'తల్లికి వందనం'... ప్రతిపక్షాల విమర్శలకు చేతలతోనే సమాధానం!
అవును... ఏపీలో కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వ పాలన మొదలై ఏడాది పూర్తైన నేపథ్యంలో.. తల్లులకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు.
By: Tupaki Desk | 11 Jun 2025 10:30 PMఏపీలో తల్లులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన తల్లికి వందనం నిధులు విడుదల చేయనుంది. ఈ పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 జమ చేయనుంది. అయితే ఈ డబ్బులు రావాలంటే వెంటనే కొన్ని పనులు పూర్తి చేయాలి!
అవును... ఏపీలో కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వ పాలన మొదలై ఏడాది పూర్తైన నేపథ్యంలో.. తల్లులకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఇందులో భాగంగా... రేపు (జూన్ 12) న తల్లికి వందనం హామీ అమలుకు నిర్ణయించారు. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద, తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు జమ చేయనున్నారు.
గతంలోనే ప్రభుత్వం పాఠశాలల రీ-ఓపెన్ సమయంలో తల్లికి వందనం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో.. ఈ పథకం కింద లబ్దిదారులకు నిధులు జమ చేయాలని నిర్ణయించింది. ఈ పథకం అమలుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు.. అమలు ద్వారా సమాధానం చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వాస్తవానికి.. రాష్ట్రంలో ఉన్న ఆర్దిక ఇబ్బందుల కారణంగా ఒక దశలో రెండు విడతలుగా ఈ పథకం అమలు చేస్తారనే చర్చ నడిచింది. అయితే, రాజకీయంగా విమర్శలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే కాకుండా.. స్కూల్స్ ప్రారంభమైనప్పుడు విద్యార్థుల తల్లులకు మద్దతుగా ఒకే విడతలో హామీ ఇచ్చిన విధంగా అమలుకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమయంలో ఈ డబ్బులు అందాలంటే తల్లులు ముందుగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా.. ముందుగా తల్లులు, వారి పిల్లల వివరాలు హౌస్ హోల్డ్ డేటాబేస్ లో నమోదు చేయించుకోవాలి. ఒకవేళ ఇంకా నమోదు చేయకపోతే, స్థానిక అధికారులను సంప్రదించి వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇదే సమయంలో... తల్లుల బ్యాంకు ఖాతాలు ఆధార్ కార్డుతో లింకు అయ్యి ఉండాలి.
దీనికోసం సంబంధిత బ్యాంకుకు వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. లేదా నెట్ బ్యాకింగ్, మొబైల్ యాప్ ద్వారా అయినా ఆధార్ ను లింక్ చేసుకునే అవకాశం ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పీ.సీ.ఐ) లింకింగ్ అయ్యిందో, లేదో అనే విషయాన్ని మీ-సేవా కేంద్రాల ద్వారా చెక్ చేసుకోవచ్చు.
కాగా... గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో ‘బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ’ పేరుతో చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో ‘తల్లికి వందనం’ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో విజయం సాధించి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగా... ఈ పథకం ప్రారంభంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఈ పథకం ప్రారంభానికి ప్రభుత్వం రెడీ అయింది. ఈ పథకం కింద ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే.. అంతమంది పిల్లలకు సంవత్సరానికి తలో రూ.15 వేలు ఇవ్వనున్నారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30,000, ముగ్గురు పిల్లలు ఉంటే రూ.45,000 చొప్పున ఎలాంటి కటింగ్స్ లేకుండా నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది!