Begin typing your search above and press return to search.

బాబు జగన్ ల మధ్య అసలు కధ అపుడేనా ?

ఆ విధంగా కూటమి పాలన ఫస్ట్ ఇయర్ సంతోషాలతో సంబరాలతో సాగింది. ఇక రెండవ ఏడాది జూన్ 13 నుంచి ప్రవేశిస్తోంది.

By:  Tupaki Desk   |   13 Jun 2025 3:30 AM
బాబు జగన్ ల మధ్య అసలు కధ అపుడేనా ?
X

ఏపీలో 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అలా ఇలా కాదు బిగ్ సౌండ్ తో వచ్చింది. కూటమి చేసిన మహా గర్జనకు విపక్షం అన్నదే లేకుండా పోయింది. ఎటు చూసినా కూటమే పరచుకుని ఉంది. తొలి ఏడాది పాలన కూటమిది ఏలా గడించింది అంటే నల్లేరు మీద నడక అని చెప్పాలి.

ఎందుకంటే ఎదిరించే ప్రతిపక్షం లేదు. అసెంబ్లీ లోపలా బయటా వన్ మ్యాన్ షోగా సాగింది. ఇక జనంలో సైతం కూటమి మీద కోటి ఆశలు ఉన్నాయి. ఏ ప్రకటన చేసినా ఏ రకంగా ముందుకు సాగినా జనాలు కూడా వెయిట్ చేస్తూ వచ్చారు. కూటమికి వారు సైతం ఎంతో టైం ఇచ్చారు.

ఆ విధంగా కూటమి పాలన ఫస్ట్ ఇయర్ సంతోషాలతో సంబరాలతో సాగింది. ఇక రెండవ ఏడాది జూన్ 13 నుంచి ప్రవేశిస్తోంది. ఇక్కడే అసలైన కధ ఉందని అంటున్నారు. గట్టిగా చెప్పాలంటే అతి పెద్ద పొలిటికల్ వార్ కి ఈ ఏడాదే బీజం పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే మామూలుగా అధికార పార్టీకి తొలి ఆరు నెలల సమయం హానీ మూన్ పీరియడ్ గా ఉంటుంది.

ఆ టైం నే విపక్షాలు కూడా ఇస్తాయి. కానీ ఏపీలో అయితే వైసీపీ ఏకంగా ఏడాది పాటు సమయం ఇచ్చింది. జగన్ ఎక్కడికీ పోలేదు పార్టీ తరఫున చేసిన నిరసనలు కూడా అరకొరగానే ఉన్నాయి. ఇక అసెంబ్లీకి సైతం వైసీపీ పోలేదు. జగన్ ఈ ఏడాది కాలంలో పెట్టిన మీడియా సమావేశాలు కొన్ని తప్ప ఆయన వాయిస్ కూడా పెద్దగా వెళ్ళింది లేదు.

దాంతో అంతా కూటమి వాయిసే జనంలోకి పోయింది. కూటమి తరఫున ముగ్గురు బలమైన నాయకులు చంద్రబాబు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ జనంలో ఉంటూ పార్టీ తరఫున పాజివిటీని పెంచడానికి కృషి చేశారు. అదే సమయంలో విపక్ష వైసీపీని ఎక్కడికక్కడ కట్టడి చేశారు. మొత్తం మీద చూస్తే సాఫీగా హ్యాపీగా తొలి ఏడాది గడచింది.

ఇక మీదట ఇలా ఉండడని కూటమి పెద్దలకు కూడా తెలుసు. మరో వైపు చూస్తే జనంలో నెమ్మదిగా యాంటీ ఇంకెంబెన్సీ పెరుగుతోంది. ఇది కూడా కూటమి పార్టీలు గ్రహిస్తున్నాయి. అదే అదనుగా ఈ రెండో ఏడాది జనంలోకి వెళ్ళడానికి వైసీపీ అధినేత జగన్ చూస్తున్నారు అని అంటున్నారు ఆయన తన జిల్లా పర్యటనలను జూలై 8 వైఎస్సార్ జయంతి వేడుకల నుంచి మొదలెడతారు అని అంటున్నారు.

జగన్ జనంలోకి వెళ్ళి కూటమి మీద విమర్శల బాణాలు ఎక్కుపెడతారు అని అంటున్నారు దాంతో కూటమి కూడా కౌంటర్ చేస్తుంది. దాంతో రాజకీయ వేడి అన్నది పెద్ద ఎత్తున రాజుకోవడం ఖాయమని అంటున్నారు. అంతే కాదు వామపక్షాలు కాంగ్రెస్ వంటి పార్టీలు సైతం ఈ ఏడాది నుంచి జనంలో ఎక్కువగా ఉండే ప్రయత్నం చేస్తాయని అంటున్నారు.

ఇక తొలి ఏడాది ఉపేక్షించామని ఇక మీదట విపక్ష వైసీపీ విపరీత పోకడలను సహించేది లేదని చంద్రబాబు తన మొదటి ఏడాది పాలన పూర్తి సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో గట్టిగానే వార్నింగ్ ఇచ్చేశారు. ఎవరు తోక జాడించినా ఏమి చేయాలో బాగా తెలుసు అని ఆయన నర్మ గర్భ వ్యాఖ్యలు చేశారు. ఆషామాషీగా తీసుకోవడం అన్నది కుదరదని ఆయన ఖరాఖండీగా చెప్పేశారు. దాంతో ఏపీలో అసలైన రాజకీయ యుద్ధం ఇక మీదట మొదలు కాబోతోంది. అది ఏ రూపంలో ఉంటుంది. ఏ లెవెల్ కి చేరుతుంది. పీక్స్ కి వెళ్తే సీన్ ఎలా ఉంటుంది అన్నది రాజకీయ తెర మీద చూడాల్సిందే. సో అంతా వెయిటింగ్ మరి.