Begin typing your search above and press return to search.

జగన్, అవినాశ్ పై షర్మిల సెటైర్లు... అస్సలు తగ్గని ఏపీసీసీ చీఫ్!

అధికారంలో ఉన్న ఐదేళ్లు గాడిదలు కాశారా? గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? లేక నిద్రపోయారా? అంటూ ఎద్దేవా చేశారు షర్మిల.

By:  Tupaki Political Desk   |   11 April 2026 12:40 PM IST
జగన్, అవినాశ్ పై షర్మిల సెటైర్లు... అస్సలు తగ్గని ఏపీసీసీ చీఫ్!
X

తన సోదరులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ షర్మిల మాటల దాడి ముమ్మురం చేశారు. రెండు రోజుల క్రితం ‘మావిగన్ జోకర్’ అంటూ విరుచుకుపడిన షర్మిల తాజాగా జగన్, అవినాశ్ రెడ్డి పేర్లను ప్రస్తావిస్తూ ఎంత సేపూ నాశనం చేయడమేనా? నిర్మించాలనే ఆలోచన అస్సలు లేదా? అంటూ విరుకుపడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ నిర్వహిస్తున్న పాదయాత్రలో పాల్గొనేందుకు అనంతపురం వెళ్లిన షర్మిల మీడియాతో మాట్లాడుతూ తన సోదరులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

‘ఎంత సేపు నరకాలి, చంపాలి, నాశనం చేయాలి’ అని ఆలోచనలేనా అంటూ షర్మిల ప్రశ్నించారు. అమరావతి బదులుగా మావిగన్ అంటున్నారు. ఇక పులివెందుల బదులుగా అవిగొడ్డలి అని పేరు పెట్టండి అంటూ షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పేరులోనే గన్ ఉంది. అవినాశ్ లో నాశనం ఉందంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. మావిగన్ అద్భుతమైన ఐడియా అయితే అధికారంలో ఉన్న ఐదేళ్లు ఎందుకు అమలు పరచలేదు? మూడు రాజధానులు అని ఎందుకు అన్నారు అంటూ ప్రశ్నలు సంధించారు.

ఐదేళ్లు ఏం చేశారు?

అధికారంలో ఉన్న ఐదేళ్లు గాడిదలు కాశారా? గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? లేక నిద్రపోయారా? అంటూ ఎద్దేవా చేశారు షర్మిల. మావిగన్ పై కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలని ప్రశ్నించారని, ఎవరైనా ఈ జోక్ వింటే నవ్వుతారన్నారు. అమరావతిపై కాంగ్రెస్ వైఖరి ఇప్పటికే స్పష్టం చేశామని తెలిపారు. పార్లమెంటులో రాజధాని బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. అమరావతికి అప్పులివ్వొద్దని, రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యతని తమ పార్టీ డిమాండ్ చేస్తోందని షర్మిల అన్నారు.

షర్మిల మాట్లాడలేదే అనుకున్నాం.. సజ్జల

ఇక పీసీసీ చీఫ్ షర్మిల విమర్శలపై వైసీపీ కూడా ఘాటుగా స్పందించింది. రెండు రోజులుగా షర్మిల మాటల దాడి చేస్తుండటంతో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎదురుదాడి చేశారు. షర్మిల ఇంకా మాట్లాడలేదేంటి? అనుకుంటుండగా, ఆమె మీడియా ముందుకు వచ్చారని సజ్జల దెప్పిపొడిచారు. చంద్రబాబు రాజకీయంగా షర్మిలను వాడుకుంటున్నారని, ముఖ్యమంత్రికి అవసరమైనప్పుడు షర్మిల సిద్ధంగా ఉంటారని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు చెప్పగానే షర్మిల వచ్చి జగన్ ను తిట్టేసి పోతుంటారని ధ్వజమెత్తారు.