Begin typing your search above and press return to search.

కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ కాల్

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పక్కా కాంగ్రెస్ వాది. ఆయన తండ్రి కాలం నుంచి కాంగ్రెస్ లోనే ఉంటూ వచ్చారు.

By:  Tupaki Desk   |   1 July 2025 5:13 PM IST
కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ కాల్
X

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పక్కా కాంగ్రెస్ వాది. ఆయన తండ్రి కాలం నుంచి కాంగ్రెస్ లోనే ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలోనే పెరుగుతూ వచ్చారు. ఆయన అందుకున్న పదవులు అన్నీ కాంగ్రెస్ నుంచి దక్కినవే. ఇక ఆయన ఉమ్మడి ఏపీకి ఏకంగా మూడేళ్ళకు పైగా సీఎం గా చేశారు అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే అన్నది అందరికీ తెలిసిందే.

ఇక ఆ పార్టీని వీడిన తరువాత ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మళ్ళీ తగిన విధంగా ముందుకు రాలేకపోయారు అన్నది అనుచరుల అభిమానుల ఆవేదనగా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో ఉన్నారు అంటే ఉన్నారు. అయితే అక్కడ ఆయనకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.

ఉమ్మడి ఏపీలో ఏకంగా 23 ఉమ్మడి జిల్లాలకు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతే కాదు దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రాన్ని అత్యంత క్లిష్ట పరిస్థితులల్లో ఆయన పాలించారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం వేళ ఆయన సీఎం గా ఉన్నారు. అయినా పాలన ఎక్కడా దెబ్బ తినకుండా సమర్ధంగా వ్యవహరించారు.

అటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇక చూస్తే బీజేపీ హైకమాండ్ ఆయనకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వడం లేదు అని అంటున్నారు. ఇక చూస్తే ఏపీ కాంగ్రెస్ తో పాటు దేశంలోని సీనియర్ కాంగ్రెస్ నేతలతో కిరణ్ కుమార్ రెడ్డికి ఈ రోజుకీ మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతారు.

ఏపీలో చూస్తే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ గా ఉన్నా కూడా ఆ పార్టీ ఏ మాత్రం ఎత్తిగిల్లడం లేదు అని గుర్తు చేస్తున్నారు. అలాగని ఇప్పటికిప్పుడు ఆమెను మార్చే ఆలోచన అయితే హైకమాండ్ కి లేదు అని అంటున్నారు.

అయితే ఏపీలో టీడీపీ కూటమి ఫెయిల్ అయింది అని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు. మరి ఆ చాన్స్ ని ఏపీలో కాంగ్రెస్ తీసుకుని పుంజుకోవడం లేదు అన్న చర్చ అయితే ఉంది. ఇక చూస్తే కనుక షర్మిల వెంట సీనియర్లు ఎవరూ నడవడం లేదు అన్నది కూడా పార్టీ పెద్దలు గుర్తించారు అని అంటున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీలో చూస్తే ఎంతో మంది నాయకులు ఉన్నారు. మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలతో షర్మిలకు అయితే పెద్దగా మంచి పరిచయాలు కానీ సంబంధాలు కానీ లేవని అంటున్నారు. ఇక కాంగ్రెస్ లో సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావుకు అందరితో మంచి సంబంధాలు ఉన్నా ఆయన షర్మిలకు మాత్రం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం లేదు అని అంటున్నారు.

ఈ రోజున ఏపీలో చూస్తే రాజకీయంగా ఒక రకమైన శూన్యత ఉందని అంటున్నారు. మూడు పార్టీలూ కూటమిలో ఉన్నాయి. ఇక అక్కడ అంతా కిక్కిరిసిపోయి ఉంది. విపక్షంలో చూస్తే వైసీపీ ఉంది. ఈ రెండు వేదికలు తప్పించి మరోటి లేక చాలా మంది నాయకులు రాజకీయంగా ముందుకు రావాలని చూస్తున్నా సరైన రాజకీయ ఫ్లాట్ ఫారం లేదని అంటున్నారు.

అంటే అటు కూటమి నచ్చక ఇటు వైసీపీలో చేరడం ఇష్టం లేని వారికి కాంగ్రెస్ పార్టీ కనుక గట్టిగా పుంజుకుంటే అందులోకి రావాలని ఉందని చెబుతున్నారు. సమర్ధులైన నాయకులు కాంగ్రెస్ కి నాయకత్వం వహించి జనంలోకి పార్టీని తీసుకుని వెళ్తే కనుక కచ్చితంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది అని అంటున్నారు.

ఇక జగన్ మాజీ సీఎం గా ఉన్నారు. ఆయన పార్టీగా వైసీపీ ఉంది. మరి ఆయన సోదరిగా ఉన్న షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు ఇస్తే అదే కుటుంబంలోని వైఎస్సార్ అభిమానులు ఎలా వెళ్తారు అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక ఏపీ రాజకీయాల్లో రెడ్డీస్ ఫ్యాక్టర్ చాలానే ఉంది అని అంటున్నారు. రాజకీయంగా ఆ సామాజిక వర్గం ఎపుడూ ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటోంది. అలాంటి రెడ్డీస్ ని కాంగ్రెస్ వైపు తిప్పే సత్తా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలోనే ఉందని చాలా మంది సీనియర్లు నమ్ముతున్నారు.

ఈ నేపధ్యంలో బీజేపీలో పెద్దగా ప్రాధాన్యత లేకుండా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ కాల్ చేసి సొంత పార్టీలోకి తీసుకుని రావచ్చు అని అంటున్నారు. అయితే ఈసరికే ఆయనకు కాల్ చేశారా అన్న చర్చ కూడా ఉంది. దీంతో కాంగ్రెస్ లో ఇపుడు నల్లారి వారి పునరాగమనం మీదనే హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. నిజంగా కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకుంటే మాత్రం హస్తం పార్టీ రాజకీయ జాతకం మొత్తానికి మొత్తం మారుతుందని అంటున్నారు. ఏపీలో ఇపుడున్న రాజకీయ పరిస్థితుల్లో థర్డ్ ఫోర్స్ గా కాంగ్రెస్ కి ఎదిగే చాన్స్ తప్పకుండా ఉందని అంటున్నారు.