సోషల్ మీడియా వాడకంపై నియంత్రణ దిశగా కూటమి
కత్తికి రెండు వైపులా పదును ఉంది అంటారు. అలాగే సామాజిక మాధ్యమాలు కూడా. ఇవి ఎంతో గొప్పవి.
By: Satya P | 11 Feb 2026 12:56 PM ISTకత్తికి రెండు వైపులా పదును ఉంది అంటారు. అలాగే సామాజిక మాధ్యమాలు కూడా. ఇవి ఎంతో గొప్పవి. వాటిని వినియోగించే వారి విచక్షణ మీదనే మేలు లేదా కీడు ఆధారపడి ఉంటుంది. మరీ ముఖ్యంగా 18 ఏళ్ళ లోపు టీనేజర్లు వీటిని వినియోగించడం మీద చాలా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సరిగ్గా చదువుకునే వయసు. లక్ష్యాలను నిర్ణయించుకునే వయసులో సోషల్ మీడియా మాయాజాలంలో వారు పడిపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దాంతో ఈ విషయం మీద కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది.
నియంత్రణ దిశగా :
ఏపీలో 18 ఏళ్ల వయసు లోపు వారికి సామాజిక మాధ్యమాల వినియోగంపై నియంత్రణ విధించేలా చట్టం చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ దిశగా చర్యలు తీసుకుంటామని గవర్నర్ స్పష్టంగా చెప్పుకొచ్చారు దాంతో ఏపీలో తొందరలోనే టీనేజర్లకు సోషల్ మీడియా వాడకం విషయంలో నిబంధనలు కఠినంగా అమలు కాబోతున్నాయన్న మాట.
హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ :
కూటమి ప్రభుత్వం హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తోందని గవర్నర్ పేర్కొనడం విశేషం. ఆ దిశగా అనేక చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఏపీని సంపన్న రాష్ట్రంగా అలాగే ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా ఆనందకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని కూడా వివరించారు.
రాష్ట్ర జీఎస్డీపీ పెరిగింది :
గత ఇరవై నెలల కూటమి ప్రభుత్వం పాలనాపరంగా తీసుకుంటున్న అనేక నిర్ణయాల ఫలితంగా రాష్ట్రం ఆర్థికంగా అగ్రగామిగా ముందుకు పరుగులు తీస్తోంది అని గవర్నర్ ప్రసంగంలో చెప్పుకొచ్చారు. రాష్ట్ర జీఎస్డీపీ కూడా పెరిగింది అని గుర్తు చేశారు. 2025-26 అంచనాల ప్రకారం రాష్ట్ర జీఎస్డీపీ 17.62 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందని చెప్పారు. అదే విధంగా తలసరి ఆదాయం 2.95 లక్షల రూపాయలకు చేరిందని వెల్లడించారు. ఇక వ్యవసాయంలో వృద్ధి రేటు 7.83 శాతంగా నమోదైందని, పరిశ్రమల రంగం 9.73 శాతం, సేవల రంగం 12.94 శాతం మేర వృద్ధిని నమోదు చేశాయని గవర్నర్ వివరించారు.
టెక్నాలజీతో మరింతగా :
పౌర సేవలు అన్నీ టెక్నాలజీ ఆసరాతో మరింత సులువుగా వేగంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని గవర్నర్ తెలిపారు. పరిపాలనా సంస్కరణలలో భాగంగా టెక్నాలజీ ద్వారా ప్రభుత్వం సులభ రీతిలో పౌర సేవలు అందిస్తోందని అన్నారు. మన మిత్ర వాట్సప్ ద్వారా ప్రజలకు చేరువగా ప్రభుత్వ సేవలను దగ్గర చేసిందని గుర్తు చేశారు. అలాగే డేటా ఆధారిత నిర్ణయాలను తీసుకుని వేగంగా సేవలు అందేలా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇక వన్ ఫ్యామిలీ- వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్ద కృషి చేస్తోందని గవర్నర్ చెప్పారు యువ పారిశ్రామిక వేత్తలు దీనిని అందిపుచ్చుకునేలా ప్రోత్సాహన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు.
కొత్త జిల్లాలతో :
ఇప్పటిదాకా ఉన్న జిల్లాలకు అదనంగా మరో రెండు జిల్లాలు చేర్చడం జరిగిందని గవర్నర్ చెప్పారు. ప్రజలకు పాలనను మరింత దగ్గర చేసేందుకు 26 జిల్లాలను 28కి ప్రభుత్వం పెంచిందని అన్నారు. ఇక భూమి రికార్డులను డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా భద్రపరచటంతో పాటు సర్వే ప్రక్రియను పటిష్టంగా నిర్వహిస్తోందని అన్నారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయటంతో పాటు 22 ఏ కింద పెట్టిన భూములను ప్రభుత్వం సమీక్షిస్తోందని చెప్పారు.
పర్యావరణహితంగా :
రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పర్యావరణ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గవర్నర్ చెప్పారు. . గత పాలకులు వదిలి వెళ్లిన చెత్తను తొలగించి సర్క్యులర్ ఎకానమీని కూడా ప్రోత్సహిస్తోందని వివరించారు. అలాగే ఆర్థిక ఒత్తిళ్లు కీలక బాధ్యతలు ఎన్ని ఉన్నా కూడా క్రమశిక్షణతో ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలకు తన ప్రసంగం ద్వారా వివరించారు.
