Begin typing your search above and press return to search.

చంద్రబాబు రేవంత్ ఒక్కటే ట్యూన్....వాటికి ఫుల్ స్టాప్

ఉమ్మడి ఏపీ రెండుగా మారినా ప్రజల కోసం అన్నదమ్ముల మాదిరిగా ఉండాలని అప్పట్లో అంతా నినదించారు.

By:  Satya P   |   10 Jan 2026 6:00 AM IST
చంద్రబాబు రేవంత్ ఒక్కటే ట్యూన్....వాటికి ఫుల్ స్టాప్
X

ఉమ్మడి ఏపీ రెండుగా మారినా ప్రజల కోసం అన్నదమ్ముల మాదిరిగా ఉండాలని అప్పట్లో అంతా నినదించారు. అయితే ఆచరణలో మాత్రం ఆ విధంగా సాగడం లేదు, రాజకీయాలు పైచేయి సాధిస్తున్నాయి. వాటి కోసం సెంటిమెంట్ ని రగిలిస్తున్నారు. దాంతో నీటిలో నిప్పు పుడుతోంది. జల జగడాలు అధికం అవుతున్నాయి. ఈ పరిణామాలు కాస్తా రెండు రాష్ట్రాలకు క్షేమకరం కాకపోగా కొత్తగా అగ్గి రవ్వలను రాజేస్తున్నాయి. నీటి ప్రాజెక్టుల ఆలస్యానికి అవాంతరాలకు కారణం అయి ప్రాజెక్టుల అంచనాలు పెరిగిపోయి ప్రజలకు ఆర్థిక భారాలుగా మారుతున్నాయి. అదే సమయంలో అందాల్సిన ప్రయోజకం దక్కక రైతాంగంతో పాటు అంతా నష్టపోతున్నారు.

పంచాయతీలు కాదు :

ఈ నేపధ్యంలో ఒకే రోజు ఒకే మాట ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల నోట పలకడం శుభ సూచనకంగా అంతా భావిస్తున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తాజాగా ఒక సభలో మాట్లాడుతూ సొంత రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ నీటి వివాదాలకు సంబంధించిన అంశాలు తలెత్తున్నాయని అన్నారు. రెండు రాష్ట్రాలలోని అన్ని పార్టీలకు ఒక సూచన తాను ఈ సందర్భంగా చేస్తున్నాను అన్నారు. తనకు పంచాయతీలు కంటే పరిష్కారం ముఖ్యమని రేవంత్ చెప్పుకొచ్చారు. తెలంగాణాకు నీళ్ళే కావాలని ఆయన అన్నారు. వివాదాలు వద్దు అని ఆయన చెప్పారు. నీళ్ళ వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలని కాంగ్రెస్ పార్టీ కానీ తమ ప్రభుత్వం కానీ ఎక్కడా భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. సమస్యలను సామరస్యంగానే పరిష్కారం కావాలని ఆయన కోరారు. రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కావాలని అన్నారు. చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని అన్నారు. అంతే కాదు ఏపీల్తో సయోధ్య లేకుండా ఉంతే తెలంగాణాకు పోర్టు కనెక్టివిటీ రాదని అలాగే అమరావతి అభివృద్దికి హైదరాబాద్ సహకారం చాలా అవసరం అని ఆయన చెప్పారు. ఏపీ తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలతో సమస్యలు ఎన్ని ఉన్నా చర్చల ద్వారానే పరిష్కారం కోరుకుంటున్నట్లుగా రేవంత్ రెడ్డి చెప్పారు.

చంద్రబాబు చెప్పింది అదే :

ఇక ఏపీలో గోదావరి జిల్లాలలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఇదే మాటను అన్నారు. సముద్రంలోకి వెళ్లే నీళ్ల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య గొడవలు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. నీళ్లు వద్దు గొడవలే కావాలని కొందరు బయల్దేరారని ఆయన సెటైర్లు వేశారు. కొందరు రాయలసీమ ఎత్తిపోతలు అంటూ వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ మీద పరోక్షంగా చంద్రబాబు మండిపడ్డారు. అయితే తనకు గొడవలు కాదు తెలుగు జాతి ప్రయోజనాలు కావాలని బాబు స్పష్టం చేయడం విశేషం. ఇక ఏపీలోని పోలవరం పూర్తి అయితే నీళ్లు తెలంగాణా రాష్ట్రం కూడా వాడుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. అంతే కాదు వివాదాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అందరికీ చెబుతున్నానని ఆయన అన్నారు. అలాగే గతంలో కొందరు పట్టిసీమ కట్టి కృష్ణా డెల్టాలో వినియోగించుకుందామంటే వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు. కృష్ణా డెల్టాలో ఇచ్చే నీళ్లను పొదుపు చేసి శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి తరలించామని బాబు వివరించారు. అంతే కాదు ఈ ఏడాది రాయలసీమలోని రిజర్వాయర్లలో నీళ్లు నింపామని చెప్పారు. కొందరు నీళ్లు వద్దు వివాదాలే కావాలని నానా యాగీ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలు సక్రమంగా నడుస్తుంటే మళ్లీ కొన్ని వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

తొందరలోనే పరిష్కారమా :

ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే మాట మీద ఉన్నారు. వివాదాలు వద్దు నీళ్ళు కావాలని అంటున్నారు. దాంతో కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో సరైన పరిష్కారాలు తొందరలో లభిస్తాయా అన్నది చర్చగా ఉంది. అంతే కాదు కేంద్రం పెద్దన్నగా వ్యవహరించడం ఒక ఎత్తు అయితే దానితో పాటే ఇద్దరు సీఎంలు సామరస్య పూరిత వైఖరితో ఈ జల జగడాలను పరిష్కరించుకుంటారా అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలకు జీవ నదులు అయిన క్రిష్ణా గోదావరి విషయంలో వివాదాల కంటే పరిష్కారాలే ముఖ్యమని ప్రజలు కూడా కోరుకుంటున్నారు కాబట్టి తొందరలోనే మంచి జరుగుతుందని అంతా ఆశిస్తున్నారు.