సూపర్ సిక్స్ వర్సెస్ నవరత్నాలు!
ఈ నేపధ్యంలో టీడీపీ కూటమి కూడా సూపర్ సిక్స్ లో కొన్ని అయినా అమలు చేయాలని చూస్తోంది. కానీ నిధుల సమస్య అధికంగా ఉంది.
By: Tupaki Desk | 8 Jun 2025 11:00 PM ISTసూపర్ సిక్స్ అంటే ఎవరివో తెలుసు. అలాగే నవరత్నాల మీద పేటెంట్ ఎవరికి ఉందో కూడా ఆంధ్ర జనాలకు ఇంకా బాగా తెలుసు. 2019లో నవరత్నాలు ఒక మోత మోగించి వైసీపీకి 151 సీట్లతో అధికారం కట్టబెడితే 2024లో సూపర్ సిక్స్ హామీలు టీడీపీ కూటమికి 164 సీట్లతో 94 శాతం స్ట్రైక్ రేట్ తో అందలం అప్పగించాయి.
ఇక నవరత్నాలు తాము అధికారంలోకి వచ్చిన డే వన్ నుంచి అమలు చేసామని వైసీపీ నేతలు చెబుతూ సూపర్ సిక్స్ ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ఇటీవల వెన్నుపోటు దినం పేరుతో ఏడాదిలో హామీలు ఏవీ నెరవేర్చడం లేదని నిరసనలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు.
ఈ నేపధ్యంలో టీడీపీ కూటమి కూడా సూపర్ సిక్స్ లో కొన్ని అయినా అమలు చేయాలని చూస్తోంది. కానీ నిధుల సమస్య అధికంగా ఉంది. ఈ నేపధ్యంలో ఇచ్చిన హామీలే ఇపుడు శాపాలుగా మారుతున్నాయా అన్న చర్చ మొదలైంది.
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఇంకా ఏపీలో సూపర్ సిక్స్ హామీలు అయితే అమలు కాలేదు, ఏవో ఒకటి రెండు తప్ప అన్న అసంతృప్తి అయితే జనాలలో ఉంది. ముఖ్యమైనవి ఎక్కువ ఆశలు పెట్టుకున్న వర్గాలు ఆశించిన పధకాలు అయితే అమలు కాలేదు.
ఇక నిధులు లేవనో సాంకేతిక కారణాలనో ఏదో ఒకటి అన్నట్లుగా బాబు సర్కార్ కుంటి సాకులు చెబుతోంది కానీ ఈలోగా పుణ్యకాలం అలా గడచిపోతోంది అని అంటున్నారు. సూపర్ సిక్స్ హామీలు అంటే జనాలు 2024లో ముచ్చట పడ్డారు. దానికి కారణం జగన్ నవరత్నాలు కంటే ఎక్కువ నిధులు ఇస్తారని భావించబట్టే.
అయితే ఎంతో ఆశపడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే అధికారం అందుకున్న తరువాత హామీలను పక్కన పెట్టి మొండి చేయి చూపిస్తున్నారు అని జనాలు అంటున్నారు. ఇక చంద్రబాబు అధికారంలోకి వస్తే డెవలప్మెంట్ తో పాటు ఉద్యోగాలు వస్తాయని అంతా అనుకున్నారు కానీ ఈ ఏడాదిలో అలాంటి మెరుపులు ఏవీ లేవని అంటున్నారు.
మాట్లాడితే చాలు హైదరాబాద్ ని డెవలప్ చేశాను అదే విధంగా అమరావతిని డెవలప్ చేస్తాను సంపద సృష్టిస్తాను అని బాబు అన్నారు కానీ ఏడాదిలో అలాంటిది ఏదీ లేదని జనాలు పెదవి విరుస్తున్నారు. జగన్ నవరత్నాల పధకలే జనంలో నానుతున్నాయంటే సూపర్ సిక్స్ అమలు కాకపోవడమే అని అంటున్నారు.
జగన్ అయితే తన అయిదేళ్ళ పాలనలో బటన్ నొక్కి ఠంచనుగా నగదుని నేరుగా లబ్దిదారుల ఖాతాలో వేశారు అని అంటున్నారు. వైసీపీ 2019 ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పినట్లుగా దాదాపుగా 95 శాతం హామీలను జగన్ తన పాలనలో అమలు చేశారు అని అంటున్నారు.
ఇక జగన్ తన పరిపాలనలో రెండు లఖల 73 వేల కోట్ల రూపాయల నగదుని జనాల ఖాతాలలోకి నేరుగా పంపించారు అని గుర్తు చేసుకుంటున్నారు. మౌలిక సదుపాయాల గురించి కానీ అభివృద్ధి కానీ పెద్దగా ఆలోచించకుండా జగన్ లబ్దిదారులకే నగదు వేశారు. అలా రోడ్లు లేవు, పనిచేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు లేవు అని కూడా విమర్శలు ఉన్నాయి.
