Begin typing your search above and press return to search.

రేషన్ కార్డుదారులకు అన్నీ మంచి రోజులే !

ఇపుడు దానిని మరింతగా పటిష్టం చేస్తూ నెల ముప్పయి రోజులూ దుకాణం తెరచుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది.

By:  Satya P   |   1 Sept 2025 5:00 AM IST
రేషన్ కార్డుదారులకు అన్నీ మంచి రోజులే !
X

ఏపీలో రేషన్ తీసుకుంటున్న కోట్లాది మందికి ఏపీలో కూటమి ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఇక పైన చౌక దుకాణాలలో కేవలం బియ్యం మాత్రమే కాదు కంది పప్పు, వంట నూనె గోధుమపిండి, రాగులు వంటివి అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది అంతే కాదు నెలలో పదిహేను రోజులు మాత్రమే ఇప్పటిదాకా రేషన్ దుకాణాలు తెరచుకుంటూ ఉండేవి. కానీ ఇక మీదట నెలలో ముప్పయి రోజులూ తెరచి ఉంచుతామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియచేశారు. దీంతో రేషన్ కార్డు దారులకు భారీ ఊరట లభిస్తోంది.

మళ్ళీ పూర్వ వైభవం :

రేషన్ దుకాణాలు చాలా కాలంగా కళ తప్పిపోయాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఈ ఏడాది జూన్ నుంచి రేషన్ దుకాణాల వద్దనే రేషన్ సరుకులు ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా డెలివరీ ని రద్దు చేసింది. దీంతో పాటుగా కచ్చితనమైన సమయ పాలన పాటించాలని కూడా రేషన్ డీలర్లను ఆదేశించింది. ఆ విధంగా ప్రతీ నెలలో పదిహేను రోజుల పాటు రోనూ ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు వరకూ తిరిగి సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది వరకూ రేషన్ దుకాణాలు తెరచుకుంటున్నాయి. ఈ విధానం వల్ల ఎపుడైనా తమకు తోచిన వేళలో రేషన్ తెచ్చుకునే వెసులుబాటు అయితే ప్రజలకు కలుగుతోంది.

నెల మొత్తం అంటే :

ఇపుడు దానిని మరింతగా పటిష్టం చేస్తూ నెల ముప్పయి రోజులూ దుకాణం తెరచుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. దీంతో మరింత వెసులుబాటు అయితే పేదలకు కలుగుతోంది అని అంటున్నారు. వారు ఏ సమయంలో అయినా వెళ్ళి తమ రేషన్ ని విడిపించుకోవచ్చు. అంతే కాదు గతంలో కేవలం బియ్యం మాత్రమే రేషన్ దుకాణాలలో ఇచ్చేవారు. ఇపుడు కంది పప్పు, వంట నూనె, రాగులు, గోధుమ పిండి వంటివి అందించడం అన్నది పంపిణీ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. అదే కనుక జరిగితే మాత్రం కచ్చితంగా పేదలకు మంచి ప్రయోజనం కలుగుతుంది అని అంటున్నారు.

స్మార్ట్ రేషన్ కార్డులతో :

ఇక స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం అందచేస్తోంది దీని వల్ల ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నా తమ స్మార్ట్ కార్డుకు ఉన్న క్యూ ఆర్ కోడ్ తో అక్కడ నుంచే రేషన్ ని విడిపించుకోవచ్చు. చాలా మందికి తమ సొంత ఊరికో రేషన్ కార్డులు ఉంటున్నాయి. వారు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇపుడు స్మార్ట్ రేషన్ కార్డుని చూపించి తాము ఉన్న చోటనే రేషన్ తీసుకోవచ్చు అని అంటున్నారు.

అర్హత ఉన్న అందరికీ కార్డులు :

ఇక్కడ మరో విషయం కూడా ఉంది ప్రభుత్వం స్మార్ట్ కార్డుల జారీని నిరంతర ప్రక్రియగా చేస్తూ అంతా ఆన్ లైన్ విధానంగా తెచ్చింది. దాంతో ఎవరు ఎప్పుడైనా తమకు అర్హత ఉందని రేషన్ కార్డు కావాలని దరఖాస్తు చేసుకుంటే అన్నీ పరిశీలించి వారికి మంజూరు చేసే వీలుంది అలాగే కుటుంబ సభ్యులను కొత్తగా యాడ్ చేయాలని అన్నా లేక డిలిట్ చేయాలని అన్నా కూడా ఆన్ లైన్ ద్వారా అంతా చేసుకోవచ్చు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే రేషన్ తీసుకునే పేదలకు భారీ ప్రయోజనం చేకూర్చే విధంగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అన్నది అర్ధమవుతోంది.