Begin typing your search above and press return to search.

వైసీపీలోకి వెళ్ళి పొలిటికల్ లైఫ్ కాల్చుకున్నారా ?

ఆ ఇద్దరూ సీనియర్ నేతలే. వారిలో ఒకరు కరణం బలరామకృష్ణమూర్తి. ఆయన చంద్రబాబు సమకాలీనుడు.

By:  Tupaki Desk   |   5 April 2025 10:19 AM IST
వైసీపీలోకి వెళ్ళి పొలిటికల్ లైఫ్ కాల్చుకున్నారా ?
X

రాజకీయాలు అంటేనే అనూహ్యమైనవి. ఎవరూ ఊహించలేనివి జరుగుతాయి. ఒక పార్టీ ఓటమి పాలు అవుతుందని ముందుగా అంచనా కట్టి వేరే పార్టీలోకి దూకేస్తే అక్కడ ఓటమి ఎదురై మరో అయిదేళ్ళు ప్రతిపక్షంలోకి రావచ్చు. లేక తాము ఉన్న పార్టీకి ఇక జీవిత కాలంలో అధికారం దక్కదని లెక్కలేసి మరీ పక్క పార్టీలోకి దూకేస్తే అక్కడ సీన్ సితారే ఉండలేక పాత పార్టీలోకి రాలేక రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడిన సందర్భాలు ఉంటాయి.

గతంలో రాజకీయాలు వేరు, ఇపుడు వేరు ప్రత్యర్ధులు కాకుండా శత్రువులు మాదిరిగా మారిన రాజకీయాల్లో ఈ శిబిరం నుంచి ఆ శిబిరం వైపు దూకేటప్పుడే అన్నీ ఆలోచించుఓవాలని అంటారు. కానీ రాజకీయ జీవులకు అనివార్యతలు పరిమితులు అన్నీ కలసి స్పాట్ డెసిషన్స్ తీసుకునేలా చేస్తాయి అవి జీవిత కాలం బాధలను మిగులుస్తాయా అంటే అవును అనేది ఏపీలో చాలా మందిని చూస్తే అర్ధమవుతోంది.

ఏపీలో చూస్తే వైసీపీ ద్వారా ఎందరో రాజకీయ జీవితాలను అందుకున్నారు. ఎందరో మంత్రులు అయ్యారు అలాగే పార్లమెంట్ గడప తొక్కారు అదే సమయంలో చాలామంది రాజకీయ జీవితం కూడా చీకటిలోకి నెట్టబడింది అని చెప్పక తప్పదు. అలా తమ రాజకీయ జీవితాలనే కాకుండా తమ వారసుల జీవితాలను కూడా చిదిమేసుకున్న నాయకులు ప్రకాశం జిల్లాలో ఇద్దరు కనిపిస్తారు.

ఆ ఇద్దరూ సీనియర్ నేతలే. వారిలో ఒకరు కరణం బలరామకృష్ణమూర్తి. ఆయన చంద్రబాబు సమకాలీనుడు. చిత్రమేంటి అంటే ఈ రోజు వరకూ మంత్రి కాలేకపోయారు. ఆయన రాజకీయ నిర్ణయాలలో తడపాటు వల్లనేనా ఈ పరిస్థితి అంటే ఆలోచించాల్సిందేనేమో. వైసీపీ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని ఆయన 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచారు. అయితే ఆయన ఆ పార్టీలో ఉండకుండా 2020లో వైసీపీలోకి జంప్ అయ్యారు.

అలా ఆయన రాజకీయం అధికార పార్టీలో కొంతకాలం సాగినా ఇపుడు ఇబ్బందులో పడింది. కాంగ్రెస్ నుంచి రాజకీయాలు మొదలెట్టి ఎన్టీఆర్ చంద్రబాబులతో కలసి రాజకీయం చేసిన కరణం ఎంపీగా ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు.

