నాలుగున్నర గంటల్లో 19 బీర్లు తాగారు.. ఇద్దరు టెకీలు మృతి!
అతిగా మద్యం తాగిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 19 Jan 2026 1:11 PM ISTఅతిగా మద్యం తాగిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. ఈ మరణాలు కల్తీ మద్యం వల్ల సంభవించినవి కావని.. అతిగా మద్యం తాగడం వల్ల ఇద్దరు స్నేహితులూ అపస్మారక స్థితికి వెళ్లారని.. ఈ సమయంలో వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. వీరితో పాటు మద్యం సేవించిన మరో నలుగురు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు.
అవును... పోటీ పడి అతిగా మద్యం తాగడం వల్ల ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మృతి చెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె మండలంలో చోటుచేసుకుంది. ఇందులో భాగంగా... బండవడ్డిపల్లెకు చెందిన మణికుమార్(36) చెన్నైలో, పుష్పరాజ్(26) బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పండగకు స్వగ్రామానికి వచ్చిన వీరు.. మరో నలుగురు స్నేహితులతో కలిసి శనివారం రాత్రి ఊరికి సమీపంలో మద్యం తాగారు.
ఈ క్రమంలో మణికుమార్, పుష్పరాజ్ కింద పడిపోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో.. వెంటనే వారిని పీలేరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి, ప్రభుత్వ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. అక్కడికి తరలిస్తుండగా మణికుమార్ మార్గమధ్యలోనే చనిపోగా.. పుష్పరాజ్ చికిత్స పొందుతూ మరణించారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్షలు పూర్తిచేశారు. దీంతో బండవడ్డిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ సందర్భంగా స్పందించిన రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్.. అధిక మోతాదులో మద్యం తాగడమే మరణాలకు కారణమని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. రెండు ప్రత్యేక బృందాలతో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మద్యం నమూనాలను ల్యాబ్ కు పంపి పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. మృతుల్లో.. మణికుమార్ కు భార్య, రెండేళ్ల వయసున్న కుమారుడు ఉండగా.. పుష్పరాజ్ కు వివాహం కాలేదు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఈ సందర్బంగా స్పందించిన జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆరుగురు కలిసి ఒకే రకం మద్యం తాగారని.. వారిలో ఇద్దరు మరణించారని.. అతిగా మద్యం తాగడంతోనే వారు మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని.. మిగిలిన నలుగురూ.. ఆవలకుంట శ్రవణ్ కుమార్ (23), పసుపులేటి శివమణి (21), ఆవలకుంట వేణుగోపాల్ (20), కోటకొండ అభిషేక్ (18) ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. పార్టీ సమయంలో ఇద్దరూ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు పోటీపడి మొత్తం 19 బీర్లు తాగినట్లు అధికారులు వెల్లడించారు!
