్చారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాయలసీమలోని సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని కోట కాలనీలో నివాసం ఉంటున్న నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ పోలీసులు రెండురోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారని ఆలస్యంగా తెలిసింది. స్థానికంగా ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ కదలికలపై కొన్ని రోజులుగా ఎన్ఐఏ పోలీసులు నిఘా వేసినట్లు చెబుతున్నారు. అతడి అనుమానాస్పద తీరుతో సోషల్ మీడియా ఖాతాలపై నిఘా వేసినట్లు సమాచారం. ఎన్ఐఏ అధికారుల పరిశీలనలో అతడు దేశం అవతల శక్తులతో సంభాషిస్తున్నట్లు గుర్తించినట్లు చెబుతున్నారు. దీంతో రెండు రోజుల క్రితం ఆకస్మికంగా నూర్ ఇంటిపై దాడి చేయగా, అతడి ఇంట్లో ఏకంగా 16 సిమ్ కార్డులు బయటపడ్డాయని అంటున్నారు. సామాన్య వంట మనిషికి 16 సిమ్ కార్డులు ఉండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘ వ్యతిరేక కార్యకలాపాల వల్లే అతడు అన్ని సిమ్ కార్డులు ఉంచుకున్నాడా? అనే దిశగా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోందని చెబుతున్నారు.
ఈ ఘటనతో ధర్మవరంతోపాటు రాయలసీమ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రాన్ని ఉగ్రవాదులు షెల్టర్ జోన్ గా మార్చుకుంటున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నాలుగు నెలల్లో ఇది మూడో అరెస్టు కావడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అప్రమత్తత వల్ల ఉగ్రవాదుల ముప్పు తప్పినా, ప్రజల మధ్యే రకరకాల వేషాల్లో ఉగ్రవాదులు తిరుగుతుండటమే భయాందోళనకు కారణమవుతోందని అంటున్నారు. రాష్ట్రంలో తొలుత మే 17న విజయనగరం పట్టణానికి చెందిన సిరాజ్-ఉర్-రెహ్మాన్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద భావజాలం ఉన్న సిరాజ్ హైదరాబాద్ కు చెందిన సమీర్ సయ్యర్ తో కలిసి రాష్ట్రంలో బాంబు పేలుళ్లకు ప్రయత్నించినట్లు పోలీసులు చెప్పారు.
సోషల్ మీడియా ద్వారా విదేశాల్లో ఉన్న ఉగ్రవాదులతో సిరాజ్, సమీర్ సంభాషించడాన్ని గుర్తించిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు పక్కా వ్యూహంతో ఆ ఇద్దరిని అరెస్టు చేశారు. అప్పటికే బాంబు పేలుళ్లపై ఆ ఇద్దరు కొన్ని ట్రయల్స్ నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. కొద్ది రోజుల్లో తమ ప్లాన్ అమలు చేయాలని ఆ ఇద్దరు ప్రయత్నిస్తున్న దశలో పోలీసులు కుట్రను ఛేదించారు. దీంతో హమ్మయ్య అని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక అక్కడికి నెల రోజుల వ్యవధిలోనే రాయలసీమలోని అన్నమయ్య జిల్లాలో మరో ఉగ్ర లింకు బయటపడింది. ఈ సారి దేశంలో పలు నగరాల్లో బాంబు పేలుళ్లకు కారణమైన ఇద్దరు ఉగ్రవాదులు చాలా కాలం నుంచి మారు వేషంలో రాయచోటిలో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
తమిళనాడులో నిషేధించబడిన "అల్ ఉమ్మా" అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు దాదాపు 20 ఏళ్లుగా రాయచోటిలో మారు వేషంలో ఉంటున్నారని గత నెలలో పోలీసులు గుర్తించారు. పక్కా ప్లానింగుతో ఆ ఇద్దరిని పట్టుకున్నారు. దర్యాప్తులో వారిద్దరూ నిషేధిత సంస్థకు చెందిన ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధిఖీ, మహమ్మద్ అలీగా తేలింది. వారి నివాసాల నుంచి పోలీసులు సూట్‌కేస్ బాంబులు, బకెట్ బాంబులతో పాటు పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు, వాకీటాకీలు వంటివి స్వాధీనం చేసుకున్నారు. వీటిని అక్టోపస్ బృందం రాయచోటి డీఎస్పీ కార్యాలయం సమీపంలో నిర్వీర్యం చేసింది. చీరల వ్యాపారం పేరుతో రాయచోటి చుట్టు పక్కల ప్రాంతాల్లో తిరిగే ఈ ఇద్దరు భారీ పేలుళ్లకు ప్లాన్ చేయడంతో ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా 1995-2013 మధ్య కాలంలో తమిళనాడు, కేరళ, కోయంబత్తూరు, తిరుచ్చి, చెన్నైతో సహా పలు ప్రాంతాల్లో జరిగిన బాంబు పేలుళ్లు, రాజకీయ హత్యలు, కుట్రలకు వీరికి సంబంధం ఉందనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
1999లో నాగూర్ పార్శిల్ బాంబు పేలుడులో, 2011లో మధురైలో ఎల్.కె.అద్వానీ రథయాత్ర సమయంలో పైప్ బాంబు కుట్ర, 2013లో బెంగళూరులో జరిగిన బాంబు పేలుళ్లకు వీరికి సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు. స్థానిక మహిళలను వివాహం చేసుకుని, తమ ఉగ్ర కార్యకలాపాలను ఎవరికీ అనుమానం కొనసాగించారు. ఈ పరిస్థితుల్లో ధర్మవరంలో మరో ఉగ్ర లింకు బయటపడటం ఆందోళన రేకెత్తిస్తోంది. వరుసగా బయటపడుతున్న లింకులతో రాష్ట్రానికి చెందిన యువత బయట శక్తుల పట్ల ఎందుకు ఆకర్షణకు గురవతోందనే చర్చ జరుగుతోంది.
