నేతలు సరే.. ఇప్పుడు ప్రతి కార్యకర్తా బుక్ ఓపెన్ చేయాలట
దీనికి కొనసాగింపుగా తాజాగా రవీంద్రనాథ్ రెడ్డి మరింత వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కడప అసెంబ్లీ నియోజకవర్గ విస్త్రత స్థాయి సమావేశం వేదికైంది.
By: Tupaki Desk | 7 July 2025 11:45 AM ISTఆంధ్రప్రదేశ్ ఎటు వెళుతోంది. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడేందుకు నేతలు చేస్తున్న ప్రకటనలు శ్రుతిమించుతున్నాయి. తాజాగా.. వైసీపీ సీనియర్ నేత.. కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ 2.0లో ఏం చేయాలో కార్యకర్తలకు ఉద్బోదించిన ఆయన.. అక్కడితో ఆగకుండా.. కార్యకర్తల చేత నినాదాలు చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
పుష్ప సినిమాలో మాదిరి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తమ రాజకీయ ప్రత్యర్థులను రప్పా రప్పా సినిమా చూపిస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనానికి తెర తీశాయో తెలిసిందే. దీనికి కొనసాగింపుగా తాజాగా రవీంద్రనాథ్ రెడ్డి మరింత వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కడప అసెంబ్లీ నియోజకవర్గ విస్త్రత స్థాయి సమావేశం వేదికైంది.
సమావేశంలో పాల్గొన్న ఆయన.. ప్రతి వైసీపీ కార్యకర్త ఒక బుక్ తెరవాలన్న ఆయన.. ‘అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బుక్ లో పేర్లు ఉన్న వారిపై రప్పా రప్పా అంటూ కార్యక్తలతో నినాదాలు చేయించారు. కార్యకర్తలు కేసులకు భయపడకూడదని.. ఎవరిపై ఎక్కువ కేసులు ఉంటే.. తాము అధికారంలకి వచ్చిన తర్వాత వారికే అంత ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఎన్నికల వేళలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీల అముపై టీడీపీ నేతల్ని అన్ని స్థాయిల్లో చొక్కా పట్టుకొని నిలదీయాలన్న ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇదంతా చూస్తే.. ఆంధ్రప్రదేశ్ ఎటువైపు వెళుతోంది? ఒకప్పుడు తాము అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేస్తామన్న విషయాన్ని అదే పనిగా మాట్లాడేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా అధికారంలోకి వస్తే రాజకీయ ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుంటామన్న అంశాన్నే హైలెట్ చేస్తున్న వైనానికి కట్టడి వేయకుంటే.. ఈ విష సంస్క్రతి ఏపీ బాధిత రాష్ట్రంగా మారుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
