రాష్ట్ర సమాచార కమిషనర్ గా వీ.ఎస్.కే చక్రవర్తి!
ఈ సమయంలో రాష్ట్ర సమాచార కమిషనర్ గా సీనియర్ పాత్రికేయుడు వి.ఎస్.కే. చక్రవర్తి ఎంపికయ్యారు.
By: Raja Ch | 28 Dec 2025 1:57 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాచార హక్కు కమిషనర్ల నియామక ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. ఇందులో భాగంగా... రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ గా న్యాయవాది వజ్జా శ్రీనివాసరావు నియామకాన్ని ఖరారు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మరో నలుగురు రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకాన్ని ఖరారు చేశారు. ఈ సమయంలో రాష్ట్ర సమాచార కమిషనర్ గా సీనియర్ పాత్రికేయుడు వి.ఎస్.కే. చక్రవర్తి ఎంపికయ్యారు.
అవును... ఏపీలో సమాచార హక్కు కమిషనర్ల నియామక ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈ నేపథ్యంలో... ప్రధాన సమాచార కమిషనర్ గా న్యాయవాది వజ్జా శ్రీనివాసరావు నియామకాన్ని ఖరారు చేసిన సీఎం మరో నలుగురు కమిషనర్ల నియామకాన్ని కూడా ఖరారు చేశారు. ఈ క్రమంలో.. ఇప్పటికే రవియాదవ్, పీఎస్ నాయుడు, ఆదెన్న పేర్లు ఖరారు కాగా.. తాజాగా సీనియర్ పాత్రికేయుడు వీ.ఎస్.కే చక్రవర్తిని రాష్ట్ర కమిషనర్ గా ఖరారు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇటీవల జరిగిన కమిటీ సమావేశంలో చక్రవర్తిని ఈ పదవికి ఎంపిక చేశారు. ఆయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు కాగా.. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో ఆయన పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సినిమా జర్నలిస్టుగా పనిచేశారు! ఈ క్రమంలో ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు.
ఇలా సీఎం నేతృత్వలోని సెలక్షన్ కమిటీ ఇప్పటికే వీరి పేర్లను ఖరారు చేయగా.. వీరి నియామకాలకు సంబంధించిన ఫైలు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నర్ వద్దకు వెళ్తుంది. ఆయన ఆమోదం తర్వాత జీవో విడుదల చేస్తారు!
కాగా... ఏపీ సమాచార కమిషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ లో నోటిఫికేషన్ ద్వారా 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన స్వయంప్రతిపత్తి, చట్టబద్ధమైన సంస్థ. ఇందులో ఒక రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, 10 మందికి మించకుండా రాష్ట్ర సమాచార కమిషనర్లు ఉంటారు. సీఎం చైర్ పర్సన్ గా ఏర్పాటైన కమిటీ సిఫార్సుపై గవర్నర్ వీరిని నియమిస్తారు!
