Begin typing your search above and press return to search.

ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్.. సైనైడ్‌తో అల్లుడి హత్య?

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.

By:  A.N.Kumar   |   25 Aug 2026 9:45 AM IST
ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్.. సైనైడ్‌తో అల్లుడి హత్య?
X

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య గోదావరిలో దూకి ప్రాణాలు తీసుకున్న ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్‌ సాధిక్‌ ఖాన్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా సౌజన్య భర్త జగదీశ్వరరెడ్డి మృతిపై నమోదైన కేసు దర్యాప్తులో కీలక అంశాలు బయటపడుతున్నట్లు సమాచారం.

భర్త మృతిపై సౌజన్య లేఖలో కీలక ఆరోపణలు

సుమారు 45 రోజుల క్రితం సౌజన్య భర్త జగదీశ్వరరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. అయితే తన భర్త సహజ మరణం చెందలేదని.. సాధిక్‌ ఖాన్‌ విషప్రయోగం చేసి హత్య చేశాడని సౌజన్య తన లేఖలో ఆరోపించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ లేఖ ఆధారంగా జగదీశ్వరరెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో సాధిక్‌ ఖాన్‌పై ప్రత్యేకంగా కేసు నమోదైంది.

తాజా దర్యాప్తులో జగదీశ్వరరెడ్డికి సైనైడ్‌ ఇచ్చి హత్య చేసినట్లు అనుమానిస్తూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. నిందితుడు సైనైడ్‌ను ఓ బంగారు నగల దుకాణం నుంచి కొనుగోలు చేశాడా? దాన్ని ఎలా ఉపయోగించాడు? అనే కోణాల్లో ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.

మాటలతో మభ్యపెట్టి.. బ్లాక్‌మెయిల్‌?

సౌజన్యను సాధిక్‌ ఖాన్‌ మాటలతో మభ్యపెట్టి.. ఆమెతో ఉన్న వ్యక్తిగత సంబంధాలు, ప్రైవేట్‌ వీడియోలు, సంభాషణలను ఉపయోగించి బెదిరించాడనే ఆరోపణలు కూడా కేసులో ఉన్నాయి. కుటుంబ సభ్యులను వేధించడంతో పాటు ఆస్తులు, బ్యాంకు లాకర్‌ వివరాలు, ఇతర విలువైన వస్తువుల విషయంలోనూ ఒత్తిడి తెచ్చినట్లు నూకరాజు కుటుంబం రాసిన లేఖల్లో ఆరోపణలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు సౌజన్యను మతం మార్చుకోవాలని సాధిక్‌ ఒత్తిడి తెచ్చినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ వెల్లడించినట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. బ్లాక్‌మెయిల్‌, బెదిరింపులకు గురైతే బాధితులు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని ఎస్పీ సూచించారు.

ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది?

ఆగస్టు 16న నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు గోదావరి నదిలోకి దూకినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో నూకరాజు, మీనా, సౌజన్య మృతి చెందగా.. మనవడు ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం నూకరాజు కారులో లభించిన లేఖ... సౌజన్య రాసిన లేఖలు కేసు దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారాయి.

ఆత్మహత్య ఘటన అనంతరం సాధిక్‌ ఖాన్‌ పరారయ్యాడు. అతడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు పలు రాష్ట్రాల్లో గాలింపు చేపట్టి చివరకు ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్‌లో ఆగస్టు 22న అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం ట్రాన్సిట్‌ వారెంట్‌పై కాకినాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది.

సౌజన్య సహకరించిందా? భాస్కర్‌రెడ్డి సంచలన ఆరోపణ

ఇదిలా ఉంటే తన కుమారుడు జగదీశ్వరరెడ్డి హత్యలో సౌజన్య సహకారం కూడా ఉండొచ్చని ఆమె మామ భాస్కర్‌రెడ్డి ఆరోపించడం ఈ కేసులో మరో సంచలనంగా మారింది. అయితే ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు సాధిక్‌ ఖాన్‌ పాత్ర, జగదీశ్వరరెడ్డి మృతి వెనుక అసలు కారణం, విషప్రయోగం జరిగిందా లేదా అనే అంశాలతో పాటు సౌజన్య లేఖల్లో పేర్కొన్న విషయాలను ఆధారాలతో సరిపోల్చే పనిలో ఉన్నారు.

సాధిక్‌ ఖాన్‌ అరెస్టుతో కేసులో కీలక దశకు చేరుకున్నప్పటికీ.. జగదీశ్వరరెడ్డి మరణం హత్యేనా? సైనైడ్‌ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విషప్రయోగంలో ఎవరి పాత్ర ఉంది? నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన పూర్తి పరిణామాలేంటి? వంటి ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తు, ఫోరెన్సిక్‌ ఆధారాలు, తదుపరి న్యాయ ప్రక్రియలోనే స్పష్టమైన సమాధానాలు లభించాల్సి ఉంది.