Begin typing your search above and press return to search.

తెలంగాణా మోజు వదులుకోవడమే బెటరా ?

ఏపీ తెలంగాణా రెండుగా విభజించబడ్డాయి. ఇది జరిగి పుష్కర కాలం అయింది. దానికి ముందు చరిత్ర కూడా అందరికీ తెలుసు.

By:  Satya P   |   5 Jun 2026 10:15 AM IST
తెలంగాణా మోజు వదులుకోవడమే బెటరా ?
X

ఏపీ తెలంగాణా రెండుగా విభజించబడ్డాయి. ఇది జరిగి పుష్కర కాలం అయింది. దానికి ముందు చరిత్ర కూడా అందరికీ తెలుసు. నిజం చెప్పాలీ అంటే 2000 సంవత్సరం తరువాత తెలంగాణా ఉద్యమం సాగుతూనే ఉంది. అది 2014 నాటికి ఫలప్రదం అయింది. ఈ మధ్య కాలం అంతా కూడా తెలంగాణాకు అనుకూలంగా వ్యతిరేకంగా బిగ్ డిబేట్స్ సాగాయి. చివరికి తెలంగాణా రాష్ట్రం ఇవ్వడం అన్నది అనివార్యం అయింది. ఇది సజీవమైన నిజం. ఇందులో ఎలాంటి కాల్పనికత కూడా లేదు. తమ ఆకాంక్షలను జనంలో పెట్టి ఉద్యమంగా మలచి తెలంగాణాను సాధించుకుంది అక్కడి పౌర సమాజం. అందువల్ల తెలంగాణా తెచ్చిన ఇచ్చిన లేదా పోరాడిన ఘనత అంతా నాలుగు కోట్ల తెలంగాణా ప్రజలదే అనడం సబబు.

మూలం అదే అయినపుడు :

మరో వైపు చూస్తే తన సొంత అస్తిత్వం కోసం ఆత్మ గౌరవం కోసం తెలంగాణా తొలి విడత కానీ మలి విడత కానీ పోరాటం సాగింది. తామే సొంతంగా పాలించుకోవాలన్నది వారి కోరిక. దానికి ప్రాతిపదిక కూడా ఉంది. హైదరాబాద్ స్టేట్ గా అంతకు ముందు ఉంది. ఉమ్మడి ఏపీ విలీనం కాకముందు తెలంగాణా సొంత అస్తిత్వం అది. దాని కంటే ముందు పన్నెండవ శతాబ్దం తరువాత కూడా కోస్తా రాయలసీమల నుంచి తెలంగాణా విడివడి వేరే ప్రాంతంగా ఉందని కూడా చరిత్ర చెబుతోంది. ఇలా తెలంగాణా అన్నది చాలా శతాబ్దాలుగా వేరుగా ఉంటూ వస్తోంది. కలిసి ఉన్నది మాత్రం అరవై ఏళ్ళు అయినా తొలి విడత మలివిడత ఉద్యమం కాలాన్ని తీసి పక్కన పెడితే గట్టిగా నాలుగు దశాబ్దాలు సామరస్యంగా ఉన్నారేమో అని చెప్పాల్సి ఉంటుంది.

సెంటిమెంట్ గట్టిగానే :

ఇక తెలంగాణాలో సెంటిమెంట్ గట్టిగానే ఉంది అది కేవలం నాయకులలో ఉంది, ప్రజలలో లేదు అనుకుంటే కూడా పొరపాటు. ప్రజలు ఎన్నికలప్పుడు తమ రాజకీయ చైతన్యాన్ని చూపిస్తూనే ఉన్నారు. అక్కడి పార్టీలకే వారు ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. అదే సమయంలో ఆంధ్రా నాయకత్వం ముద్రతో ఉన్న పార్టీలకు మెల్లగా చెల్లు చీటి రాసేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇటీవల చరిత్రగానే ఉంది. అలాంటపుడు ఏపీలోని పార్టీలు తెలంగాణాలో పోటీ చేయాలనుకోవడం మీద కూడా చర్చ సాగుతోంది. ఏపీ భౌగోళికంగా పెద్ద రాష్ట్రం. పైగా రాజకీయంగా స్పేస్ కూడా కావాల్సినంత ఉంది. ఇక ఏపీని ఎంతగానో అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. ఏపీ ప్రజల ఆలోచనలు ఆశలు చాలా ఎక్కువగా ఉన్న తరుణంలో ఏపీలో ఉన్న పార్టీలు ముందుగా చేయాల్సింది తమ గడ్డ మీద నవ నిర్మాణం చేయడమే అన్న సూచనలు సలహాలూ మేధావుల నుంచి వినవస్తున్నాయి.

ఇప్పటప్పట్లో కుదిరేది కాదు :

ఇక తెలంగాణాలో పోటీ చేయకూడదా రాజ్యాంగం కల్పించిన హక్కు ఇవ్వన్నీ ప్రకటనలకూ నినాదాలకూ బాగానే ఉంటాయి. కానీ ఆచరణలోనే ఇబ్బందులు ఉంటాయి. అక్కడ ప్రజలు మనో భావాలు ఎమోషన్స్ అన్నీ కూడా గమనంలోకి తీసుకున్నపుడు ఇప్పటప్పట్లో ఆంధ్రా పార్టీలకు తెలంగాణా రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించే అవకాశాలు అయితే కష్టమన్న విశ్లేషణ ఉంది. మరిన్ని దశాబ్దాలు గడవాలి. మరి కొన్ని తరాలు ముందుకు సాగాలి. అపుడు కచ్చితంగా అక్కడ కూడా స్పేస్ ఉండవచ్చేమో. కానీ ఇంకా పచ్చిగా ఉన్న ఈ నేపధ్యంలో అయితే ఈ తరహా రాజకీయ విన్యాసాలకు భంగపాటు తప్ప మరేమీ దక్కవన్నది కఠినమైన విశ్లేషణగానే ఉంది. అందువల్ల ఏపీలో ఉన్న ప్రాంతీయ పార్టీలు తమ సొంత రాష్ట్రం మేలు కోసం గట్టి ప్రయత్నం చేయడం ద్వారా ముందుకు సాగడమే తక్షణ కర్తవ్యం అని అంటున్నారు అంతా.