రూ.కోట్ల ఆస్తులు ఉన్నా, సొంత ఇల్లు లేదంట? రాజ్యసభ అభ్యర్థుల లెక్కలు వెరీ ఇంట్రెస్టింగ్
రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఏపీ నుంచి మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అన్నీ ఏకగ్రీవం కానున్నాయి.
By: Tupaki Political Desk | 9 Jun 2026 12:52 PM ISTరాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఏపీ నుంచి మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అన్నీ ఏకగ్రీవం కానున్నాయి. సోమవారంతో నామినేషన్ ప్రక్రియ ముగియగా, మంగళవారం వాటిని పరిశీలించనున్నారు. అన్నీ సక్రమంగా ఉన్నాయని భావించిన తర్వాత అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు. ఇక మొత్తం నాలుగు స్థానాలకు నలుగురు అభ్యర్థులు నామినేష్లను దాఖలు చేయగా, టీడీపీ నుంచి భాష్యం రామకృష్ణ, సానా సతీశ్, చింతకాయల విజయ్ సోమవారం నామినేషన్లు సమర్పించారు. దీంతోపాటు తమ ఆస్తులు, అప్పులు, ఆదాయ వ్యయాలపై అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో పలు ఆసక్తికర విశేషాలు వెలుగుచూశాయి.
టీడీపీ నుంచి ఏకగ్రీవం కానున్న ముగ్గురు అభ్యర్థుల్లో భాష్యం రామకృష్ణ ఆస్తుల్లో టాప్ గా నిలిచారు. అదేవిధంగా చింతకాయల విజయ్ కన్నా ఆయన భార్య పేరిటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు చూపారు. ఈ ఇద్దరు తొలిసారిగా చట్టసభల్లో అడుగు పెడుతున్నారు. దీంతో వీరి ఆస్తుల జాబితా కూడా మొదటిసారి పబ్లిక్ అయిందని అంటున్నారు. టీడీపీ నుంచి బరిలోకి దిగిన ముగ్గురు అభ్యర్థుల్లో అత్యంత సంపన్న అభ్యర్థిగా భాష్యం రామకృష్ణ నిలిచారు. ఆయన కుటుంబ మొత్తం ఆస్తుల విలువ అక్షరాలా రూ.672.61 కోట్లుగా ఉంది. ఇందులో అత్యధికంగా రూ.502.64 కోట్ల విలువైన వ్యవసాయ భూములు, వాణిజ్య సముదాయాలు, నివాస భవనాలు వంటి స్థిరాస్తులు ఉన్నాయి. కేవలం రామకృష్ణ ఒక్కరి పేరిటే రూ.454.95 కోట్ల ఆస్తులు ఉండటం గమనార్హం. కాగా, కుటుంబ చరాస్తుల విలువ రూ.169.97 కోట్లుగా ఉంది. వీరి వద్ద రూ.18.37 కోట్ల విలువైన వాహనాలు ఉండగా, అందులో మెజారిటీ వాటాగా ఆయన కుమారుడు సాకేత్ రామ్ పేరిట రూ.18.14 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇక రామకృష్ణ వద్ద రూ.2.20 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు 25 క్యారెట్ల ఖరీదైన వజ్రాలు ఉన్నాయని అఫిడవిట్ లో తెలిపారు. వ్యాపార విస్తరణ నిమిత్తం వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రామకృష్ణ కుటుంబం రూ.200.65 కోట్ల మేర రుణాలు తీసుకుంది. ఈయనపై హైదరాబాద్‌లో ఒక పాత వాహన ప్రమాదం కేసు మినహా ఎలాంటి ఇతర తీవ్రమైన నేరపూరిత కేసులు లేవు.
సొంత ఇల్లు లేని సానా సతీశ్
మరోవైపు పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన సానా సతీష్ అఫిడవిట్ లో ఊహించని ఆసక్తికర విశేషాలు వెల్లడయ్యాయి. సతీశ్ దంపతులకు రూ.27.80 కోట్ల మేర చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. గత నాలుగేళ్లలోనే వీరి వార్షిక ఆదాయం ఊహించని రేంజ్‌లో పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.6,170 గా ఉన్న సతీష్ బాబు వార్షిక ఆదాయం, 2024-25 నాటికి ఏకంగా రూ.2.16 కోట్లకు చేరడం విశేషం. దంపతులిద్దరి వద్ద కలిపి దాదాపు రూ.4.62 కోట్ల విలువైన 3,235 గ్రాముల (3 కేజీలకు పైగా) బంగారం ఉంది. వీరి వద్ద కియా ఈవీ 6, ఫార్చూనర్, మెర్సిడెజ్ బెంజ్, ఇన్నోవా హైక్రాస్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అయితే ఇన్ని కోట్ల చరాస్తులు, లగ్జరీ కార్లు, కిలోల కొద్దీ బంగారం ఉన్నప్పటికీ, ఈ దంపతులకు సొంత ఇల్లు లేదు అని అఫిడవిట్‌లో పేర్కొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
రెండు చోట్ల కేసులు
ఇక సీనియర్ నేత, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు, టీడీపీ ఐటీ వింగ్ బాధ్యుడు చింతకాయల విజయ్ ఆస్తుల వివరాలు చూస్తే ఆయన కుటుంబానికి రూ.38 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయి. ఇందులో రూ.31.58 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉండగా, రూ.7.06 కోట్ల విలువైన చరాస్తులు. మొత్తం రూ.16.91 కోట్ల అప్పులు ఉండగా, ఇందులో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. మొత్తం అప్పుల్లో సింహభాగం అంటే రూ.13.94 కోట్లు విజయ్ భార్య పేరిటే ఉండటం గమనార్హం. ఇక విజయ్ పై మంగళగిరి, నర్సీపట్నం పోలీసు స్టేషన్ లలో క్రిమినల్ కేసులు నమోదైనట్లు అఫిడవిట్ లో తెలిపారు. ప్రస్తుతం ఈ ముగ్గురు నేతలు దాఖలు చేసిన నామినేషన్లు సక్రమంగా ఉండటంతో పాటు పోటీలో వేరెవరూ లేకపోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కావడం లాంఛనంగా మారింది.
