Begin typing your search above and press return to search.

కూటమి 'ఉపా'యం.. చాలా ఆపాయం! విపక్ష యూట్యూబర్లకు హైరిస్క్?

యూట్యూబర్ రావణ్ పై నమోదు చేసిన ఉపా కేసులు కోర్టులో నిలుస్తాయా? లేదా? అన్న విషయం పక్కన పెడితే, ప్రస్తుతానికి అతడిని జైలులో పెట్టాలన్న ప్రభుత్వ సంకల్పం ఈ చర్యతో నెరవేరిందని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   6 July 2026 10:00 PM IST
కూటమి ఉపాయం.. చాలా ఆపాయం! విపక్ష యూట్యూబర్లకు హైరిస్క్?
X

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై ఉక్కుపాదం మోపుతున్న ఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుందా? అన్న చర్చ జరుగుతోంది. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారం ద్వారా విపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలకు ఈ దిశగా గట్టి సంకేతాలు పంపిందని చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈ నెల 1న యూట్యూబర్ రావణ్ ను హైదరాబాద్ లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయనపై సోషల్ మీడియా కేసులు నమోదు చేయడంతో ఒక్కరోజులోనే బెయిలు లభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పదునైన అస్త్రం ప్రయోగించిందని చెబుతున్నారు. పవన్ పై అనుచిత వ్యాఖ్యలకు సంబంధం లేకుండా, రావణ్ చేసిన పాత వీడియో ఆధారంగా అత్యంత కఠినమైన ఉపా (UAPA) చట్టం ప్రయోగించి బెయిలు రాకుండా చేయడం ద్వారా ప్రభుత్వ వైఖరి స్పష్టం చేసిందని అంటున్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రావణ్ పై ప్రస్తుతానికి ఐదు చోట్ల కేసులు నమోదు అయితే నాలుగు చోట్ల బెయిలు మంజూరైంది. దీంతో సోషల్ మీడియా కేసులు నమోదు చేస్తే బెయిలు వస్తుందన్న ధీమాతో మరింత మంది విపక్ష మద్దతుదారులు చెలరేగిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్న ప్రభుత్వం ఉపా వంటి కఠినమైన చట్టాలను ప్రయోగించాలని నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ పై వ్యాఖ్యలకు ఉపా చట్టం వర్తించకపోయినా, అంతకు ముందు ఎప్పుడో మావోయిస్టు పార్టీని సమర్థిస్తున్నట్లు రావణ్ చేసిన వీడియోను ప్రభుత్వం వెలికి తీయడమే హాట్ టాపిక్ అవుతోంది. ఈ చర్యతో ప్రభుత్వ వ్యతిరేక భావజాలంతో ఉన్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

యూట్యూబర్ రావణ్ పై నమోదు చేసిన ఉపా కేసులు కోర్టులో నిలుస్తాయా? లేదా? అన్న విషయం పక్కన పెడితే, ప్రస్తుతానికి అతడిని జైలులో పెట్టాలన్న ప్రభుత్వ సంకల్పం ఈ చర్యతో నెరవేరిందని అంటున్నారు. ఒకే అంశంపై నమోదైన నాలుగు కేసుల్లో బెయిలు తెచ్చుకున్న రావణ్ గన్నవరం పోలీసులు నమోదు చేసిన ఉపా కేసుతో చేతులెత్తేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఈ ఊహించని పరిణామంతో అతడి తరపు న్యాయవాదులు సైతం షాక్ కు గురయ్యారని అంటున్నారు. ఎవరినైనా ఉపా చట్టం కింద అరెస్ట్ చేస్తే పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసే వరకు బెయిలు మంజూరయ్యే పరిస్థితి లేదని అంటున్నారు. ఈ లెక్కన యూట్యూబర్ రావణ్ కు కనీసం ఆరు నెలలు వరకు నిర్బంధంలో ఉంచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఉపా చట్టంలోని Section 43D (5) ప్రకారం రావణ్ పై మోపిన అభియోగాలకు పోలీసులు తగిన సాక్ష్యాధారాలు చూపిస్తే బెయిల్ కూడా కష్టమే అంటున్నారు. ఈ ఘటన ద్వారా విపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు పంపిందని అంటున్నారు. ప్రభుత్వ వ్యూహాన్ని సోషల్ మీడియా కార్యకర్తలు ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, విద్వేష పూరిత ప్రసంగాలపై కఠినంగానే వ్యవహరిస్తోందని గుర్తు చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు సూచనల మేరకు సోషల్ మీడియా కేసులలో వెనువెంటనే బెయిలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండటంతో ప్రభుత్వం ఇతర మార్గాలను అన్వేషిస్తుండటమే చర్చనీయాంశం అవుతోంది.