Begin typing your search above and press return to search.

అభివృద్ధి...సంక్షేమం...త్రాసులో తిరకాసు

ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి పాలన పదహారు నెలలుగా సాగుతోంది. మొదట్లో అభివృద్ధి వైపే బాబు గారి త్రాసు మొగ్గుచూపింది

By:  Satya P   |   7 Oct 2025 2:00 AM IST
అభివృద్ధి...సంక్షేమం...త్రాసులో తిరకాసు
X

ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి పాలన పదహారు నెలలుగా సాగుతోంది. మొదట్లో అభివృద్ధి వైపే బాబు గారి త్రాసు మొగ్గుచూపింది. తొలి ఏడాది అంతా ఆయన డెవలప్మెంట్ అనే గట్టిగా మాట్లాడేవారు. అమరావతి రాజధాని జోరు పెంచేసారు. పోలవరం విషయం తీసుకుంటే కేంద్రం వద్ద నుంచి పెండింగ్ నిధులను తీసుకుని వచ్చారు. ఈ రెండూ 2029 ఎన్నికల్లోగా పూర్తి చేసి జనాల వద్దకు వెళ్ళాలని పక్కాగా ప్లాన్ చేశారు. ఇక తొలి ఏడాది ఆర్థిక ఇబ్బందుల వల్ల సూపర్ సిక్స్ హామీలను కాస్తా పక్కన పెట్టారు.

జనంలో అసంతృప్తి :

అయితే జనాలలో మెల్లగా మొదలైన అసంతృప్తితో పాటు వైసీపీ నేతలు పదే పదే సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించడంతో కూటమి పెద్దలు కూడా ఆలోచనలో పడ్డారు. అంతే రెండవ ఏడాది వస్తూనే వరసగా హామీలను నెరవేర్చడం మొదలెట్టారు. అలా ఫ్రీ బస్సు, ఆటో కార్మికకులకు ఏటా పదిహేను వేల రూపాయలు, తల్లికి వందనం, రైతుల ఖాతాలో భరోసా నిధులు ఇవన్నీ కూడా ఈ ఆర్ధిక సంవత్సరంలో అమలు చేశారు. దాని ద్వారా సంక్షేమం కోరుకునే జనాలకు చేరువ కాగలిగామని కూటమి పెద్దలు భావిస్తున్నారు.

సంక్షేమం క్షేమమేనా :

ఇంకో వైపు చూస్తే ఏపీలో అప్పులు బాగా పెరిగాయి. అనుత్పాదక వ్యయం కింద ఖర్చులు కూడా అధికం అయ్యాయి. కేవలం పదహారు నెలల కాలంలో రెండు లక్షల కోట్ల అప్పు కూటమి ప్రభుత్వం చేసింది అన్నది విపక్షం తరచూ చేస్తున్న ఆరోపణ. ఇంకో వైపు చూస్తే రాజధాని అమరావతి కోసం వివిధ ప్రపంచ ఆర్ధిక ఏజెన్సీల ద్వారా రుణాలను తెచ్చి అనుకున్న సమయానికి పని పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు. అలాగే పోలవరం పనులు కూడా సాగుతున్నాయి. అయితే వీటి కంటే 2029 ఎన్నికల్లో సంక్షేమమే తమను గట్టెక్కిస్తుందని కూటమి పెద్దలు ఇపుడు భావిస్తున్నారు అని అంటున్నారు.

గుర్తుంచుకోవాలంటూ :

ఇక ప్రతీ నెలా సామాజిక పెన్షన్లు పంచుతున్న అంద్రబాబు అక్కడ జరిగే ప్రజా వేదిక సభలలో తమ ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నారు. తాజాగా ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ కూడా ఇంకా ఎవరో వచ్చి ఏదో చేస్తారు అన్న ఆశలు పడకూడదని గట్టిగానే చెప్పారు. ఒకే ప్రభుత్వాన్ని నమ్ముకోవాలని కూడా దిశా నిర్దేశం చేశారు.

ఓట్లు తెచ్చేది అదేనా :

ఈ రోజున చూస్తే అభివృద్ధి ఎంత చేసినా ఏమి చూపించినా జనాలు తమకేంటి అన్న వ్యక్తిగత ఆలోచనలు చేస్తున్నారు. అందుకే సంక్షేమానికి పార్టీలు సైతం పెద్ద పీట వేస్తున్నాయి. ఇది వైఎస్సార్ హయాం నుంచి మెల్లగా మొదలై జగన్ చంద్రబాబు ఏలుబడిలో పీక్స్ కి చేరుకుంది దాంతో సంక్షేమం చేస్తే చాలు తాము గట్టెక్కిపోతామని వైసీపీ పెద్దలు భావించి 2024 ఎన్నికల్లో ఖంగు తిన్నారు. ఇపుడు చూస్తే కూటమి పెద్దలు కూడా ఎక్కువగా సంక్షేమం మీదనే ఆధారపడుతున్నారా అన్న చర్చ నడుస్తోంది. ఎందుకంటే అమరావతి రాజధాని తొలి దశ పనులు వచ్చే ఎన్నికల్లోగా పూర్తి అయినా అనుకున్న రూపూ షేపూ అయితే రాదు అని అంటున్నారు

ఉచితాలు అనుచితాలు :

ఇక పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించి నిర్మిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. తీరా అది పూర్తి చేసినా దాని వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో కూడా చూడాల్సి ఉంది. అందుకే ప్రతీ వర్గానికి ప్రతీ సెక్షన్ కి పనికి వచ్చే విధంగా పధకాలు అమలు చేయడం ద్వారానే మరోసారి అధికారం అందుకోవాలని కూటమి పెద్దలు చూస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. అయితే సంక్షేమం ఒక్కటే ఒడ్డు ఎక్కించదు అన్నది వైసీపీ పాలన రుజువు చేసింది. అందువల్ల అభివృద్ధి ఓటు కూడా కూటమికి తోడు కావాల్సిందే అని అంటున్నారు. ఇక ఉచితాలు మరీ అనుచితాలు అయ్యేలా కనిపిస్తే మాత్రం న్యూట్రల్ సెక్షన్ కూడా వేరేగా ఆలోచిస్తుంది అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.