ఇలా అభివృధి అజెండా ఏమీ లేక జగన్ అభాసుపాలు అయ్యారు. అంతే కాదు తన సొంత పార్టీ కార్యకర్తలను అసలు పట్టించుకోలేదు. కేవలం బటన్ నొక్కుడుకే జగన్ పరిమితం కావడంతో అధినాయకత్వానికి క్యాడర్ కి అతి పెద్ద గ్యాప్ ఏర్పడింది. అది ఎంతవరకూ దారితీసింది అంటే రాయలసీమలో కూడా వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ కంచుకోట కడప జిల్లాలో అయితే పదికి ఏడు సీట్లు కూటమికి వచ్చాయి అంటే వైసీపీకి ఘోర పరాభవం అని చెప్పాల్సి ఉంది.
అయితే జగన్ ఓడి ఏడాది కాలం గడచిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన నేపధ్యంలో సూపర్ సిక్స్ ఎక్కడ అన్న ప్రశ్నలు వస్తున్నాయి. దాంతో జగన్ బటన్ నొక్కుడుకే జనాలు ఇపుడు ఓటు వేస్తున్నారు. ఆ విధంగా నవరత్నాలతో పోలుస్తూ అమలు చేయలేకపోతున్న సూపర్ సిక్స్ ని తలచుకుంటూ జనాలు జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు. అదే వైసీపీకి పెద్ద అడ్వాంటేజ్ గా మారబోతోంది అని అంటున్నారు.
కూటమి చెబుతున్న అభివృద్ధి మాటలు కానీ మరే విధమైన లెక్కలు కానీ జనాలకు ఇపుడు పట్టడం లేదు. తమ చేతిలో డబ్బులు లేవు, బ్యాంకులలో ఖాతాలు బావురుమంటున్నాయని అంటున్నారు. అదే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే తమ జేబులలో నగదు కనిపిస్తుందని చేతులు కూడా బాగా ఆడుతాయని సాధారణ జనం భావిస్తున్నారు.
ఇక జగన్ ఓడిన తరువాత పార్టీ క్యాడర్ గుర్తుకు వచ్చింది. దాంతో తాను మరోసారి అధికారంలోకి వస్తే తప్పకుండా కార్యకర్తలను గుర్తు పెట్టుకుంటాను మేలు చేస్తాను అని చెబుతున్నారు. జగన్ 2.0 అని కూడా ఊరిస్తున్నారు. దాంతో వైసీపీ క్యాడర్ కూడా పట్టుదల చూపిస్తోంది. వారిలో కూడా ఒక రకమైన కసి మొదలైంది అని అంటున్నారు.
దీంతో వైసీపీ క్యాడర్ చెక్కు చెదరడం లేదు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే చంద్రబాబు ఎన్ని మాటలు చెప్పినా అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్ట్ అని అభివృద్ధి అని ఎంత గట్టిగా సౌండ్ చేసినా వచ్చే ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది సూపర్ సిక్స్ హామీలు అని అంటున్నారు.
వాటిని కరెక్ట్ గా టీడీపీ కూటమి అమలు చేయాల్సిందే అంటున్నారు. ఏవో నిబంధనలు పెట్టి చాలా మందికి ఎగ్గొట్టి కొద్ది మందికి ఇచ్చి అంతా చేశమాని చెప్పినా సీన్ రివర్స్ అవుతుందని అంటున్నారు. అపుడు అది వైసీపీకి జగన్ కి భారీ పొలిటికల్ అడ్వాంటేజ్ గా మారుతుందని విశ్లేషణలు ఉన్నాయి.
ఈ రోజు రాజకీయం అంతా లబ్దిదారుల కేంద్రంగా మారుతోంది. నిజమే అభివృద్ధి కావాలి. ఉద్యోగాలు కూడా కావాలి. దాని కంటే ముందు సంక్షేమ పధకాలు ఉన్నాయి. వీటిని దాటుకుని వెళ్తేనే టీడీపీ కూటమికి 2029 లో కలసి వచ్చేది అని అంటున్నారు. ఏ మాత్రం తేడా కొట్టినా జగన్ కచ్చితంగా మరోసారి అధికారం ఎగరేసుకుని పోతారని అంటున్నారు. తాజా సర్వేలు చూసినా జనంలో పెరిగిన అసంతృప్తిని వెల్లడిస్తున్నాయని దాంతో తస్మాత్ కూటమి పెద్దలు అని అంతా హెచ్చరిస్తున్నారు.
