ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో జగన్ హాట్ లైన్ చర్చలు.. ఏపీసీసీ చీఫ్ షర్మిల ఎదురుదాడి
ఏపీలో విచిత్ర రాజకీయం నడుస్తోంది. ఎవరు ఎవరికి ప్రతిపక్షమో అర్థం కాని పరిస్థితి నెలకుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
By: Tupaki Desk | 15 Aug 2025 11:44 AM ISTఏపీలో విచిత్ర రాజకీయం నడుస్తోంది. ఎవరు ఎవరికి ప్రతిపక్షమో అర్థం కాని పరిస్థితి నెలకుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా అక్రమాలు జరిగాయని, గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ 12 శాతం ఓట్లు తేడా వచ్చిందని మాజీ సీఎం జగన్ రెండో రోజుల క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అక్రమాలు, అవినీతిపై కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడటం లేదని జగన్ నిష్టూరమాడారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాట్ లైన్ లో చర్చించుకుంటారని, అందుకే ఏపీ ప్రభుత్వ తప్పిదాలు కాంగ్రెస్ పార్టీకి కనిపించడం లేదని జగన్ విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడగా, జగన్ చెల్లెలు ఏపీసీసీ చీఫ్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీకి దత్తపుత్రుడిగా మారిన జగన్ నిత్యం ప్రధానితోపాటు హోంమంత్రి అమిత్ షాతో హాట్ లైనులో టచ్ లో ఉంటారని ఎదురుదాడి చేశారు.
విజయవాడలో నిర్వహించిన ఓటు చోర్ ర్యాలీలో మాట్లాడిన షర్మిల మాజీ సీఎం జగన్ విమర్శలపై తీవ్రస్థాయిలో స్పందించారు. కనీసం అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై మాట్లాడే ధైర్యం లేని జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. ‘‘పచ్చకామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. తెరవెనుక రాజకీయాలు, పొత్తులు పెట్టుకోవడం జగన్ కు అలవాటు కాబట్టే అందరూ అదేవిధంగా చేస్తారని అనుకుంటున్నారు’’ అంటూ షర్మిల మండిపడ్డారు. రాహుల్ గాంధీకి చంద్రబాబుతో ఎలాంటి హాట్ లైను లేదు. ఈ హామీ మేము ఇవ్వగలం, మరి మీకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో హాట్ లైన్ లేదని బైబిలుపై ప్రమాణం చేసి చెప్పగలరా? అంటూ షర్మిల ప్రశ్నించారు.
జగన్ తన ఐదేళ్ల పాలనలో పూర్తిగా బీజేపీకి దాసోహమయ్యారని షర్మిల ఆరోపించారు. ‘‘మోదీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని అధికారంలోకి వచ్చిన మీరు, ఆ తర్వాత అదే మోదీకి ఎన్నోసార్లు సాగిలాపడ్డారని విమర్శించారు. బీజేపీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు బేషరతుగా మద్దతిచ్చారు అని గుర్తు చేశారు. గంగవరం పోర్టు వంటి ఎన్నో విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ మనుషులకు కట్టబెట్టారని ఆరోపించారు. చివరికి బీజేపీ నేతలకు ఎంపీ పదవులు కూడా ఇచ్చారు. దీన్ని అక్రమ పొత్తు అనాలా? లేక రాజకీయ వ్యభిచారం అనాలా? అని షర్మిల ప్రశ్నించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బీజేపీని ఒక మతతత్వ పార్టీగా అభివర్ణిస్తూ అన్ని వేదికలపైనా తీవ్రంగా వ్యతిరేకించారని షర్మిల గుర్తు చేశారు. కానీ, ఆయన కుమారుడిని అని చెప్పుకునే జగన్ అదే బీజేపీకి దత్తపుత్రుడిగా మారడం సిగ్గుచేటుగా షర్మిల వ్యాఖ్యానించారు.
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాకూర్ ను ‘ఎవడు వాడు’ అన్నట్లుగా జగన్ మాట్లాడటం ఆయన సంస్కార హీనతకు నిదర్శనమని షర్మిల మండిపడ్డారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోరాడే దమ్ముందా? అని మాణిక్కం ఠాకూర్ విసిరిన సవాలుకు సిద్ధమా? అంటూ చాలెంజ్ చేశారు. మీకు దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి లిక్కర్ స్కాంపై సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాసిరకం బ్రాండ్లకు ఎందుకు అనుమతి ఇచ్చారో, నగదు రూపంలో ఎందుకు అమ్మకాలు జరిపారో వివరించండి అంటూ సవాల్ విసిరారు షర్మిల.
అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేదని, పార్లమెంటుకు వెళ్లి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు ఎత్తు గురించి అడిగే ధైర్యం లేదని ఎద్దేవా చేవారు. ప్రజల కోసం అసెంబ్లీలో దేశం కోసం పార్లమెంటులో పోరాడలేరు కానీ మీదొక పార్టీ, మీరొక నాయకుడు అంటూ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కి సభ్యత సంస్కారం లేవని నిన్నటి వ్యాఖ్యలతో అర్ధమైపోయిందన్నారు. అటు ప్రధాని మోదీ, ఎన్నికల కమిషన్ పై విరుచుకుపడ్డారు షర్మిల. దేశ ప్రజలు స్వచ్చందంగా ఓటు వేసే హక్కును ఈసీ, బీజేపీ కలిసి హరించాయని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ దేశ ప్రజల ఓట్లను దొంగిలించారని ఆమె ఆరోపించారు. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ బయటపెట్టిన ఆధారాలపై బీజేపీ నోరు విప్పాలన్నారు. రాహుల్ గాంధీ దేశ పౌరుల హక్కుల కోసం కొట్లాడుతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటం కోసం పోరాటం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
