వైసీపీ డీఎస్సీ సౌండ్ కి చెక్ పెట్టేలా టీడీపీ
ఏపీలో అధికార కూటమి పాలన రెండేళ్లకు పైగా సాగుతూండడంతో విపక్ష వైసీపీ జోరు పెంచింది.
By: Satya P | 13 Aug 2026 9:19 AM ISTఏపీలో అధికార కూటమి పాలన రెండేళ్లకు పైగా సాగుతూండడంతో విపక్ష వైసీపీ జోరు పెంచింది. ఇపుడే గేర్ మార్చాలని నిర్ణయించుకుంది. దాంతో మెగా డీఎస్సీ అక్రమాలు అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తోంది. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలలో కూడా కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి ఇదే అంశం మీద ఎండగట్టాలని వైసీపీ డిసైడ్ అయింది. శాసనసభా పక్ష సమావేశంలో జగన్ ఇదే విషయం తమ పార్టీ ఎమ్మెల్సీలకు చెప్పారు. అసెంబ్లీకి వైసీపీ హాజరు కాకూడని నిర్ణయించిన నేపధ్యంలో కూటమి కూడా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసింది. వైసీపీని ధీటుగా ఎదుర్కోవడం ఎలా అన్న దాని మీదనే టీడీపీ కూటమి ఫుల్ ఫోకస్ పెట్టింది.
సడెన్ గా గ్రూప్ వన్ :
ఈ నేపథ్యంలో సడెన్ గా గ్రూప్ వన్ అస్త్రాన్ని కూటమి ప్రయోగించనుంది అని అంటున్నారు. వైసీపీ హయాంలో గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలో అయితే పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని కూడా ఆరోపణలను కూటమి నేతలు చేస్తున్నారు. గ్రూప్ వన్ పరీక్షల్లో జవాబు పత్రాల మూల్యంకనం అసలు జరగలేదని మంత్రులతో ఏర్పాటు చేసిన లంచ్ మీటింగులో చంద్రబాబు వ్యాఖ్యనించినట్లుగా తెలుస్తోంది.
అసలు తప్పు అక్కడే :
వైసీపీ నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలలో మూడు సార్లు అన్యాయంగా పేపర్ వాల్యుయేషన్ చేశారని ఆయన అన్నట్లుగా చెబుతున్నారు. సిట్ దీని మీద నివేదికను హైకోర్టుకు సమర్పించింది అని ఆయన చెప్పారు. ఇదే అంశం మీద మండలిలో వైసీపీని గట్టిగా నిలదీయాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు అని అంటున్నారు. అంతే కాదు సిట్ రిపోర్టుని కూడా మంత్రులు అంతా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని కూడా బాబు కోరారని అంటున్నారు. ఆయన అందుబాటులో ఉన్న మంత్రులతో ఏర్పాటు చేసిన లంచ్ మీటింగులో అసెంబ్లీలో పార్టీ వ్యూహం గురించి చర్చించినట్లుగా చెబుతున్నారు
సభా సమరమే :
దీంతో ఇక అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరిగినా శాసన మండలిలో ఈసారి భీకర సమరం జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వైసీపీ ఎటూ మెగా డీఎస్సీ అక్రమాలు అంటూ సభలో ప్రస్థావిస్తుంది. దానికి ధీటు అయిన జవాబు ఇస్తూనే వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్ వన్ సంగతేంటని టీడీపీ కూటమి మంత్రులు ప్రశ్నిస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తూంటే ఈసారి సమావేశాలు వాడిగా వేడిగా జరిగే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఎన్ని రోజులు అసెంబ్లీ జరుగుతుందో.
