జాతీయ స్థాయిలోనూ 'మెరిసిన' పవన్ కల్యాణ్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా కూడా ఉన్న విషయం తెలిసిందే.
By: Garuda Media | 3 Jun 2026 10:31 AM ISTఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గా కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఈ శాఖ పగ్గాలు చేపట్టిన తర్వాత.. పంచాయతీల స్థాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. పంచాయతీల మెరుగుదలకు ఎంతో కృషి చేస్తున్నారు. తాజాగా ఈ అభివృద్ధి తాలూకు ఫలితాలు.. ఢిల్లీ వరకు చేరాయి. దీంతో కీలకమైన పంచాయతీ రాజ్ విభాగానికి 5 జాతీయ అవార్డులు లభించాయి. వీటిని బుధవారం కేంద్ర ప్రభుత్వం అందించనుంది. ఈ కార్యక్రమానికి పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.
జాతీయ పంచాయతీ అవార్డులు- 2025 ప్రదానోత్సవం బుధవారం ఢిల్లీలోని స్కోప్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. దేశ వ్యాప్తం గా వివిధ రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన 42 అత్యుత్తమ పంచాయతీలకు `జాతీయ పంచాయతీ` అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకలో... దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగం కింద 34 గ్రామ పంచాయతీలకు, నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగం కింద 8 పంచాయతీలకు అవార్డులను అందిస్తారు.
వీటి లో 5 పంచాయతీలు ఏపీనుంచి ఎంపికయ్యాయి. అవి కూడా.. 2025 సంవత్సరానికి కావడం గమనార్హం. మౌలిక వసతుల అభివృద్ధి, రహదారులు, జల్ జీవన్ మిషన్‌ను సమగ్రంగా అమలు చేయడం, పంచాయతీల్లో భవనాల నిర్మాణం.. మెరుగైన పాలన వంటి కీలక విషయాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులను ఇస్తున్నారు. డిప్యూటీ సీఎంగా.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్.. కీలక రోల్ పోషిస్తున్నారు. పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను నేరుగా వాటి ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. గతంలో ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకున్న విషయం తెలిసిందే.
అదే విధంగా పంచాయతీ రాజ్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కేరళ నుంచి కృష్ణ చైతన్య అనే ఐఏఎస్ అధికారిని తీసుకువచ్చి.. ఆయనకు బాధ్యతలు అప్పగించారు. తరచుగా పంచాయతీలపై దృష్ట పెడుతున్న పవన్.. ఇక్కడ మెరుగైన సౌకర్యాల కల్పన.. మౌలిక వసతుల ఏర్పాటు వంటివాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీల్లో పాలనను మెరుగు పరుస్తున్నారు. ఇలా.. పవన్ వచ్చిన తర్వాత.. రాకముందు.. అన్నట్టుగా పంచాయతీల్లో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పడ్డాయి. మౌలిక వసతులు కూడా వచ్చాయి.
