దిగుమతి రాజకీయం.. జనసేన నయా ట్రెండ్!
రాజకీయాల్లో కుప్పిగెంతులు ఉంటాయి. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నాయకులు మారడం అత్యంత సహజం.
By: Tupaki Desk | 14 Oct 2026 6:48 PM ISTరాజకీయాల్లో కుప్పిగెంతులు ఉంటాయి. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నాయకులు మారడం అత్యంత సహజం. ముఖ్యంగా విపక్షంలో ఉన్న నేతలు అధికారంపై మోజుతో రూలింగ్ పార్టీల్లో చేరడం చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. కానీ, ఏపీలో ఈ తరహా రాజకీయాలకు భిన్నమైన విధంగా దిగుమతి రాజకీయం నడుస్తోందని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు తమకు అవసరమైన నాయకులను ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి దిగుమతి చేసుకోవడమే ఈ ట్రెండ్ అంటున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా తాజాగా జనసేన కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఉదంతాన్ని సూచిస్తున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరడంతో ఈ చర్చ మరింత ఎక్కువ అయింది. గత కొన్నిరోజులుగా రాధాకృష్ణ జనసేనలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆయన ప్రస్తుతం ఉన్న టీడీపీలో అసంతృప్తి లేదా అసౌకర్యం కారణంగా పార్టీ మారకపోవడమే ఇక్కడి విశేషంగా చెబుతున్నారు. రాజకీయ అవసరాల రీత్యా టీడీపీ నుంచి రాధాకృష్ణను జనసేనను దిగుమతి చేసుకుందని పొలిటికల్ ఎనలిస్టులు చమత్కరిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి కొనసాగుతున్న ఈ ట్రెండ్ ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
విజయవాడ మేయర్ పదవిని ఆశిస్తున్న జనసేన తమ పార్టీలో సమర్థుడైన నేత లేరన్న కారణంతో టీడీపీ నుంచి రాధాకృష్ణను తమ పార్టీలోకి తెచ్చుకుందని చెబుతున్నారు. దీనిద్వారా కూటమి పార్టీలు మూడు తమకు అవసరమైన చోట అవసరమైన అభ్యర్థుల కోసం అభ్యర్థులను బదిలీ చేసుకునే కొత్త సంస్కృతి తీసుకువచ్చాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సమయం లేకపోవడం వల్ల ఈ పద్ధతి అనుసరించారని భావించినప్పటికీ, అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత కూడా అదే విధానాన్ని అనుసరించడమే ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు. తమ పార్టీకి ఫలానా పదవి కావాలని కోరుకుంటున్న పార్టీల అగ్రనాయకత్వాలు ముందుగా ఆయా చోట్ల సమర్థులైన నాయకులు తయారు చేసుకోలేకపోవడాన్ని ఎత్తిచూపుతున్నారు.
ఇక టీడీపీ నుంచి జనసేనలో చేరడం ద్వారా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ దిగుమతి రాజకీయాలు 2.0కి తెరతీశారని వ్యాఖ్యానిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే విధంగా పలువురు నేతలు టీడీపీ నుంచి జనసేన, బీజేపీల్లోకి వెళ్లి ఎమ్మెల్యేలు అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రధానంగా పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ టీడీపీ నుంచి జనసేనలో చేరి ఎమ్మెల్యే సీట్లు పొందారని చెబుతున్నారు. ఇదే లిస్టులో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లినట్లుగా చూపుతున్నారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ద్వారా మొదలైన దిగుమతి రాజకీయాలు ఎందరికి పదవీ యోగం ప్రసాదిస్తుందో చూడాల్సివుందని అంటున్నారు.