ఇంతటి ఘనమైన రాజకీయ చరిత్ర కలిగిన కరణం ఇపుడు తన రాజకీయ వారసుడు వెంకటేష్ ని నిలబెట్టాలని చూస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా వెంకటేష్ ఓటమి పాలు అయ్యారు. ఇక కరణం గెలిచారు. వైసీపీలో ఉన్న కరణం మనసు టీడీపీ వైపు ఉన్నా ఏ విధంగా అడుగులు వేయాలో తెలియడం లేదని అంటున్నారు.

టీడీపీలో జిల్లా స్థాయి నేతగా పెద్ద దిక్కుగా నడచిన ఆయన ఇపుడు ఏ విధగా తిరిగి ఆ పార్టీలో చేరాలి అన్నది ఒక సంశయంగా పట్టి వేధిస్తోంది అని అంటున్నారు. టీడీపీలోకి వెళ్ళలేక వైసీపీలో ఉండలేక కరణం కుటుంబం రాజకీయంగా నలిగిపోతోంది అని అంటున్నారు వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఏమి అవుతుందో అన్న చర్చ కూడా ఉందిట.

ఇక మరో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు విషయం ఇలాగే ఉంది. ఆయన మంచి వ్యాపారవేత్త 1999 నుంచి తెలుగుదేశంతో అనుబంధం ఉంది. రాజకీయంగా పాతికేళ్ళకు పైగా అనుభవం ఉంది. 2014లో సిద్ధా రాఘవరావు దర్శి నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. బాబు మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు.

అయితే 2019లో ఓటమి తరువాత ఆయన తన కుమారుడు వెంకట సుధీర్ కుమార్ రాజకీయం కోసం టీడీపీ వీడి వైసీపీలో చేరారు. కానీ ఆయన ఆశించింది ఏమీ అక్కడ జరగలేదు. సరైన ప్రాధాన్యత కూడా దక్కలేదు. తన కుమారుడు వెంకట సుధీర్ కుమార్ కి 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి జగన్ ఒప్పుకోలేదు. కనీసం తనకైనా ఇస్తే పోటీ చేస్తాను అన్నా చాన్స్ దక్కలేదు. ఈయన కూడా కరణం మాదిరిగానే టీడీపీలోకి వెళ్ళాలని ఉన్నప్పటికీ కష్టకాలంలో పార్టీకి హ్యాండ్ ఇచ్చి ఈ వైపు వచ్చిన తరువాత మళ్ళీ ఎలా అన్న సంశయం ఉంది. దాంతో ఏమీ పాలుపోక అలా ఉండిపోయారని అంటున్నారు.

ఈ ఇద్దరే కాదు ఉత్తరాంధ్రాలో చూస్తే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా ఇపుడు రాజకీయంగా ఎటూ కాకుండా ఉన్నారు. ఆయన 2019లో వైసీపీలో చేరి మంత్రి అయ్యారు కానీ అది మూడేళ్ళ ముచ్చటే అయింది. ఆ తరువాత నుంచి ఆయనకు తగిన గుర్తింపు తగ్గలేదు దాంతో వైసీపీ ఓటమి తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరం పాటిస్తున్నారు.

మరో సీనియర్ నేత దాడి వీరభద్రరావు విషయం అలాగే ఉంది. ఆయన వైసీపీలోకి వెళ్ళకుండా ఉండి ఉంటే కుమారుడు దాడి రత్నాకర్ కి టీడీపీలో మంచి చాన్స్ ఉండేది. ఆయన అటూ ఇటూ తిరగడంతో ఏమీ కాకుందా అయినట్లు అయింది అంటున్నారు. అలాగే టీడీపీలో అన్నీ అనుభవించి కష్టకాలంలో పార్టీని వీడిన వారంతా ఇపుడు మధన పడుతున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీలోకి వెళ్ళి తమ బిడ్డల ఫ్యూచర్ ని కూడా లేకుండా చేసుకున్నామా అన్న అంతర్మధనం కూడా వారిలో కలుగుతోందిట.