వైసీపీకి ఆర్ఆర్ఆర్.. టీడీపీకి కేఎస్ఆర్.. అంతా సేమ్ టు సేమ్!!
ఏపీ టీడీపీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (కేఎస్ఆర్) వ్యవహారశైలి విస్తృత చర్చకు దారితీస్తోంది.
By: Tupaki Political Desk | 11 Feb 2026 1:00 AM ISTఏపీ టీడీపీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (కేఎస్ఆర్) వ్యవహారశైలి విస్తృత చర్చకు దారితీస్తోంది. స్వపక్షంలో విపక్షం మాదిరిగా ఆయన పాత్ర ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో నరసాపురం ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ప్రస్తుత స్పీకర్ రఘురామరాజు (ఆర్ఆర్ఆర్) ఏ విధంగా అప్పట్లో సొంతపార్టీకి చికాకు కలిగించారో.. ఇప్పుడు ఎమ్మెల్యే కేఎస్ఆర్ కూడా అదే పాత్రలో కనిపిస్తున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయనే అర్థం వచ్చేలా ఎమ్మెల్యే కొలికపూడి తాజాగా చేసిన పరోక్ష విమర్శలు హీట్ పుట్టిస్తున్నాయి. అంతేకాకుండా కొలికపూడి వాట్సాప్ స్టేటస్ చూసిన వారు ట్రిపుల్ ఆర్ మాదిరిగా కేఎస్ఆర్ మారుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుతో ఎమ్మెల్యే కొలికపూడిని పోల్చడం రాజకీయంగా ఆసక్తిరేపుతోంది. గత ప్రభుత్వంలో రఘురామరాజు స్వపక్షంలో విపక్ష పాత్ర పోషించారు. నరసాపురం నుంచి వైసీపీ తరఫున గెలిచిన ఆయన కొద్దికాలానికే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డితో విభేదించి, సొంతపార్టీపై తిరుగుబాటుతో రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారారు. ప్రతిరోజూ రచ్చబండ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి గత ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపేవారు. అంతేకాకుండా మీడియా డిబేట్లకు హాజరై సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేసేవారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే కొలికపూడి మరీ అంత తీవ్రంగా లేకపోయినా, ఆయన నడుస్తున్న తీరు చూస్తే ఇంచుమించు అదే రూట్లో పయనిస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
రఘురామరాజు మాదిరిగా ప్రస్తుతానికి కొలికపూడి ఘాటైన విమర్శలు చేయడం లేదు. అదేవిధంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుపై నేరుగా విమర్శలు చేయడం లేదని అంటున్నారు. కానీ, గెలిచిన రెండో రోజు నుంచి వివాదాస్పద తీరుతో పార్టీకి దూరమయ్యారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన తిరువూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పార్టీ తరపున ఎలాంటి సహాయ సహకారాలు లభించడం లేదని చెబుతున్నారు. ఇది గతంలో రఘురామరాజుకు వైసీపీ నుంచి ఎదురైన పరాభావం మాదిరిగానే ఉందని అంటున్నారు.
ఇక గతంలో రఘురామరాజు తనను వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని సవాల్ విసిరేవారు. ఇప్పుడు ఎమ్మెల్యే కొలికపూడిని సస్పెండ్ చేయాలని పార్టీ నేతలు అంతా ముక్త కంఠంతో కోరుతున్నారు. టీడీపీ క్రమశిక్షణ సంఘం సైతం కొలికపూడిని పార్టీ నుంచి బయటకు పంపాలని సిఫార్సు చేసింది. కానీ, సీఎం చంద్రబాబు ఆయన విషయంలో నిర్ణయం తీసుకోకుండా నాన్చుతున్నారని అంటున్నారు. దీంతో కొలికపూడి పార్టీలో ఉంటూనే ఇక ముందు విమర్శలు తీవ్రం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
