విభజన సమస్యలు.. కేంద్రం కదిలింది.. సీఎంల మాటేంటి?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. దీంతో ఉమ్మడి రాజధాని హైదరా బాద్ కూడా చరిత్ర పుటల్లోంచి వైదొలిగి.. తెలంగాణకే పరిమితమైంది.
By: Tupaki Desk | 12 April 2025 2:24 PM ISTఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. దీంతో ఉమ్మడి రాజధాని హైదరా బాద్ కూడా చరిత్ర పుటల్లోంచి వైదొలిగి.. తెలంగాణకే పరిమితమైంది. ఏపీలో నవ్యాంధ్ర రాజధాని ఇప్పు డిప్పుడే పట్టాలెక్కుతోంది. మరోవైపు ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో చోటు చేసుకున్న సమస్యలు ఇప్పటికీ నానుతూనే ఉన్నాయి. అయితే.. వీటిని పరిష్కరించేందుకు.. ఇటీవల కేంద్ర హోం శాఖ.. పావులు కదిపింది. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులను పిలిపించుకుని మార్చిలో భేటీ అయింది.
ఈ క్రమంలోనే పలు ప్రాజెక్టులకు ఇటీవల హోం శాఖ పచ్చ జెండా ఊపింది. వీటిలో అమరావతి-హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవే సహా.. తెలంగాణలోని శ్రీశైలం-హైదరాబాద్ రహదారి వంటికీలక ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. మిగిలిన కీలకమైన షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని ఉమ్మడి ఆస్తుల విభజన, అప్పుల పంపంకం వంటివి కొలిక్కి రావాల్సి ఉంది. వీటిపైనా కేంద్ర హోం శాఖ దృష్టి పెట్టింది. పరిష్కరించేం దుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపింది.
అయితే.. ఇది కేంద్రంతో ముడిపడిన వ్యవహారమే అయినప్పటికీ.. ఇరు రాష్ట్రాలు ఒక సమ్మతికి రావాల్సి ఉంటుంది. ముందుగా తామే ఏది కోరుకుంటున్నామో.. తేల్చుకుంటే.. వాటి ప్రకారం కేంద్రం నిర్ణయం తీసుకుని రేఖలు గీసి అప్పగించి.. చేతులు దులుపుకొంటుంది. కానీ, ఈ దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికీ కార్యాచరణ ప్రారంభించలేదు. గత ఏడాది జూలైలో ఉరుములు లేని పిడుగు మాదిరిగా ఇద్దరు ముఖ్యమంత్రులు.. చంద్రబాబు, రేవంత్‌లు ప్రజాభవన్‌లో భేటీ అయ్యారు.
దీంతో విభజన సమస్యలు కొలిక్కి వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ, రాలేదు. అదేసమయంలో మంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో పయ్యావుల కేశవ్ తదితరులతో మంత్రుల స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ.. ఇప్పటికీ అజా లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్రమే కదిలినా.. ముఖ్యమంత్రుల స్థాయిలో ఒక సంపూర్ణ అవగాహనకు రాకపోతే.. రేపు కేంద్రం కూడా ఏమీ చేసే పరిస్థితి లేదు. సో.. దీనినిగ్రహించి వచ్చిన అవకాశం వినియోగించుకుంటే బెటరంటున్నారు పరిశీలకులు.
