Begin typing your search above and press return to search.

జూన్ 4న రాజకీయ రచ్చేనా ?

దానికి కారణం 2024 జూన్ 4న ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   3 Jun 2025 8:30 AM IST
జూన్ 4న రాజకీయ రచ్చేనా ?
X

ఏపీలో రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయి. దానికి జూన్ 4 వేదిక కానుంది. జూన్ 4 అంటే మామూలుగా వచ్చే ఒక రోజే. క్యాలెండర్ లో డేట్ మారుతుంది. కానీ దానికి ఒక విశిష్టమైన రాజకీయ ప్రాముఖ్యతను ఏపీలోని రాజకీయ పార్టీలు కట్టబెడుతున్నారు.

దానికి కారణం 2024 జూన్ 4న ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దాంతో ఆ రోజున వైసీపీకి ఘోర ఓటమి ప్రాప్తించింది. టీడీపీ నాయకత్వంలోని కూటమికి ఎన్నడూ కనీ వినీ ఎరగని విధంగా అద్భుతమైన విజయం దక్కింది.

దాంతో ప్రజల తీర్పు వెలువడిన రోజు అది. ఒక విధంగా ఏపీ రాజకీయాన్ని మార్చిన రోజు అది. అయితే ఆ రోజుని వెన్నుపోటు దినంగా వైసీపీ పేర్కొంటొంది. ఆ రోజున టీడీపీ కూటమి గెలిచింది కానీ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున ఆందోళలనకు వైసీపీ పిలుపు ఇచ్చింది.

ఏడాది పాలన పూర్తి అయినా ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని అందువల్ల అది ప్రజలకు వెన్నుపోటు పొడడడమే అని వైసీపీ అంటోంది. ఒక విధంగా టీడీపీ కూటమి ఏడాది పాలన మీద వైసీపీ భారీగా చేసిన ఆరోపణగా దీనిని చూస్తున్నారు. ఏడాది పాటు పాలనలో ఏమీ జరగలేదని అప్పులు తప్ప ఏమీ సాధించలేదని వైసీపీ అంటోంది.

పైగా సంక్షేమ పధకాలను అటకెక్కించారని దాని వల్ల ఏపీ ప్రజలు అంతా ఇబ్బందులు పడుతున్నారని కూడా చెబుతోంది. దాంతో వైసీపీ ప్రతిష్టాత్మకంగా వెన్ను పోటు దినాన్ని ఏపీ వ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఒక విధంగా విపక్షంలోకి వచ్చాక వైసీపీ తొలిసారి ఇంత పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమంగా ఇది ఉంది.

దాంతో దీనికి విరుగుడుగా టీడీపీ కూటమి కూడా రెడీ అవుతోంది. ఏపీలో ప్రజలు 2024 జూన్ 4న స్వేచ్చా వాయువులు పీల్చుకున్నారని అంటోంది. అంతే కాదు అరాచక అసమర్ధ పాలనను జనాలు తొలగించుకున్నారని చెబుతోంది. జగన్ ఏలుబడిలో అభివృద్ధి శూన్యమంగా ఉందని ఇపుడు పాలన గాడిన పడిందని అందువల్ల ప్రజలంతా ఆనందంగా పండుగలా ఆ రోజు చేసుకోవాలని అంటోంది.

ఇక జనసేన అయితే సంక్రాంతి దీపావళి కలిపి ఒకే రోజు చేసుకోవాలని పిలుపు ఇస్తే టీడీపీ ఒక పీడన నుంచి ఒక అరాచకం నుంచి స్వేచ్ఛా వాయువులు అందుకున్న ఆంధ్రులంతా ఆ రోజును ప్రత్యేకంగా చేసుకోవాలని కోరుతోంది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అయితే జగన్ పాలనలో అంతా దారుణంగానే సాగిందని అన్నారు. ప్రజలంతా ఆ బాధలు అన్నీ చూసి కోరి మరీ కూటమిని అధికారంలోకి తీసుకుని వచ్చారని అన్నారు.

ఇక ఇంత జరిగినా 11 సీట్లకే ప్రజలు పరిమితం చేసినా జగన్ సహా వైసీపీ నేతలు అంతా ఇంకా అదే తీరులో ఉన్నారని విమర్శించారు. వెన్నుపోటు దినం అని వైసీపీ పిలుపు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఆనందించే రోజు జూన్ 4 అని కొత్త అర్ధం చెప్పారు. మొత్తం మీద జూన్ 4న వెన్ను పోటు అని వైసీపీ అంటోంది. కాదు కొత్త స్వేచ్ఛా వాయువులు అందుకున్న రోజు అని టీడీపీ కూటమి అంటోంది. మరి జూన్ 4 న నిజంగా రాజకీయ రచ్చ ఏ విధంగా సాగుతుందో ఆ రోజు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.