Begin typing your search above and press return to search.

18 నెలల పాలనపై సమీక్షకు సిద్ధమైన బాబు

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల 12 నాటికి అక్షరాలా 18 నెలలు పూర్తి అయింది. అంటే ఏణ్ణర్థం పాలన అన్న మాట.

By:  Satya P   |   17 Dec 2025 8:45 AM IST
18 నెలల పాలనపై సమీక్షకు సిద్ధమైన బాబు
X

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల 12 నాటికి అక్షరాలా 18 నెలలు పూర్తి అయింది. అంటే ఏణ్ణర్థం పాలన అన్న మాట. మొత్తం అరవై నెలలు అధికారం ప్రజలు కూటమికి ఇస్తే అందులో 18 నెలలు కంప్లీట్ అయ్యాయి. అంటే ఒక విధంగా మూడవ వంతు పాలన పరిసమాప్తం అయింది అని అంటున్నారు. ఈ పాలనలో టీడీపీ కూటమి తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గురించి సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఈ ఏణ్ణర్థం కాలం ఒక విధంగా చూస్తే కీలకమైన దశగా చెబుతున్నారు. ఒక మైలురాయిగా కూడా చూస్తున్నారు.

కలెక్టర్ సదస్సులో :

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తప్పనిసరిగా పరిపాలనా సంబంధమైన విషయాలలో సరైన చర్యలు తీసుకుంటున్నారు. ఠంచనుగా ప్రతీ నెలా రెండు సార్లు మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతీ మూడు నెలలకు కలెక్టర్ల సదస్సుని కూడా నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు మొత్తం అన్ని శాఖల మీద సమగ్రమైన సమీక్షగా ఈ కలెక్టర్ల సదస్సు నిలుస్తోంది. ప్రతీ జిల్లాలో పరిపాలనకు మొదటి కేంద్ర బిందువుగా కలెక్టరేట్లు ఉంటాయి కాబట్టి బాబు కలెక్టర్ల సదస్సుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. సుదీర్ఘంగా రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేస్తూ పాలనను మరింతగా ముందుకు నడిపించేందుకు చూస్తున్నారు.

సుస్థిర అభివృద్ధి సంక్షేమం ఎజెండా :

ఇదిలా ఉంటే ఈ నెల 17, 18 తేదీలలో రెండు రోజుల పాటు అమరావతి రాష్ట్ర సచివాలయం కేంద్రంగా నిర్వహిస్తున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సుస్థిర అభివృద్ధి సంక్షేమం ఎజెండాగా చేసుకుంటున్నారు. అంతే కాదు గత 18 నెలల పాలనపై సమీక్షతో పాటు .కలెక్టర్లకు చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇది కూటమి ప్రభుత్వం పాలనలో జరుగుతున్న అయిదవ కలెక్టర్ల కాన్ఫరెన్స్ గా చెబుతున్నారు. ఈ సమావేశంలో నూతన లక్ష్యాలు, కార్యాచరణపై ముఖ్యమంత్రి మార్గదర్శనం కూడా చేస్తారు అని తెలుస్తోంది.

అభివృద్ధి లక్ష్యాలతో :

ఇక రాష్ట్ర స్థూల ఉత్పత్తి, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అభివృద్ధి లక్ష్యాలు వంటి వాటిపై తొలి రోజు సమావేశంలో కీలక చర్చ జరగనుందని చెబుతున్నారు. వీటికి అనుగుణంగా జిల్లా కలెక్టర్లు ఆయా రంగాల్లో ఎలా పని చేయాలనే విషయమై ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. అలాగే వివిధ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమల్లో ప్రజల సంతృప్త స్థాయి ఏ మేరకు ఉందనే అంశం పైనా తొలి రోజు సమావేశంలో చంద్రబాబు పూర్తి స్థాయిలో సమీక్షించనున్నారు. అలాగే ఇ-ఆఫీస్, ఫైళ్ల పరిష్కారం, ప్రజా ఫిర్యాదులు, డేటా డ్రివెన్ గవర్నెన్స్ వంటి అంశాలపై ఐటీ సెక్రటరీ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

కేంద్ర పధకాల గురించి :

అదే విధంగా కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై ప్రభుత్వం పూర్తి స్థాయి ఫోకస్ పెట్టింది. ఈక్రమంలో పథకాల అమలు ఏ విధంగా జరుగుతోంది కేంద్ర నిధులను ఏ మేరకు వినియోగించారు. వీటికి సంబంధించిన యూసీలు ఆయా శాఖలు ఎంత వరకు జారీ చేశారనే అంశంపైన కూడా ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. దీంతోపాటు ఏపీలో వివిధ జిల్లాలలో పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు ఎన్ని వచ్చాయి, వాటిని అమలు చేసే అంశంపై జిల్లా కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా బాబు వారితో చర్చించనున్నారు. సంక్షేమం ద్వారా సాధికారత సూపర్ సిక్స్ అమలు వంటి అంశాలపై బాబు లోతైన సమీక్ష చేపట్టనున్నారు.

లా అండ్ ఆర్డర్ మీద :

ఇక రెండో రోజు అయిన 18వ తేదీన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కీలకమైన రెవెన్యూ, ఆదాయార్జన శాఖలపై కీలక చర్చలో బాబు సమీక్ష చేయనున్నారు అని తెలుస్తోంది. అలాగే ఏపీలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హోం కార్యదర్శి విశ్వజిత్ సహా వివిధ జిల్లాల ఎస్పీలు పాల్గొననున్నారు. మొత్తం మీద చూస్తే ప్రభుత్వం ఏణ్ణర్థం కాలంలో ఏమి సాధించింది, జిల్లాలలో పనితీరు ఎలా ఉంది, పాలన ఏ విధంగా సాగుతోంది అన్నది ఈ కలెక్టర్ల సదస్సు ద్వారా తెలియనుంది.