ప్రజాస్వామ్యానికి గొడ్డలి పార్టీ పనికిరాదు: చంద్రబాబు
ప్రజాస్వామ్య దేశంలో గొడ్డలి పార్టీలకు చోటు లేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గొడ్డలి పార్టీ అంటే.. కొందరికి ఫ్రెస్ట్రేషన్ పెరిగిపోతోందని.. కానీ... ప్రజలే ఎక్కువగా ఆ పార్టీని గొడ్డలి పార్టీ అని వ్యాఖ్యానిస్తున్నారని పేర్కొన్నారు.
By: Garuda Media | 31 May 2026 11:47 AM ISTప్రజాస్వామ్య దేశంలో గొడ్డలి పార్టీలకు చోటు లేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గొడ్డలి పార్టీ అంటే.. కొందరికి ఫ్రెస్ట్రేషన్ పెరిగిపోతోందని.. కానీ... ప్రజలే ఎక్కువగా ఆ పార్టీని గొడ్డలి పార్టీ అని వ్యాఖ్యానిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాదు.. గతంలో కొందరు సైకో అన్నారని.. కానీ, దీనికంటే కూడా గొడ్డలి పార్టీని ప్రజలు ఎక్కువగా రిసీవ్ చేసుకున్నారని తెలిపారు. అందుకే గొడ్డలి పార్టీ అంటున్నామన్నారు. నిజానికి ఈ తరానికి వైఎస్ కుటుంబ అరాచకాలు తెలియని.. ఇప్పుడిప్పుడే తెలుస్తున్నా యని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పార్టీలకు చోటు ఉండదని చెప్పారు.
తుపాకీ సహా ఆయుధాలు చేపట్టిన మావోయిస్టులు.. రాజ్యాధికారాన్ని చేపట్టలేక పోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కానీ.. గొడ్డలి పార్టీ నాయకులు రాజ్యాధికారం కోసం తపిస్తున్నారని అన్నారు. అయితే.. ప్రజాస్వామ్య దేశంలో ఇది సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం ప్రజలు అన్నీ తెలుసుకుంటున్నారని, స్వేచ్ఛ కోరుకుంటున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వల్లే ఇది సాకారం అవుతుందని అన్నారు. రప్పా.. రప్పా.. నరుకుతాం! అంటే ఎవరు మాత్రం సహిస్తారని ప్రశ్నించారు. ప్రజలకు కావాల్సింది నరుకుడు కాదని.. పట్టెడన్నం పెట్టి, ఉపాధి మార్గాలు చూపించి సంపద సృష్టించే ప్రభుత్వమని తెలిపారు.
కూటమి ప్రభుత్వంలోనే ఇవి సాకారం అవుతాయన్న ఆకాంక్షలు ప్రజల్లో బల పడ్డాయని తెలిపారు. ఈ సందర్భంగా వివేకానంద రెడ్డి దారుణ హత్యకు సంబంధించిన విషయాలపైనా చంద్రబాబు స్పందించారు. ఆయన ఎలా మరణించారన్న విషయం అందరి కీ తెలిసిందేనని, అయితే.. ఎవరు దగ్గరుండి మరీ హత్య చేయించారన్నదే ఇప్పుడు తేలాల్సి ఉందని అన్నారు. ముఖ్యంగా తన తండ్రిని హతమార్చిన నిందితులు ఎవరు అనే విషయం తెలుసుకునే హక్కు వివేకా కుమార్తెగా సునీతకు ఉంటుందన్నారు. ఆమె చేస్తున్న న్యాయపోరాటం వల్లే.. గొడ్డలి పార్టీ ఎంత అరాచక శక్తో తెలుస్తోందన్నారు.
వాస్తవానికి పులివెందుల, కడప ఫ్యాక్షన్ హత్యలపై తనకు కూడా పెద్దగా అవగాహన లేదన్న సీఎం చంద్రబాబు.. ఇప్పుడు తెలుసుకుంటున్నట్టు పేర్కొన్నారు. సునీత చేస్తున్న న్యాయపోరాటానికి అన్ని వర్గాల మద్దతు కూడా లబిస్తోందన్నారు. అయితే.. తాము గొడ్డలి పార్టీ అన్నప్పుడల్లా.. కొందరిలో ఫ్రెస్ట్రేషన్ పెరిగిపోతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కానీ, తాము ప్రజలు చెబుతున్న విషయాలనే వెల్లడిస్తున్నామన్నారు. ఐదేళ్లలో ప్రజలను అన్ని విధాలా అభివృద్ధికి దూరం చేశారని అన్నారు. ప్రజల సంపదను కూడా దోచుకున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి పార్టీతో ప్రజలకు, సమాజానికి కూడా మేలు జరగదని తెలిపారు.
