Begin typing your search above and press return to search.

ఆంక్ష‌లు - ఆధిప‌త్యాలు - రాజ‌కీయాలు ..!

రాష్ట్రంలో పోలీసుల ఆంక్షలు ప్రజాస్వామ్య ఆకాంక్షలు అనేవి గడిచిన 10 సంవత్సరాలుగా కనిపించడం లేదు.

By:  Tupaki Desk   |   20 Jun 2025 7:00 AM IST
ఆంక్ష‌లు - ఆధిప‌త్యాలు - రాజ‌కీయాలు ..!
X

రాష్ట్రంలో పోలీసుల ఆంక్షలు ప్రజాస్వామ్య ఆకాంక్షలు అనేవి గడిచిన 10 సంవత్సరాలుగా కనిపించడం లేదు. పోలీసులు ఆంక్ష‌లు విధించడం ప్రత్యర్ధులు వాటిని పట్టించుకోకపోవడం కామన్ గా మారిపోయింది. ఈరోజు జగన్ విషయంలో జరిగిందంటున్న నాయకులు గతంలో ఏం జరిగిందనేది కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలకు నాయకులకు అతీతంగా ఆంక్షలును అమలు చేయడంలో ఇటు పోలీసులు అటు ప్రజాస్వామ్య వ్యవస్థలు కూడా విఫలమయ్యాయి. ఇప్పుడే కాదు గతంలోనూ అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు పెట్టిన ఆంక్షలు నాయకులు పట్టించుకోని పరిస్థితిని మనం గమనించాం.

వైసిపి అధినేత జగన్ రెంటపాళ్ల గ్రామంలో పర్యటించి పోలీసులు పెట్టిన ఆంక్షలు విస్మరించారని పతాక స్థాయి చర్చ నేపథ్యంలో రాష్ట్రంలో ఏం జరుగుతోంది అనేది జాతీయ స్థాయిలో ఇప్పుడు చర్చకు వచ్చింది. వాస్తవానికి 2014 -19 మధ్య కూడా జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఎంత మంది పాల్గొనాలనే చ‌ర్చ వ‌చ్చింది. 1000 మందికి మించి ఉండడానికి వెల్లేదని అప్పటి డిజిపి రాముడు ఆంక్షలు విధించారు. దీనిపై అప్పట్లో కోర్టును ఆశ్రయించిన వైసిపి ఆంక్షలు లేనివిధంగా పాదయాత్రను నిర్వహించేలాగా తీర్పును తెచ్చుకుంది.

ఆ తర్వాత జగన్ హయాంలో చంద్రబాబు చేపట్టిన యాత్రలు కూడా ఇలానే సాగాయి. వారు కూడా కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలోని అంగళ్ళలో జరిగిన రాళ్లదాడి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం లో జరిగిన రాళ్లదాడి ప్రబల నిదర్శనం. అప్పట్లో పోలీసులు కూడా చంద్రబాబు సహా ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ యాత్రలకు ఆంక్షలు విధించారు. నాడు వాటిని తప్పు పట్టిన టిడిపి నేతలు కోర్టులను ఆశ్రయించి రాజకీయంగా యుద్ధం చేసి తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇప్పుడు వైసీపీ చేస్తున్నది కూడా అదే.

ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల దైనందన జీవితాలకు భంగం కలగకుండా ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇబ్బంది లేదు. కానీ వీటిని విస్మరించి నాడు టిడిపి చేసినా నేడు వైసిపి చేసినా తప్పుపట్టాల్సిందే. ఈ విషయంలో పోలీసులు కూడా సరైన పంథాను అనుసరించకుండా ఎవరు అధికారంలో ఉంటే వారి మాట వినడం రూల్స్ అనేవి పట్టించుకోకుండా నాయకులు చెప్పినవే రూల్స్ అన్నట్టుగా వ్యవహరించడం పోలీసు వ్యవస్థను కూడా విమ‌ర్శ‌ల‌కు గురిచేసింది.

ఈ పరిస్థితి నుంచి రాష్ట్రం బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భవిష్యత్తులో అటు పోలీసులు ఇటు ప్రభుత్వాలు కూడా జవాబు దారిగా మారాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రతిపక్ష నాయకుడు అంటే మాజీ సీఎం కావచ్చు లేదా ఒక పార్టీకి సంబంధించిన అధినేత కావచ్చు వారి ప్రోటోకాల్ ప్రకారం వారికి సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అది ఇప్పుడున్న కూట‌మి ప్రభుత్వమే అయినా.. గతంలో ఉన్న వైసిపి ప్రభుత్వం అయినా రెండిటికీ వర్తిస్తుంది.

ఇందులో ఎవరు ఎక్కువ కాదు.. ఎవరూ తక్కువ కాదు.. ప్రతిపక్ష నాయకుడు వస్తున్నాడు అంటే వంద మందితో మాత్రమే రావాలని ఆంక్షలు విధించటం ఎంత పొరపాటో లక్షలాదిమందిగా తరలిరావాలని పిలుపునివ్వడం కూడా ప్రతిపక్షాలకు సరికాదు. ఎవరైనా కార్యక్రమాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలను సమీకరించాలి. కానీ రాష్ట్రంలో నువ్వంటే నువ్వు.. ఢీ అంటే ఢీ అన్న తరహాలో రాజకీయాలు సాగుతుండటం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా మారే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు ప‌రిశీలకులు.