Begin typing your search above and press return to search.

ఊబకాయం ఏపీలో ఆందోళనకరం

ఏపీలో తీవ్ర స్థాయిలో ఉన్న ఊబకాయ సమస్య రాష్ట్ర ప్రజారోగ్యానికి సవాల్ విసురుతుంది అంటున్నారు.

By:  Satya P   |   14 Aug 2026 8:30 AM IST
ఊబకాయం ఏపీలో ఆందోళనకరం
X

మారుతున్న జీవన శైలితో ఊబకాయం పెరిగిపోతోంది. భారీ శరీరాకృతులతో జనాలు సంచరిస్తున్నారు. అధిక బరువుతో అల్లల్లాడుతున్నారు. దానితో అనేక ఇతర వ్యాధులు చుట్టుముట్టి నానా అవస్థలు పడుతున్నారు. ఆరోగ్యానికి అతి పెద్ద సవాల్ గా ఊబకాయం ఉంది. ఏపీలో చూస్తే ఊబకాయం కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పరిస్థితి చూస్తే ఎంతో ఆందోళనకరంగా ఉంది. ఎంతలా అంటే రాష్ట్రంలో ప్ర‌తి ఇద్ద‌రిలో ఒక‌రికి అధిక బ‌రువుతో పాటు ఊబకాయం ఉందని నివేదికలు తెలియచేస్తున్నాయి. ఇందులో మహిళలలోనే ఇంకా ఎక్కువగా ఉండడం మరింతగా కలవరపెడుతోంది.

పెను సవాల్ గా మారి :

ఏపీలో తీవ్ర స్థాయిలో ఉన్న ఊబకాయ సమస్య రాష్ట్ర ప్రజారోగ్యానికి సవాల్ విసురుతుంది అంటున్నారు. తీవ్ర రూపం దాలుస్తోన్న ఊబకాయ సమస్యను ఎదుర్కొనేందుకు జాయింట్‌ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. జీవనశైలిలో వస్తోన్న మార్పుల కారణంగా ఊబకాయం ప్రధాన ప్రజారోగ్య సవాల్‌గా మారుతోందని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు. సంపద పెరుగుతున్న వేగం కంటే ఊబకాయం విస్తరిస్తున్న వేగం ఎక్కువగా ఉందని అంటున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో ఊబకాయం సమస్య తీవ్రతరమవుతోందని ఆరోగ్య రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

తీవ్ర స్థాయిలోనే సమస్య :

ఇదిలా ఉంటే ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక బ‌రువు ఉన్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంద‌ని నివేదికలు తెలియచేస్తున్నాయి. 2010 నుంచి 2030 మ‌ధ్య వీరి సంఖ్య 115 శాతం పెరిగి సుమారు 200 కోట్ల‌కు చేరుతుంద‌న్న అంచ‌నాలున్నాయి. ఊబ‌కాయంతో బాధ‌ప‌డే చిన్నారుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగే అవ‌కాశం ఉందని అంటున్నారు. ఇక జాతీయ ఆరోగ్య కుటుంబ స‌ర్వే-5 ప్ర‌కారం దేశంలో 24 శాతం మ‌హిళ‌లు 23 శాతం పురుషులు అధిక బ‌రువుతో ఉన్నారు. ఇదే స‌ర్వే-6 ప్ర‌కారం మ‌హిళ‌ల్లో 30.70 శాతం, పురుషుల్లో 27.30 శాతం న‌మోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే ఊబకాయ పరిస్థితి మ‌రింత ఆందోళనకరంగా ఉందని అంటున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 ప్రకారం రాష్ట్రంలో 47.90 శాతం మహిళలు 44.40 శాతం పురుషులు అధిక బరువుతో ఉన్నారు రాష్ట్రంలో దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు అధిక బరువుతో ఉన్నట్లేనని లెక్క తేలుతోంది. అధిక బరువు, ఊబకాయానికి జీవనశైలిలో మార్పులు, శారీరక కదలికలు తగ్గడం, అధిక ఆహారం, అల్ట్రా ప్రాసెస్డ్‌ ఆహార పదార్థాల వినియోగం, చక్కెర పానీయాలు, పని ఒత్తిడి, ఎక్కువ సమయం మొబైల్ బైల్ స్క్రీన్‌ల‌ ముందు గడపడం వంటి అంశాలు కారణమవుతున్నాయని ఆరోగ్య రంగ నిపుణులు అంతే కాకుండా పిల్లల్లో బహిరంగ క్రీడలు, శారీరక కార్యకలాపాలు తగ్గడం కూడా సమస్యను పెంచుతోంది.

కూటమి స్పెషల్ ఫోకస్ :

ఈ నేపథ్యంలో ఏపీలో కూటమి ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టిని పెట్టింది. రాష్ట్రంలో ఊబకాయ నియంత్రణకు అవసరమైన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు నిర్ణయించింది. ఇందుకోసం జాయింట్ టాస్క్ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ టాక్స్ ఫోర్సులో ఆరోగ్య శాఖతోపాటు విద్య, క్రీడలు, మహిళా శిశు సంక్షేమం తదితర శాఖలను భాగస్వామ్యం చేయడం ద్వారా సమస్యను సమగ్రంగా ఎదుర్కొనే ప్రయత్నం చేసేందుకు కృషి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ చెప్పారు. ఊబకాయాన్ని ఒక్క ఆరోగ్య శాఖకు మాత్రమే సంబంధించిన సమస్యగా చూడకూడదని ఆయన అన్నారు అంతే కాదు వైద్య, ఆరోగ్య శాఖలో అంతర్భాగంగా ఉన్న ఫుడ్‌ సేఫ్టీ శాఖ‌ను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా ఈ శాఖ‌ ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. ఆహార నాణ్యత, ప్రజల ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు కొనసాగిస్తామని మంత్రి పేర్కొన్నారు.