అమెరికాకు 2వేల కంటైనర్ల రొయ్యలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెంచిన సుంకాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో వందల కంటైనర్ల రొయ్య సముద్ర మార్గాన బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది.
By: Tupaki Desk | 15 April 2025 1:27 PM ISTఆంధ్రప్రదేశ్ రొయ్య మళ్లీ అమెరికాకు ఎగుమతి అయ్యేందుకు సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెంచిన సుంకాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో వందల కంటైనర్ల రొయ్య సముద్ర మార్గాన బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. దీంతో రాష్ట్రంలోని శీతల గోదాముల్లో నిల్వలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సుమారు 30 వేల నుంచి 40 వేల టన్నుల రొయ్యలు (3 వేల నుంచి 4 వేల కంటెయినర్ల వరకు) ఎగుమతికి సిద్ధంగా ఉన్నాయని అంచనా.
టారిఫ్‌ల వాయిదా ప్రకటనతో రొయ్యల కొనుగోలులో కొంత పురోగతి కనిపించింది. సోమవారం ఉదయంతో పోలిస్తే మధ్యాహ్నం నుంచి ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. 30 కౌంట్ రొయ్య ధర ఉదయం కిలోకు రూ.420 ఉండగా, మధ్యాహ్నం తర్వాత రూ.10 పెరిగి రూ.430కి చేరింది. అలాగే, 25 కౌంట్ రొయ్య ధర రూ.470 నుంచి రూ.500కి పెరిగింది. చిన్న కౌంట్ రొయ్యలకు కూడా కిలోకు రూ.5 నుంచి రూ.10 వరకు ధర పెరిగింది.
అయితే, టారిఫ్‌ల ప్రకటనకు ముందున్న ధరలు మాత్రం రైతులకు దక్కడం లేదు. 100 కౌంట్ రొయ్య గతంలో కిలోకు రూ.240 ఉండగా, ప్రస్తుతం రూ.220 నుంచి రూ.230 వరకు మాత్రమే లభిస్తోంది. 30 కౌంట్ రొయ్య ధరలో మరింత వ్యత్యాసం ఉంది. టారిఫ్‌ల ప్రకటనకు ముందు కిలో రూ.470 వరకు పలికిన ఈ రకం రొయ్య ప్రస్తుతం రూ.420 నుంచి రూ.430 మధ్య పలుకుతోంది. దీంతో రైతులు ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
-ధరలపై తేలని నిర్ణయం
రొయ్యల ధరలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆక్వా సలహా కమిటీ సమావేశం సోమవారం జూమ్ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో అప్సడా వైస్ ఛైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, ఎగుమతిదారులు .. రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.
రొయ్యలకు ధర పెంచాలని రైతులు కోరగా, ఇప్పుడే ధరలు నిర్ణయించలేమని ఎగుమతి వ్యాపారులు స్పష్టం చేశారు. ఉత్పత్తిలో 70% ట్రేడర్ల ద్వారానే కొనుగోలు జరుగుతోందని వారు వివరించారు. అయితే ట్రేడర్లు కొనుగోలు చేసినా చివరకు రొయ్యలు వ్యాపారులకే చేరుతాయని రైతులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. వ్యాపారులు నిర్ణయించిన ధరలకే ట్రేడర్లు కూడా కొంటారని, కాబట్టి ప్రతి 15 రోజులకోసారి ధరలు ప్రకటించాలని రైతులు డిమాండ్ చేశారు.
ఈ విషయంపై వాడివేడిగా చర్చలు జరిగాయి. మిగిలిన వ్యాపారులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని, ఇప్పుడే ధరలు వెల్లడించలేమని ఎగుమతిదారుల సంఘ ప్రతినిధులు తెగేసి చెప్పడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. ఈ అంశంపై మంగళవారం మరోసారి సమావేశం జరగనుంది.
టారిఫ్‌ల వాయిదా ఎగుమతులకు ఊతమిచ్చినప్పటికీ, రైతులు మాత్రం ఆశించిన ధరలు లభించకపోవడంతో నిరాశలో ఉన్నారు. రాబోయే సమావేశంలోనైనా ధరలపై స్పష్టమైన హామీ లభిస్తుందో లేదో చూడాల్సి ఉంది.