కమలం దిశగా.. కీలక నేతలు.. నిజమెంత.. ?
ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని కీలక నాయకులు కొందరు బీజేపీ వైపు చూస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. వీరిలో అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా , ఎంపీలుగా ఉన్న ఒకరిద్దరు నాయకుల పేర్లు కూడా తరచుగా వినిపిస్తున్నాయి.
By: Garuda Media | 1 July 2026 6:00 PM ISTఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని కీలక నాయకులు కొందరు బీజేపీ వైపు చూస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. వీరిలో అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా , ఎంపీలుగా ఉన్న ఒకరిద్దరు నాయకుల పేర్లు కూడా తరచుగా వినిపిస్తున్నాయి. 'ఏమో.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో.. తప్పేముంది. ఈ పార్టీ కాకపోతే.. మరొకటి. నాకు సత్తా ఉంది. ఆ పార్టీకి చేర్చుకునేందుకు అవకాశం ఉంది.' అని క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఓ కీలక నాయకుడు ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానించారు.
సదరు నేత గురించి తరచుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఇక, ఎంపీల విషయంలోనూ ఇదే తరహా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి కోస్తా జిల్లాల్లోని ఓ ఎంపీ గత ఎన్నికలకు ముందు చివరి నిమిషంలో టీడీపీ బీ ఫాం దక్కించుకున్నారు. కానీ, ఆయన పార్టీపరంగా కంటే.. జాతీయస్థాయి నేతలతోనే ఎక్కువగా టచ్‌లో ఉంటున్నారు. దీనికి కారణం.. అవసరమైతే.. వచ్చే ఎన్నికల్లో మార్పు కోసమేనని ఆయన చెబుతున్నారు. ఇది వినేందుకు చిత్రంగా ఉన్నా.. ఎవరికి వారు అప్పుడే కర్చీఫ్‌లు రెడీ చేసుకుంటున్నారు.
ఇక, వైసీపీలోనూ కొందరు ఎమ్మెల్యేలు ఇదే బాటలో ఉన్నారన్న చర్చ కూడా ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడు బీజేపీతో టచ్‌లోకి వెళ్లారు. అయితే.. ఆయన కీలక పదవిని ఆశించారని.. ఆ పదవి ఇచ్చే విషయంలో బీజేపీ వెనక్కి తగ్గడంతో ఆయన మౌనంగా ఉన్నారని వైసీపీలోనే చర్చ సాగుతోంది. ఇక, ఓ ఎంపీ అయితే.. నేరుగా బీజేపీ నేతలతోనే కలివిడిగా ఉంటున్నారు. ఢిల్లీలోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. బీజేపీ మంత్రుల కార్యాలయాల్లోనూ ఆయన కనిపిస్తున్నారు.
అదేమంటే.. ఎంపీగా పనులు చేయించుకునేందుకు వచ్చానని సదరు పార్లమెంటు సభ్యుడు సెలవిస్తున్నారు. అయితే.. ఇదంతా ఎందుకంటే.. అధికార పార్టీకి చెందిన నాయకుల్లో టికెట్ల బెంగ కనిపిస్తోంది. వారిపై చేయిస్తున్న సర్వేల్లో మార్కులు తగ్గడం... వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కుతాయోలేదో నన్న బెంగ వెంటాడుతుండడంతో సదరు నేతలు ముందుగానే వచ్చే ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నారు. ఇక, వైసీపీ నాయకుల్లో వచ్చే ఎన్నికలపై పెద్దగా ఆశలు లేకుండా పోతున్నాయన్న వాదన ఉంది. ఏమో మళ్లీ విపక్షంలో కూర్చునే పరిస్థితి వస్తుందేమోనని వారు బెంగ పెట్టుకున్నారని అంటున్నారు. అందుకే కేసుల బెడద నుంచి తప్పించుకునేందుకు బీజేపీతో ముందుగానే టచ్‌లోకి వెళ్లిపోయారట.
