జగన్ ప్రిపేర్ గా ఉన్నారా ?
ఇపుడు అరెస్టు అన్నది జగన్ వైపు వచ్చిందని అంటున్నారు. దానికి జగన్ కూడా ప్రిపేర్ గానే ఉన్నారని చెబుతున్నారు.
By: Tupaki Desk | 22 July 2025 9:32 AM ISTఏపీలో రాజకీయం దేశంలో ఎక్కడా కనిపించడం లేదు. పూర్తిగా ప్రతీకారాత్మకమైన రాజకీయాలుగా సీన్ ఉంది. వారు వస్తే వీరి అరెస్టులు వీరు వస్తే వారి అరెస్టులు అన్నట్లుగా సీన్ ఉంది. అరెస్టుల సందర్భంగా అవినీతి అక్రమాలు అంటున్నారు. వాటి మీదనే కేసులు పెడుతున్నారు. అయితే జనాలు వాటిని ఏ మేరకు పట్టించుకుంటున్నారు అన్నది కూడా చర్చగా ఉంది.
నిజానికి చూస్తే అవినీతిని ఎంతగా ఎక్స్ పోజ్ చేసినా జనాలు వాటి మీద తీర్పులు ఇవ్వడం లేదు. ఉన్నత వర్గాలు అభివృద్ధి అజెండాని జై కొడితే దిగువ మధ్యతరగి పేదలు సంక్షేమానికి సై అంటున్నారు. 2024 ఎన్నికల్లో అదే జరిగింది. జగన్ సంక్షేమం మీద చంద్రబాబు రెట్టింపు ఇస్తామని చెప్పారు. దాంతో అటు ఓటు ఇటు మళ్ళింది. ఇక అభివృద్ధి విషయమూ పనిచేసింది. దాంతో పాటు చంద్రబాబును 75 ఏళ్ళ వయసులో అరెస్టు చేసి ఏకంగా 53 రోజుల ఆటు జైలులో ఉంచారు అన్న సానుభూతి వెల్లువలా వీచి వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసింది.
ఇక వైసీపీ హయాంలో అరెస్టులు అయిన టీడీపీ నేతలు అంతా మంచి మెజారిటీతో గెలిచి వచ్చారు.దాంతో ఇపుడు వైసీపీ నేతలు కూడా అరెస్టులకు రెడీ అవుతున్నారు జైలులో కొన్నాళ్ళు ఉంటే పోయేది ఏముంది పైగా రాజకీయంగా కొత్త లుక్ వస్తుందని అంటున్నారు. అందుకే అంతా జైలుకు పోవడానికి సిద్ధపడుతున్నారు. ఇక చెవిరెడ్డి భాస్కర రెడ్డి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజాగా మిధున్ రెడ్డి అరెస్టు అయ్యారు.
ఇపుడు అరెస్టు అన్నది జగన్ వైపు వచ్చిందని అంటున్నారు. దానికి జగన్ కూడా ప్రిపేర్ గానే ఉన్నారని చెబుతున్నారు. ఆయన కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ తాను తాడేపల్లి పార్టీ ఆఫీసులోనే ఉన్నానని అన్నారు. అరెస్టు చేసుకోవచ్చు అన్నట్లుగానే ఆయన ఆనాడు మాట్లాడారు.
ఇక ఏపీలో సంచలనం రేపుతున్న లిక్కర్ స్కాం విషయంలో జగన్ ని అరెస్టు చేసినా మహా అయితే రెండు నుంచి మూడు నెలలు మాత్రమే ఉంచగలరని ఆ తరువాత ఏమి జరుగుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ జైలు నుంచి వచ్చి జనంలోకి వెళ్తే వెల్లువలా సానుభూతి వస్తుందని వైసీపీ 2.0 కొత్త గేరు మారుస్తుందని కూడా చెబుతున్నారు.
జైలుకు వెళ్ళి వచ్చిన వారు ఎవరూ చెడిపోలేదని అది అన్ని పార్టీలకు కలసివచ్చిందని వైసీపీకి మరోసారి కలిసి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్ మీద లక్ష కోట్ల ఆరోపణలను 2014 ఎన్నికల్లో టీడీపీ చేసినా అత్యధిక సీట్లు గెలిచిందని గుర్తు చేస్తున్నారు. 2019లో కూడా లక్ష కోట్ల ఆరోపణలు చేశారని చెబుతున్నారు. అయితే చంద్రబాబు స్కిల్ స్కాం చేశారు అన్నా జగన్ అవినీతి చేశారని అన్నా జనాలు తీర్పు ఇచ్చే విషయంలో వాటిని కొలమానాలుగా ఎంత వరకూ తీసుకుంటున్నారని చర్చకు తేర లేస్తోంది.
ఏది ఏమైనా జైలు అంటే గతంలో ఉన్న భయం బెరుకు అయితే ఇపుడు ఎవరికీ కనిపించడం లేదు. పైగా వారూ వీరూ అంతా జైలుని చూస్తున్న వారే అయినపుడు కక్ష పూరిత రాజకీయాలు అని ఏపీలో జనాలకు కూడా ఒక నిర్ధారణ వస్తున్నపుడు దాని వల్ల రాజకీయ లాభమే అని అంటున్నారు. సో వైసీపీ నేతలు జైలుకు పోయేందుకు రెడీగానే ఉన్నారుట.
