చంద్రబాబు పార్టీలో ప్రకృతి.. సాగునీటి సమస్య తీర్చిన వరదలు
ఎన్ నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గత రెండు నెలల్లో దేశంలో 44.63 సెంటీమీటర్ల వర్షం కురవాల్సివుండగా, 39.55 సెం.మీ వర్షం మాత్రమే కురిసింది.
By: Tupaki Political Desk | 7 Aug 2026 4:21 PM ISTమానవ ప్రయత్నం ఎంత ఉన్నప్పటికీ... ప్రకృతి సహకరిస్తేనే ఏ పనైనా కొలిక్కి వస్తుంది. అది ప్రభుత్వమైనా, ప్రైవేటు వ్యక్తులైనా ప్రకృతి దయ లేనిదే ఆశించిన ఫలితం దక్కదంటారు. ఎండైనా, వానైనా, గాలైనా... ఈ సహజ పరిస్థితులు అనుకూలిస్తేనే అసలు సిసలు ఫలితం సాధ్యం. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతాయనే ఆందోళనతో ప్రభుత్వాలు ఉక్కిరిబిక్కిరి అవుతుండటం తెలిసిందే. ఈ తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో మాత్రం ప్రకృతి అసాధారణ రీతిలో సహకరిస్తుండటం విశేషంగా చెబుతున్నారు.
రాష్ట్రానికి నాల్గోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తరచుగా వర్షాభావ పరిస్థితులపై ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంటారు. ఆయన పాలనా కాలంలో సరిగా వర్షాలు కురవకపోతే ఆ నిందను ఆయనపై మోపేందుకు ఎప్పుడూ ఉత్సాహం చూపుతుంటారు. కానీ, ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందనే చెప్పాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏకంగా 50 శాతం మేర లోటు వర్షపాతం నమోదైనప్పటికీ, ప్రధాన ప్రాజెక్టులు మాత్రం జలకళను సంతరించుకోవడం రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
ఎన్ నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గత రెండు నెలల్లో దేశంలో 44.63 సెంటీమీటర్ల వర్షం కురవాల్సివుండగా, 39.55 సెం.మీ వర్షం మాత్రమే కురిసింది. ఇక ఏపీ విషయానికి వస్తే జూన్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 28.19 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు అవ్వాల్సివుంది. కానీ ఇప్పటివరకు కేవలం 14.27 సెం.మీ. వర్షమే కురిసింది. అంటే దాదాపు 49.4 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని 28 జిల్లాల్లో కరువు పరిస్థితులపై ఆందోళనలు నెలకొన్నాయి. అయితే అదృష్టవశాత్తూ ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో ప్రధాన నదులైన కృష్ణా, గోదావరికి భారీగా వరద వస్తోంది. దీంతో చాలావరకు సాగు, తాగునీటి సమస్య తీరినట్లైందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఒక విధంగా ఈ పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి బాగా కలిసివచ్చిందని చెబుతున్నారు. ప్రధానంగా కృష్ణా నదికి గత కొద్దిరోజులుగా వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయం క్రమంగా నిండుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 149 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇంకా 66 టీఎంసీలు నీరు చేరితే గరిష్ట సామర్థ్యాం సాధించినట్లు అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరద మరో మూడు నాలుగు రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తుండటంతో శ్రీశైలంతోపాటు రాయలసీమ ప్రాజెక్టులకు సాగు, తాగునీరు సమస్య లేనట్లే అంటున్నారు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానికి ఊపిరి పోసినట్లే అంటున్నారు.
ఎగువ నుంచి వరద రాని పక్షంలో ప్రాజెక్టులు డెడ్ స్టోరీజీకి చేరుకుని చాలా సమస్య ఎదుర్కొనే పరిస్థితి ఉండేదని అంటున్నారు. ఒకవిధంగా ఈ పరిస్థితి చంద్రబాబుకు కొత్త శక్తిని ఇచ్చినట్లే అంటున్నారు. గతంలో ఎప్పుడూ కూడా ప్రకృతి చంద్రబాబుకు ఈ విధంగా సహరించిన పరిస్థితి లేదని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు 1995లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2004 వరకు కొనసాగారు. అయితే ఎన్నడూ లేనట్లు 1998-2004 మధ్య రాష్ట్రం తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొందని గుర్తుచేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రాజెక్టుల కారణంగా రాష్ట్రంలో చాలా వరకు ఈ పరిస్థితులను అధిగమించడం కూడా కూటమి సర్కారుకు కలిసివచ్చిన అంశంగానే చెబుతున్నారు.
