Begin typing your search above and press return to search.

ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే చోట...తుంగభద్ర పొంగులే మరి !

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే కర్నూలు వెళ్ళారు.

By:  Satya P   |   24 Jun 2026 11:25 PM IST
ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే చోట...తుంగభద్ర పొంగులే మరి !
X

ప్రాంతాలు వేరైన అంతరంగం ఒక్కటిగా ఉండాలి. అభివృద్ధి అందరి అభిమతం కావాలి. ఇపుడు అదే జరుగుతోంది. ఏపీ తెలంగాణా ముఖ్యమంత్రులతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి కలసి ఒకే వేదికను పంచుకోనున్నారు. ఇంతటి అరుదైన సందర్భం కలిగించింది తన హంగులతో పొంగులతో నిరంతరం అలరించే ఉత్తుంగ తరంగ తుంగభద్ర. అవును తుంగభద్రమ్మ తల్లి సమక్షంలో మూడు రాష్ట్రాల నుంచి ముగ్గురు ముఖ్యమంత్రులు ఒక కీలక ఘట్టంలో భాగం కాబోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే ఆ కార్యక్రమం కీలకమైనది. మూడు రాష్ట్రాల ప్రజల దాహార్తిని తీర్చడంతో పాటు సాగుకు సహకరించే తుంగభద్ర ప్రాజెక్టు కి సంబంధించి 33 నూతన క్రస్ట్‌ గేట్లు బిగించే పనులను ఈ నెల 25న ప్రారంభించే కార్యక్రమంలో వీరంతా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్‌.పాటిల్‌ సైతం హాజరవుతున్నారు.

ఇదీ బాబు షెడ్యూల్ :

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే కర్నూలు వెళ్ళారు. ఆయన కర్నూల్ లో రాత్రి బస చేయడం విశేషం. ఆయన ఈ నెల 25న ఉదయం తొమ్మిదిన్నరకి జొన్నగిరి నుంచి బయలుదేరి కర్నాటక రాష్ట్రం మునిరాబాద్‌లోని ఇండియన్ రిజర్వ్ బెటాలియన్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన విజయనగర జిల్లా హోసపేటలోని తుంగభద్ర ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ఉద్యం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ సాగే తుంగభద్ర ప్రాజెక్టు కొత్తగేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు కేంద్ర మంత్రి ఇతర ముఖ్యమంత్రులతో కలసి పాల్గొంటారు. అనంతరం జరిగే బహిరంగ సభలో కూడా బాబు వేదికను పంచుకుని ప్రసంగిస్తారు.

కీలక ఘట్టంగానే :

ఇక కేంద్ర మంత్రి ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరయ్యే ఈ కార్యక్రమం మూడు రాష్ట్రాలకు కీలకమైనదిగా చెబుతున్నారు. అంతే కాదు ఏపీతో పాటు, కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలకు తుంగభద్ర ప్రాజెక్టు ఎంతో కీలకమైనదిగా నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. ఇక చూస్తే కనుక ఏడాది క్రితం తుంగభద్ర ప్రాజెక్ట్ 19వ గేటు కొట్టుకుపోయింది. దాంతో అప్పట్లో అది సంచలనమైన విషయంగా జాతీయ స్థాయిలోనే మారుమోగింది. అయితే తాత్కాలికంగా నిపుణుల సహాయంతో స్టాప్‌లాగ్‌ గేట్‌ బిగించారు. ఆ తరువాత నిపుణుల సూచన మేరకు 33 పాత క్రస్ట్‌ గేట్లను తొలగించి కొత్త వాటిని బిగించాలని నిర్ణయించి ఆ ప్రక్రియ మొదలెట్టారు. ఈ నాటికి అది పూర్తి కావడంతో అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం అయింది.

తుంగభద్ర చలవతోనే :

ఇదిలా ఉంటే తుంగభద్ర నది మూడు రాష్ట్రాలలలో సాగుకు ఎంతోగానో దయ చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు ఈ నదీమతల్లి నీరే శరణ్యం. అలాగే తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాల వాసులకు తాగునీరు, సాగునీరు తుంగభద్ర నుంచే అందుతోంది. అదే విధంగా తుంగభద్ర ప్రాజెక్ట్ పరిధిలోకి కర్ణాటకలో 9 లఖల 26 వేల 824 ఎకరాలు, ఏపీలో 7 లక్షల 20 వేల 54 ఎకరాలు, తెలంగాణలో 87 వేల ఎకరాల స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. ఇక ఈ ప్రాజెక్టు నిర్మించి ఇప్పటికి ఏడున్నర దశాబ్దాలు దాటింది. మళ్లీ ఇన్నాళ్లకు తుంగభద్రకు కొత్త కళని తీసుకుని వస్తున్నారు.