Begin typing your search above and press return to search.

అసెంబ్లీకి వచ్చి వెళ్లటానికి లేదు.. ఏపీ స్పీకర్ కీలక నిర్ణయం

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్పాత్రుడు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

By:  Garuda Media   |   11 Feb 2026 9:00 AM IST
అసెంబ్లీకి వచ్చి వెళ్లటానికి లేదు.. ఏపీ స్పీకర్ కీలక నిర్ణయం
X

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్పాత్రుడు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టే ఎమ్మెల్యేలకు షాకిచ్చే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలు తప్పనిసరిగా డిజిటల్ హాజరును నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు.

అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటివరకు వైసీపీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి హాజరవుతున్నారే తప్పించి.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావటం లేదు. ఇప్పటికే పలుమార్లు అసెంబ్లీకి హాజరు కావాలంటూ ఆయన కోరారు. అంతేకాదు.. సభకు హాజరు కాకుండా జీతాలు తీసుకోవటం.. ఎమ్మెల్యేలుగా కొనసాగటం సబబేనా? అంటూ ప్రశ్నించటం తెలిసిందే. అంతేకాదు.. వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు అయితే.. ఆ సభ్యుడిపై అనర్హత వేటు వేయొచ్చని చట్టంలో చెబుతున్నట్లుగా శాసనసభ వ్యవహారాల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

అయితే.. దీనికి సంబంధించి రెండు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అదేమంటే.. గవర్నర్ ప్రసంగానికి హాజరైనంత మాత్రాన సమావేశాలకు హాజరైనట్లుగా పరిగణలోకి తీసుకోరని చెబుతున్నారు. అయితే.. వైసీపీ నేతల వాదన మరోలా ఉంది. గవర్నర్ ప్రసంగానికి హాజరైతే అసెంబ్లీకి హాజరైనట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వేళ.. సభకు హాజరయ్యారా? లేదా? అన్నది తేల్చేందుకు డిజిటల్ సంతకాల పట్టికను ఏర్పాటు చేయనున్నారు. దీంతో.. సభకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

అంతేకాదు.. ఏపీ స్పీకర్ అమల్లోకి తీసుకొచ్చిన డిజిటల్ అటెండెన్సులో తమ హాజరు వేయించుకుంటారా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటివరకు జరిగిన బీఏసీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవటం తెలిసిందే. బుధవారం ఏపీ అసెంబ్లీ షెడ్యూల్ చూస్తే.. గవర్నర్ ప్రసంగం అయ్యాక బీఏసీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులోనే అసెంబ్లీని ఎన్ని రోజులు నిర్వహించాలన్న నిర్ణయాన్ని తీసుకుంటారు. మరి.. వైసీపీ ఎమ్మెల్యేల వ్యూహమేంటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.